పల్లెల్లో ఎల్‌ఈడీ పంచాయితీ

ABN , First Publish Date - 2020-10-28T10:39:00+05:30 IST

గ్రామాల్లో వీధి లైట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడంపై సర్పంచ్‌ల నుంచి నిరసన వ్యక్తమౌతోంది

పల్లెల్లో ఎల్‌ఈడీ పంచాయితీ

ఊర్లలో లైట్ల ఏర్పాటు బాధ్యత ఏజెన్సీకి..

నేటి నుంచి పంచాయతీల వారీగా సేకరించనున్న తీర్మానాలు

వీధి బల్బ్‌ల పేరుతో నిధుల దుర్వినియోగానికి చెక్‌

వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు

ఏజెన్సీలకు కేటాయిస్తే నిర్వహణ కష్టమౌతుందని ఆందోళన


మహబూబ్‌నగర్‌ :

గ్రామాల్లో వీధి లైట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడంపై సర్పంచ్‌ల నుంచి నిరసన వ్యక్తమౌతోంది. ఏజెన్సీ వారు బల్బ్‌లు వేసి వెళ్లిపోతే, అవి వెలగకపోతే ప్రజలు తమనే నిలదీస్తారని అంటున్నారు. ఈ నిర్ణయం అమలు కోసం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి తీర్మానాలు చేయాలని చెప్పగా, సర్పంచ్‌ల వ్యతిరేకత నేపథ్యంలో ఏ మేరకు అమలవుతుందో వేచి చూడాలి.


సర్పంచ్‌లు అంటే ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీలు, వీధిలైట్ల నిర్వహణ చూసేవారు. మిషన్‌ భగీరథ పథకంతో నీటి మోటార్ల నిర్వహణ, పారిశుధ్య కార్మికుల ఏర్పాటుతో డ్రైనేజీల నిర్వహణ వారు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. తాజాగా వీధి లైట్ల ఏర్పాటు బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకునేందుకు సిద్ధమౌతోంది. మునిసిపాలిటీల తరహాలో ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు ఆ బాధ్యతలను అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై సర్పంచల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.


తీర్మానాలు సేకరించాక లైట్ల ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన లిమిటెడ్‌ ఏజెన్సీతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమై గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లను వేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే మొదటి సారిగా ఈ సంస్థ ద్వారా నాలుగేళ్ల కిందట పాలమూరు పురపాలికలో ఎల్‌ఈడీ బల్బ్‌లను వేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. లైట్లు వేసిన తరువాతనే వాటి  ఖర్చును ప్రతి నెలా కొంత మేర చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనివల్ల విద్యుత్‌ బిల్లులు పెద్ద ఎత్తున ఆదా అవుతున్నాయి. ఇప్పుడు అన్ని పంచాయతీలలో ఈ ఎల్‌ఈడీ బల్బ్‌లు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రకమైన బల్బ్‌లను వాడుతున్నారు. లైట్ల పేరుతో చాలా చోట్ల నిధుల దుర్వినియోగం జరుగుతోంది. కొన్ని పంచాయతీలలో ఏటా 3-4 సార్లు లైట్ల పేరుతో నిధులు డ్రా చేస్తున్నారు. అందుకు రకరకాల కారణాలు చూపుతున్నారు.


పంచాయతీకి ఏటా వచ్చే నిధుల్లోంచి 10-15 శాతం నిధులు లైట్ల పేరిట ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల దుర్వియోగాన్ని అరికట్టడంతోపాటు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా అంతటా ఒకే యూనిఫామ్‌లో బల్బ్‌లను వేయనున్నారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు విద్యుత్‌ బిల్లులు చాలా వరకు ఆదా చేయవచ్చు.


వ్యతిరేకిస్తున్న సర్పంచ్‌లు

ఎల్‌ఈడీ బల్బ్‌లను వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లైట్లు వేసే బాధ్యతల నుంచి తమను తప్పించొద్దని అంటున్నారు. ఏజెన్సీ లైట్లు వేసి వెళ్తే మధ్యలో అవి పాడైపోతే నిర్వహణ ఎవరు చూసుకోవాలని?, ప్రజలు నిలదీసేది తమనేనని చెబుతున్నారు. సర్పంచ్‌ల హక్కులను హరించవద్దని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల కొనుగోలుకు సంబంధించి నిబంధనలు పెడితే ఆ నిబంధనలకు లోబడి నడుచుకుంటామని చెబుతున్నారు. 


ప్రజల మేలుకోసమే

ప్రజల మేలు కోసం చేసే ఏ కార్యక్రమాన్నైనా ఆమోదించాల్సిందే. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు సేకరించి, అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేస్తాం. ఇలా చేయడం వల్ల పారదర్శకంగా ఉంటుంది. బల్బ్‌లు ఎగిరిపోవడం ఉండదు. లైట్లు వేసిన మూడు నెలల తరువాతే ఏజెన్సీకి వాయిదాలు చెల్లించడం జరుగుతుంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించిన తరహాలో నెలకు కొంత వారికి చెల్లింపులు చేస్తారు. పల్లెలో ఇప్పుడు వాటర్‌ సప్లై మెరుగైంది. పారిశుధ్యం మెరుగైంది. వీధి లైట్ల నిర్వహణ మెరుగుచేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

డీపీఓ, వెంకటేశ్వర్లు

Updated Date - 2020-10-28T10:39:00+05:30 IST