చిప్పలేరు వాగులో గల్లంతైన కౌలు రైతు మృతి

ABN , First Publish Date - 2022-05-17T03:48:55+05:30 IST

సాగు చేసిన పత్తి పంట చేతికందితే అప్పులన్నీ తీరుతాయన్న కౌలు రైతు ఆశలు అసాని తుపాను రూపంలో ఆవిరయ్యాయి.

చిప్పలేరు వాగులో గల్లంతైన  కౌలు రైతు మృతి
వాగులో మృతదేహం వద్ద ఎస్‌ఐ, ఈతగాళ్లు

నీట మునిగిన పత్తిని చూసి వస్తూ...

యువ రైతు కుటుంబంలో విషాదం నింపిన ‘అసాని’

కావలి రూరల్‌, మే 16: సాగు చేసిన పత్తి పంట చేతికందితే అప్పులన్నీ తీరుతాయన్న కౌలు రైతు ఆశలు అసాని తుపాను రూపంలో ఆవిరయ్యాయి. భారీ వర్షాలతో నీటమునిగిన పంటను చూసి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కౌలు రైతు చిప్పలేరు వాగులో గల్లంతై మృతి చెంది శవమై తిరిగివచ్చాడు. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ బట్లదిన్నెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు... బట్లదిన్నె గ్రామానికి చెందిన బండ్ల సురేష్‌(35)కు 25 సెంట్లు పొలం ఉంది. దీంతో పాటు 3 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. అసాని తుఫాన్‌ ప్రభావంతో గత వారంలో కురిసిన వర్షాలతో పంట నీట మునిగింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నీట మునిగిన పత్తి పంటను చూసి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సురేష్‌ చిప్పలేరు దాటే క్రమంలో వాగులో కొట్టుకు పోయాడు. ఈ ఘటనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే అప్పటికే చీకటి పడడంతో ఏమి చేయలేక సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక సర్పంచు కటికాల సురేష్‌, రూరల్‌ సీఐ ఖాజావలి, ఎస్‌ఐ వెంకట్రావ్‌, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, ఆర్‌ఐ గిరిధర్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సమద్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ కోసం చేపట్టి గాలింపు చర్యలు ఫలించకపోవడంతో వెకటేశ్వరపురానికి చెందిన గజ ఈతగాళ్లను తీసుకువచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రానికి ఘటనా స్థలానికి అరకిలో మీటర్‌ దూరంలో కంపచెట్లలో మృత దేహాన్ని గుర్తించి వెలికితీశారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సురేష్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించి ఎస్‌ఐ వెంకట్రావ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-17T03:48:55+05:30 IST