కౌలు కష్టం

ABN , First Publish Date - 2022-04-29T05:54:21+05:30 IST

జిల్లాలో పంటల సాగు కోసం ప్రతీ ఏట పెట్టుబడులు పెరుగుతునే ఉండడంతో కౌలు రైతులకు మాత్రం కష్టాలే మిగులుతున్నాయి.

కౌలు కష్టం

- ప్రతీఏటా పెరుగుతున్న ధరలు

- రైతుబంధు వచ్చినా తగ్గని కౌలు రేట్లు

- ప్రభుత్వం నుంచి అందని సహకారం


కామారెడ్డి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటల సాగు కోసం ప్రతీ ఏట పెట్టుబడులు పెరుగుతునే ఉండడంతో కౌలు రైతులకు మాత్రం కష్టాలే మిగులుతున్నాయి. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి అంతంత మాత్రంగానే ఉంటున్నా ఏటికేడు కౌలు ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. వ్యవసాయం మీద ప్రేమతో కౌలు రైతులు భూములకు ఎంత ధరైనా చెల్లించి సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా పథకాలతో ప్రభుత్వాలు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. ఇవి కేవలం భూ యజమానులకు తప్ప కౌలురైతులకు మాత్రం అమలుకాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో తీవ్ర నష్టాల నడుమ బతుకుబండి నెట్టుకొస్తున్నారు. పెరుగుతున్న కౌలు ధరలతో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుబంధు వచ్చినా..

జిల్లాలోని 22 మండలాల పరిధిలో సుమారు రెండు లక్షల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 35 వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. మరో నెల రోజుల తర్వాత సాగు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున కౌలు రైతులు భూ యజమానులతో కౌలు ధరలు మాట్లాడుకుంటున్నారు. రైతుబంధు కింద భూ యజమానులకు పెట్టుబడి సాయం వస్తున్నా కౌలు మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలతో కౌలు రైతులకు ఏ విధమైన లబ్ధి చేకూరడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పంటకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నందున తమను సైతం గుర్తించి రైతుబంధు అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు.

పంటలకు అనువైన భూములు

జిల్లాలో నల్లరేగడి, ఎర్రమట్టి భూములు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, చెరుకు, సోయాబీన్‌, పత్తి సాగుకు అనుకూలమైన నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో సాగు చేసిన పత్తి పంటలో చాలా మంది రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతింది. అయినా జిల్లా రైతులు అధికంగా వరి, సోయా, మొక్కజొన్న, పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. భూమి రకాన్ని బట్టి కౌలు ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎకరానికి రూ.13వేల నుంచి రూ.16 వేల చొప్పున చెల్లిస్తున్నారు. గతేడాది ఇవి రూ.10వేల రూ.14 వేల వరకు చెల్లించారు.

ఈ మండలాల్లో అధికంగా వరి సాగు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో వరి సాగు అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఆర్థికంగా వృద్ధి చెందిన రైతులతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మరికొంత మంది కౌలుకు సాగు చేస్తారు. అదే విధంగా ఔత్సాహిక రైతులు కూడా భూములు కౌలుకు తీసుకోవడానికి గ్రామాల్లో తిరుగుతుంటారు. దీంతో కౌలు ధర మరింత పెంచేందుకు భూ యజమానులు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.18 వేలు ధర చెల్లించాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలు

జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరానికి వేలకు వేలు పెట్టి కౌలు తీసుకున్నా సాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతీ ఏటా నష్టాలు చవిచూస్తున్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు వ్యవసాయశాఖ గ్రామసభలు పెట్టి భూ యజమానులకు అవగాహన కల్పించి, కౌలు రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. అయితే ఎక్కడా ఇటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే విధంగా రైతులను ఇతర పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించినా నష్టాలు తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కౌలు ధరలు అదుపులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు.


భూముల కోసం వెతుకుతున్నారు

- రాజేందర్‌రావు, రైతు, నందివాడ

ఊళ్లలో కౌలు భూముల కోసం మస్తు మంది తిరుగుతుండ్రు. ఎక్కడా ఖాళీ భూమి కనబడినా రైతుల ఇళ్లకెళ్లి కౌలు ఇయ్యాలని అడుగుతుండ్రు. ఏ పంట సాగు చేయకపోయినా వరి, మొక్కజొన్న, పత్తి మాత్రం పండిస్తున్నారు. నష్టాలచ్చినా పత్తిపంట సాగుజేసుడు మానుతలేరు. జిల్లాలో భూముల కోసం రైతులు నెలరోజుల ముందు నుంచే వెతుకుతున్నారు.


కౌలు ధర పెరిగింది

- శ్రీనివాస్‌, రైతు, ముత్యంపేట

ఐదారేళ్ల క్రితం కౌలు భూమి ఎకరానికి ధర రూ.4 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ఉండేది. ఒకరిని చూసి మరొకరు వరి, మొక్కజొన్న, సోయ, పత్తి పంటకు ఒక్కసారిగా ధర పెరిగింది. ఇప్పుడు ఎకరానికి రూ.ఎనిమిది వేలు ఇస్తామన్నా భూమి లీజుకు ఇయ్యడానికి ముందుకచ్చేటోళ్లు లేరు. దీంతో అధిక ధర చెల్లించి కౌలుకు భూములు పడుతున్నాం.

Updated Date - 2022-04-29T05:54:21+05:30 IST