మోసగాళ్లను వదిలి.. రైతులపై ఫైర్‌

ABN , First Publish Date - 2022-06-10T06:09:23+05:30 IST

దగా పడ్డ రైతులు వారు. ఆరుగాలం శ్రమించి పండించిన వారి పంటను కాకులు ఎత్తుకుపోలేదు.

మోసగాళ్లను వదిలి.. రైతులపై ఫైర్‌
స్టేషన వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు

స్టేషనకు పిలిపించి.. సీఐ వార్నింగ్‌

హతాశులైన మొక్కజొన్న రైతులు 

ఆంధ్రజ్యోతితోనే డబ్బులు ఇప్పించుకోవాలట


పుట్లూరు, జూన 9: దగా పడ్డ రైతులు వారు. ఆరుగాలం శ్రమించి పండించిన వారి పంటను కాకులు ఎత్తుకుపోలేదు. ప్రభుత్వ వ్యవస్థలోని కొందరు దగా చేశారు. మార్కెట్‌ ధరకంటే కాస్త ఎక్కువ ధర ఇస్తామంటే నమ్మి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలకు రైతులు తమ పంట దిగుబడులను ఇచ్చారు. అలా తీసుకువెళ్లినవారు డబ్బులు చెల్లించలేదు. మార్క్‌ఫెడ్‌ అధికారులు చేతులు ఎత్తేశారు. పోలీసులు ‘పంచాయితీ’ పేరిట పెద్ద మనుషులకు వదిలేశారు. ఎక్కడా న్యాయం జరగలేదు. ఈ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. రెండు రోజులు వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన పోలీసులు మాట్లాడుదామని రైతులను స్టేషనకు పిలిచారు. దీంతో న్యాయం జరుగుతుందని మట్టి మనుషులు ఆశగా వెళ్లారు. తమను పిలిచింది న్యాయం చేసేందుకు కాదు.. అవమానించేందుకు, బెదిరించేందుకు అని తెలిసొచ్చాక.. ఆవేదనగా తిరుగుముఖం పట్టారు. పుట్లూరు పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఈ వ్యవహారం చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జున గుప్త రైతులను అవమానించేలా మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త రాయించారు కదా..? వాళ్లే డబ్బులు ఇస్తారు వెళ్లండి’ అని హూంకరించారు. ఆంధ్రజ్యోతి విలేకరిపైనా చిందులు తొక్కారు. 


ఎవరూ స్పందించలేదు..

తమ డబ్బులను ఇప్పించాలని బాధిత రైతులు అటు రాజకీయ నాయకులు, ఇటు జిల్లా అధికారుల వద్దకు పదులసార్లు తిరిగారు. ఏ ఒక్కరూ స్పందించలేదని ఆవేదన చెందుతున్నారు. ఆ డబ్బులు వేస్తే అంతో ఇంత అప్పు తీరుతుందని అంటున్నారు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే గానీ ఎవరి మనసూ కరగడం లేదని కంటతడి పెడుతున్నారు. 


కారణం ఏమిటో..

దిగుబడుల సేకరణ బాధ్యతలను అప్పగించిన సంస్థతో మార్క్‌ఫెడ్‌ అధికారులు కచ్చితంగా అగ్రిమెంట్‌ చేసుకోవాలి. సీడ్‌ లైసెన్సు ష్యూరిటీలు కూడా తప్పక తీసుకోవాలి. ఇక్కడ అగ్రిమెంట్‌ మాత్రమే తీసుకున్నారు. మిగిలిన వాటిని వదిలేశారు. ష్యూరిటీస్‌ తీసుకొని ఉంటే రైతులకు ఈ కష్టాలు ఉండేవికావు. అగ్రిమెంట్‌లో పొందుపరిచిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైతన్య సంఘంపై ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎంత మోసం..!

