Abn logo
Mar 15 2021 @ 00:00AM

లా పట్టా వదిలి ట్రక్‌ స్టీరింగ్‌ పట్టి...

జీవితమంటే పోరాటం. ఆ పోరాటంలోనే విజయం ఉంటుంది. దేశంలోనే తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌ యోగితా రఘువంశీ జీవితాన్ని తరచి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కోరి లాయర్‌ అయిన ఆమె కథ... ఆ తరువాత అనుకోని మలుపు తిరిగింది. భర్త దూరమై కుటుంబ భారం భుజాలపై పడింది. దాన్ని నెట్టుకొచ్చేందుకు ట్రక్‌ స్టీరింగ్‌ పట్టుకున్న యోగిత ‘రాస్తా’ ఇది...


ఇది ఎవరి కోసమో కాదు. నా కోసం... నా కుటుంబం కోసం. ఎన్ని ఇబ్బందులెదురైనా ఓర్చి ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నాను. అడ్డంకులు, ఆటంకాలన్నింటినీ దాటుకుని నేడు ఈ స్థాయిలో ఉన్నాను. 


సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం... కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం యోగితా రఘువంశీ నైజం కాదు. ఆటుపోట్లను తట్టుకుని ముందుకు దూకే ధైర్యం ఆమెది. అందుకే రేయనక పగలనక రహదారులపై సాగే ప్రయాణం ప్రమాదమని తెలిసినా వెనకడుగు వేయలేదు. కుటుంబాన్ని నడిపించడానికి ట్రక్‌ డ్రైవర్‌ అవతారమెత్తడానికీ ఆమె జంకలేదు. 


కఠినశీలత, సంకల్పబలం, ప్రతికూల పరిస్థితుల్లోనూ తలవొగ్గని తెగువ... ఇదీ యోగిత తీరు. మహారాష్ట్రలోని నందూర్బార్‌లో పుట్టి పెరిగిన ఆమె నలుగురు సంతానంలో ఒకరు. కామర్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. భర్త ట్రక్‌ డ్రైవర్‌. ఆయన ప్రోత్సాహంతోనే ఇష్టపడి లా చదివారు. భార్యగా, తల్లిగా... సంతోషంగా సాగిపోతుంది ఆమె జీవితం. ఇంతలోనే ఊహించని కుదుపు. భర్త చనిపోయారు. ఇద్దరు చిన్నారుల బాధ్యత తనపై పడింది. కుటుంబానికి అన్నీ తానై నెట్టుకురావాల్సి వచ్చింది. పదహారేళ్ల కిందటి కథ ఇది. 


కఠినమైనా వెనకాడలేదు

న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేద్దామనేది యోగిత కల. భర్త మరణంతో ఆ కల చెదిరిపోయింది. దీంతో కఠినమైన ట్రక్‌ డ్రైవర్‌ వృత్తిని ఎంచుకుంది. ఎందుకని అడిగితే... ‘‘లా ప్రాక్టీస్‌ ప్రారంభించాలంటే మొదట సీనియర్‌ లాయర్‌ వద్ద చేరాలి. అనుభవం గడించడానికి కొన్నేళ్లు పడుతుంది. అప్పటి వరకు నాకు నామమాత్రపు సంపాదనే వస్తుంది. ఇది నేను, నా ఇద్దరు పిల్లలు బతకడానికి ఏమాత్రం సరిపోదు. ఏంచేయాలని ఆలోచిస్తున్నప్పుడు ట్రక్‌ డ్రైవర్లకైతే మంచి సంపాదన ఉంటుందని, ఎప్పటికప్పుడు డబ్బు చేతిలో పడుతుందని తెలుసుకున్నాను. అన్నింటికీ మించి సంవత్సరం పొడవునా ఉపాధి ఉండే పని. ఈ కారణంతోనే డ్రైవర్‌గా మారాను’’ అంటూ యోగిత చెప్పుకొచ్చారు. 


ముందడుగు వేస్తేనే... 

