లీజులపై అధ్యయనం

ABN , First Publish Date - 2021-08-05T05:30:00+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్‌ కమిటీ తొలి సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది.

లీజులపై అధ్యయనం
జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న మేయర్‌ హరివెంకటకుమారి, కమిషనర్‌ సృజన, సభ్యులు

ప్రక్షాళనకు జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం

తొలి సమావేశంలో వాడివేడిగా చర్చ

దుకాణాల లీజుల రెన్యువల్‌పై నిర్ణయం వాయిదా

సబ్‌ కమిటీ ఏర్పాటు

నివేదిక అందాక న్యాయపరమైన సలహాలు తీసుకున్నాకే ముందుకు

అజెండాలోని ఐదు అంశాల్లో మూడింటికి ఆమోదం


విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్‌ కమిటీ తొలి సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. అజెండాలో ప్రతిపాదించిన ఐదు అంశాల్లో మూడింటికి కమిటీ ఆమోదం తెలిపింది. జీవీఎంసీకి చెందిన దుకాణాల లీజు పొడిగింపు విషయంలో అక్ర మాలు జరిగాయని సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో సబ్‌ కమిటీ వేయాలని సమావేశం నిర్ణయించింది. అలాగే నక్కవానిపాలెంలోని వివేకానంద కల్యాణ మండపాన్ని కొవిడ్‌ సమయంలో జీవీఎంసీ వాడుకున్నందుకు...రూ.3 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించాలనడం హేతుబద్ధంగా లేదంటూ సభ్యులు వ్యతిరేకించడంతో ఆ ఆంశాన్ని పూర్తిగా రద్దు చేశారు.

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన, కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆధ్వర్యంలో పది మంది సభ్యుల స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది. ఐదు అంశాలతో అజెండాను తయారుచేసి సభ్యులకు అందజేయడంతో వాటిపై చర్చ జరిగింది. ముందుగా విద్యా విభాగానికి చెందిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన మూడు అంశాలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నాలుగో అంశంగా...మూడేళ్లు పూర్తయిన 143 దుకాణాలకు లీజు పొడిగింపుపై చర్చించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కార్యదర్శి లావణ్య దీనికి సంబంధించిన వివరాలను సమావేశంలో చదివి వినిపించారు. జీవీఎంసీకి నగరంలో సుమారు 900 దుకాణాలు ఉండగా, వీటిలో మూడేళ్ల లీజు పూర్తయినప్పటికీ రెన్యువల్‌ చేసుకోనివి 389 వున్నట్టు గుర్తించామన్నారు. వీటిలో 113 దుకాణాలు శిధిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించగా, మిగిలిన వాటికి అధికారులు నోటీసులు జారీచేశారన్నారు. వీటిలో 143 దుకాణాల లీజుదారులు గత మూడేళ్లలో బకాయిలను చెల్లించి, మూడేళ్లకొకసారి 33 శాతం చొప్పున అద్దె పెంచేందుకు సమ్మతి తెలిపారన్నారు. ఇవికాకుండా మరో 187 దుకాణాలు సబ్‌లీజులో వున్నట్టు గుర్తించడంతో వాటిని వేలంలో దక్కించుకున్న వారికి నోటీసులు జారీచేసినట్టు వివరించారు. లీజు పొడిగించుకునేందుకు సమ్మతించిన 143 మందికి తిరిగి రెన్యువల్‌ చేసేందుకు కమిటీ ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పగానే...సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిలో దశాబ్దాలుగా లీజు మొత్తాలు చెల్లించని వారున్నారని, అలాంటివారంతా మూడేళ్ల బకాయిలు చెల్లించేస్తే లైసెన్సు రెన్యువల్‌ చేసేస్తారా?...అని ప్రశ్నించారు. లీజుల వ్యవస్థలో అధికారుల సహకారంతోనే చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారని, జీవీఎంసీకి నామమాత్రపు లీజు ఇచ్చేలా వేలంలో దుకాణాలను దక్కించుకుంటున్నారని, ఆ మొత్తాన్ని కూడా సక్రమంగా చెల్లించకపోవడం వల్ల సంస్థ నష్టపోతోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కొంతమంది సభ్యులు...లీజు పేరుతో జరిగిన అవినీతి, తిరిగి రెన్యువల్‌ చేసేందుకు కొంతమంది కార్పొరేటర్లు చేస్తున్న పైరవీలపైౖ ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో   ప్రచురితమైన కథనాలను ప్రస్తావించినట్టు తెలిసింది. లీజుల వ్యవస్థలో భారీగా లొసుగులు ఉన్నాయని, ఇప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుందని సభ్యులంతా అభిప్రాయపడడంతో మేయర్‌ హరికుమారి ఆ అంశాన్ని పెండింగ్‌లో పెడుతున్నట్టు ప్రకటించారు. లీజులపై స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, జీవీఎంసీ అధికారులతో ఒక సబ్‌కమిటీగా నియమించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళదామని మేయర్‌ స్పష్టంచేశారు. అంతవరకూ లీజుల పొడిగింపు అంశాన్ని పెండింగ్‌లోనే వుంచాలని ఆదేశించారు. 

నక్కవానిపాలెంలోని వివేకానంద కల్యాణ మండపంలో జీవీఎంసీ మూడు నెలల 15 రోజులపాటు కొవిడ్‌ సెంటర్‌ నిర్వహించింది. ఆ కాలానికి లీజు మొత్తం నుంచి రూ.3,33,140 సంబంధిత కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ చెల్లించాలనే ప్రతిపాదనను సభ్యులు వ్యతిరేకించారు. లాక్‌డౌన్‌ సమయంలో శుభకార్యాలు, వేడుకలు జరుపుకునేందుకు అనుమతి లేదని, కల్యాణ మండపాలన్నీ ఖాళీగానే వున్నాయనే విషయాన్ని అధికారులు గుర్తించకుండా కాంట్రాక్టర్‌పై ప్రేమ చూపడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రెవెన్యూ విభాగంలోని అధికారి ఒకరికి సంబంధిత కాంట్రాక్టర్‌ ఆప్తుడు కాబట్టే ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చి ఉంటారన్నారు. లీజుల అధ్యయనంపై నియమించే సబ్‌ కమిటీలో అలాంటి అధికారులను సభ్యుడిగా వేసినా సరే జీవీఎంసీకి నష్టం చేస్తారన్నారు. కాబట్టి అలాంటివారి విషయంలో అప్రమత్తంగా వుండాలని మేయర్‌, కమిషనర్లను కోరారు.

Updated Date - 2021-08-05T05:30:00+05:30 IST