కోర్టు భయంతో కౌలు చెల్లింపులు

ABN , First Publish Date - 2022-06-29T09:18:44+05:30 IST

కోర్టు భయంతో కౌలు చెల్లింపులు

కోర్టు భయంతో కౌలు చెల్లింపులు

రాజధాని రైతులకు 113 కోట్లు జమ

అయినా సగం మంది రైతులు మిగిలే ఉన్నారు

కోర్టు అక్షింతలు తప్పించుకునేందుకే హడావుడి చెల్లింపులు


గుంటూరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులకు కౌలు ఇవ్వకుండా రెండు నెలలుగా వాయిదా వేస్తున్న ప్రభుత్వం ఉన్నట్టుండి హడావిడి చేస్తోంది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో కౌలు నగదు జమ చేయడం ప్రారంభించింది. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతుల్లో సగం మందికి సోమ, మంగళవారాల్లో సీఆర్‌డీఏ నగదు జమ చేసింది. రాజధాని నిర్మాణం కోసం 28,656 మంది రైతులు భూములివ్వగా పలు సాంకేతిక కారణాలతో సుమారు ఐదున్నర వేల మంది కౌలుకు దూరమవ్వగా ప్రస్తుతం 22,980 మంది మాత్రమే కౌలుదారులుగా మిగిలారు. వీరికి ఏటా మే రాక ముందే సీఆర్‌డీఏ  కౌలు చెల్లించాలి. ఈ ఏడాది వీరికి 193.87 కోట్ల రూపాయల కౌలు ఇవ్వాలి. ఇందులో 113 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించింది. ఇంకా 80 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.  


కోర్టులో చెప్పుకొనేందుకే!

కౌలు కోసం రైతులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. గత విచారణ సమయంలోనే హైకోర్టు సీఆర్‌డీఏ అధికారుల తీరుపై సీరియస్‌ అయింది. కౌలు ఎందుకు చెల్లించలేదో, ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు హడావిడిగా కౌలు చెల్లింపులు మొదలు పెట్టారు. బుధవారంలోపు కొందరికైనా నగదు జమ చేసి కౌలు పంపిణీ చేస్తున్నామని చెప్పి కోర్టులో ఉపశమనం పొందడం కోసమే ప్రభుత్వం హడావిడి చేస్తోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సీఆర్‌డీఏ చట్టం ప్రకారం కౌలు ఆలస్యమైతే వడ్డీతోసహా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో తీర్పు తర్వాత కౌలు చెల్లిస్తే దానికి వడ్డీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం హడావిడి చేస్తోందని రైతులు అంటున్నారు. కాగా ప్రతి ఏటా కోర్టులో కేసు వేసినప్పుడు కొందరికి కౌలు చెల్లించి హడావిడి చేస్తున్న ప్రభుత్వం ఆ తరువాత మిగిలిన వారికి సరిగ్గా చెల్లించడం లేదని విమర్శిస్తున్నారు. 


కోర్టు హెచ్చరికల భయంతోనే

బుధవారంం కోర్టులో కేసు విచారణకు రానుంది. గత వాయిదాలోనే హైకోర్టు అధికారులను హెచ్చరించింది. కేసు విచారణకు రాకముందే కౌలు పంపిణీ చేసి కోర్టులో చెప్పుకుని ఉపశమనం పొందడానికే ప్రభుత్వం హడావిడి చేస్తోంది తప్ప రాజధాని రైతులపై ప్రేమతో కాదు. 

- పువ్వాడ సుధాకర్‌, రాజధాని రైతు జేఏసీ నేత


కోర్టుకు వెళితేనే కౌలు చెల్లింపులు

కోర్టులో పిల్‌ వేయకుండా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు ఇవ్వడం లేదు. గడిచిన మూడేళ్లుగా ఇదే తంతు.  సీఆర్‌డీఏ  చట్టం ప్రకారం మే నెలకు ముందే  కౌలు చెల్లించాలి. కానీ ఇవ్వరు. మే నెల 15న సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. అందులో కోర్టును ఆశ్రయిస్తామని తెలిపాం. కానీ స్పందన లేదు. దీంతో కోర్టుకు వెళ్లాం.

- పోతినేని శ్రీనివాసరావు, పిటిషనర్‌


న్యాయపోరాటంలో గెలవలేకే.. 

న్యాయం రాజధాని రైతుల పక్షాన ఉంది. బుధవారం జరిగే విచారణను ప్రభుత్వం ఎదుర్కోవడం చాలా కష్టం. బుధవారం వచ్చే తీర్పు బాధిత రైతులకు అనుకూలంగా ఉంటుందనేది ప్రభుత్వానికి కూడా తెలిసిన విషయమే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కోర్టు విచారణను తప్పించుకునేందుకు కౌలు పంపిణీ మొదలు పెట్టింది.

- ఇంద్రనీల్‌ బాబు, రైతుల తరఫు న్యాయవాది


Updated Date - 2022-06-29T09:18:44+05:30 IST