యోగిత నడిపే వాహనం ఆమె భర్తదే. ఆయన దూరమయ్యాక చిన్న పిల్లలను చూసుకోవడం కష్టమయ్యేది. అందుకే మొదట్లో తమ ట్రక్‌కు డ్రైవర్‌ను పెట్టారు ఆమె. కానీ దానివల్ల నష్టాలే కానీ పైసా ఆదాయం రాలేదు. ‘‘దీంతో నేనే డ్రైవర్‌ అవతారమెత్తాను. ఆ నిర్ణయం మా జీవితాలనే మార్చేసింది. నష్టాల నుంచి లాభాల బాట పట్టాను. అప్పుడే అర్థమైంది... గొప్ప గొప్ప విషయాలు ముందడుగుతోనే సాధ్యమని’’ అంటారు ఆమె. అలా పదహారేళ్ల కిందట ట్రక్‌ స్టీరింగ్‌ పట్టుకున్న ఆమె అంతర్రాష్ట్ర రహదారులపై ఇప్పటికి కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. మగవాళ్లకే పరిమితమనుకున్న రంగంలోకి ప్రవేశించిన తొలి మహిళగా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 


భోపాల్‌ టు అహ్మదాబాద్‌... 

‘‘లారీ డ్రైవర్‌గా తొలి రోజు నాకు ఇంకా గుర్తుంది. అది భోపాల్‌ నుంచి అహ్మదాబాద్‌కు ట్రిప్పు. దాదాపు 600 కిలోమీటర్లు. రోడ్లు, రూటు కూడా నాకు తెలియదు. పూర్తిగా కొత్త వృత్తి. కానీ అందుకు సన్నద్ధమయ్యే ఉన్నాను. ట్రక్కు ఎక్కాను. స్టీరింగ్‌ పట్టుకున్నాను. దారి పొడవునా డైరెక్షన్లు అడుగుతూ చివరకు గమ్యం చేరుకున్నాను’’ అని గతాన్ని గుర్తుచేసుకున్న యోగిత తనకు ఎదురైన సవాళ్లను ఏనాడూ సవాలుగా భావించలేదు.


ఏదైనా సాధ్యమే... 

ఒక మహిళ దేశంలోనే మొట్టమొదటిసారి ట్రక్కు స్టీరింగ్‌ పట్టుకున్నప్పుడు చాలామంది అవహేళన చేశారు. నీవల్ల ఏమవుతుందని అవమానకరంగా మాట్లాడారు. చులకనగా చూశారు. కానీ ఇవేవీ చెవికి ఎక్కించుకోలేదు యోగిత. ‘‘మనల్ని మనం నమ్మితే ఎలాంటి లక్ష్యాన్నయినా చేరుకోగలం. మహిళగా మహానగరాల మధ్య ట్రక్‌ నడపాలంటే లెక్కకు మించిన సమస్యలు ఎదురవుతాయి. రహదారుల పక్కనుండే మెకానిక్‌లు, ధాబాల వద్ద మగవాళ్లు, మరెక్కడికి వెళ్లినా నన్ను అదోరకంగా చూసేవాళ్లు. కానీ అవేవీ నేను పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా నా పనిని నేను ప్రేమించాను. అవమానంగా భావించలేదు’’ అంటారు యోగిత. 


ఆ పిల్లలకు చదువు చెబుతా... 

సాధారణంగా ట్రాన్స్‌పోర్టు వాహనాలకు డ్రైవర్‌ అవుదామని ఏ ఆడపిల్లా కోరుకోదు. ఒకవేళ అలాంటి అమ్మాయిలు ఉంటే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తానంటారు యోగితా రఘువంశీ. ‘‘ఆడపిల్లలకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే... ఈ సమాజం మహిళలుగా మనకు గీసిన గిరిలోనే బందీ కాకూడదు.  స్టీరింగ్‌ వెనకాల కూర్చున్నప్పుడు శక్తివంతమైన మహిళనన్న అనుభూతి కలుగుతుంది. ఈ వృత్తిని ఎంచుకున్నందుకు గర్వంగా భావిస్తాను. సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతాను. అదే నాకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది’’ అని అంటుంది యోగిత.

ప్రత్యేకం మరిన్ని...