యల్లనూరు మండలం వాసాపురం, తిమ్మంపల్లి, వెన్నపూసపల్లి, చింతకాయమంద తదితర గ్రామాలకు చెందిన రైతులు మొక్కజొన్న, పప్పుశనగను మార్క్‌ఫెడ్‌ అధికారులు అప్పగించిన శ్రీచైతన్య వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘానికి విక్రయించారు. 15 ట్రక్కుల పప్పుశనగ, 313.5 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేసిన ఆ సంఘం.. డబ్బులు ఎగవేసింది. మోసపోయిన రైతులకు నెలలు గడిచినా న్యాయం జరగలేదు. ఈ మోసాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధిత రైతులను పుట్లూరు సర్కిల్‌ పోలీ్‌సస్టేషనకు రమ్మని సీఐ పిలిపించారు. రైతులు ఉదయం 9 గంటలకు స్టేషనకు వచ్చారు. కానీ గంటల తరబడి పడిగాపులు కాసినా వారిని పలకరించలేదు. ‘రైతులు వచ్చారు’ అని కిందిస్థాయి సిబ్బంది సీఐ మల్లికార్జునగుప్తకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. దాదాపు ఆరున్నర గంటలపాటు పోలీ్‌సస్టేషన ఆవరణలో రైతులు సీఐ పిలుపుకోసం ఎదురుచూశారు. పిలుపు రాకపోవడంతో మధ్యాహ్నం సమీపంలోని హోటల్‌కు వెళ్లి అల్పాహారం తిని వచ్చారు. చివరికి మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వారిని తన ఛాంబర్‌కు పిలిపించారు. రైతులను చూడగానే ఊగిపోయారు. సీఐ వ్యవహార శైలిని చూసి రైతులు బిత్తరపోయారు. సీఐ దుర్భాషలాడుతుంటే రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ‘మీరందరూ నా వద్దకు రాకుండా ఆంధ్రజ్యోతి పత్రికలో రాయించారు. వెళ్లి వాళ్లతోనే డబ్బులు ఇప్పించుకోండి’ అని మండిపడ్డాడు. ‘ఇక్కడి నుంచి వెళతారా లేదా?’ అని గద్దించాడు. దీంతో సీఐ చాంబర్‌ నుంచి రైతులు మౌనంగా బయటకు వచ్చారు. ఆ తరువాత రైతులను వెనక్కి పిలిపించి, ఫిర్యాదు రాసివ్వాలని మొక్కుబడిగా చెప్పి పంపించారు.


ఏం చేస్తానో నాకే తెలీదు..

‘నువ్వు నా గురించి ఏమేమో రాస్తున్నావు. అన్నీ గమనిస్తున్నాను. ఆంధ్రజ్యోతి విలేకరి అయితే నాకేమన్న భయమా? నేను అనుకుంటే నేను ఏమైనా చేయగలను. ఇకనైనా నా గురించి తెలుసుకుని ప్రవర్తించు. లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు’ అని రైతుల ఎదుట ఆంధ్రజ్యోతి విలేకరిపై సీఐ చిందులు తొక్కారు. ‘మీ విలేకరుల నోరే కంపు. మీరు రాసే వార్తలు ఇంకా కంపుకంపు. మీరు రాసే వార్తలను నేను పట్టించుకోను’ అని ఈసడించుకున్నారు. రైతులను మోసగించినవారిపై వార్తలు రాస్తే.. సీఐ ఇలా చిందులు వేయడం, ఆగ్రహంతో ఊగిపోవడానికి కారణాలు ఏమిటో..!

 

సెల్‌ఫోన ఇవ్వాల్సిందే..

ఆయనను ఎవరైనా కలవాలంటే.. వారి సెల్‌ఫోన్లను ఎస్‌ఐ రూంలో అప్పగించాలి. పుట్లూరు సీఐ మల్లికార్జునగుప్త జారీ చేసిన ఫత్వా ఇది. దీన్ని అతిక్రమించి, సెల్‌ఫోన్లతో ఎవరైనా లోనికి వెళితే.. కిందిస్థాయి సిబ్బందికి సినిమా చూపిస్తారు. వారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతారని సమాచారం. ఆయన నోటిదురుసుకు భయపడి.. స్టేషనకు వచ్చినవారిని సెల్‌ఫోన్లు తమకు అప్పగించాలని సిబ్బంది ప్రాధేయపడుతుంటారు. 


శాఖాపరమైన చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నట్లు

యల్లనూరు: మొక్కజొన్న, పప్పుశనగ కొనుగోళ్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులకు తెలిపినా చైతన్య సంఘంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతు పట్టడం లేదు. అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో కీలకంగా ఉండే ఇద్దరు సోమశేఖర్‌ను చైతన్య సంఘానికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అని తెలిసింది. సోమశేఖర్‌పై చర్యలకు ఉపక్రమిస్తే తమపేర్లు ఎక్కడ బయటకి వస్తాయో అని ఈ విషయాన్ని తొక్కి పెడుతున్నట్లు సమాచారం. రూ.20 లక్షలకు పైగా విలువైన పప్పుశనగ, మొక్కజొన్న  దిగుబడులను మార్క్‌ఫెడ్‌ గోదాముకు చేరవేయకుండానే అమ్మేశారు. పెద్దమొత్తంలో అవినీతి జరిగింది. రైతులే నేరుగా ఆ సంఘం ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. 

Updated Date - 2022-06-10T06:09:23+05:30 IST