గనుల్లో గ‘లీజు’

ABN , First Publish Date - 2020-11-23T04:38:45+05:30 IST

ఓగీపూర్‌ నాపరాతి గనుల్లో లీజు గడువులు ముగిసినా కొంతమంది గనుల యజమానులు అక్రమ తవ్వకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు.

గనుల్లో గ‘లీజు’
తాండూరు మండల పరిధిలోని నాపరాతి గని

  • ఓగీపూర్‌ నాపరాతి గనుల్లో లీజు గడువు ముగిసినా తవ్వకాలు
  • విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • తవ్వకాలను నిలిపివేయించిన అధికారులు
  • నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ, ఏజే


నాపరాతి గనుల్లో లీజు గడువులు ముగిసినా కొందరు అక్రమా ర్కులు తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. అనుమతులు ముగిసి ఏళ్లు గడుస్తున్నా తవ్వకాలు జరుపుతూ లక్షలాది రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. లీజును రెన్యూవల్‌ చేసుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతోంది. విజిలెన్స్‌ అధికారులు వస్తున్నారని ముందస్తుగా సమాచారం తెలిస్తే గనుల యజమానులు తవ్వకాలను నిలిపివేస్తున్నారు. అనంతరం తిరిగి యథావిధిగా తవ్వకాలు  జరుపుతున్నారు.


తాండూరు రూరల్‌ : ఓగీపూర్‌  నాపరాతి గనుల్లో లీజు గడువులు ముగిసినా కొంతమంది గనుల యజమానులు అక్రమ తవ్వకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి లక్షలాది రూపాయలు గండి పడుతుంది. ఈ విషయంపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాపరాతి గనుల్లో ఎలాంటి లీజు లేకున్నప్పటికీ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని రాష్ట్ర మైన్స్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాష్ట్ర మైన్స్‌ విభాగం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ బృందం 10రోజుల క్రితం నాపరాతి గనుల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరు మండలం ఓగీపూర్‌ నాపరాతి గనుల్లోని సర్వేనెంబర్‌-7లో 5ఎకరాల భూమిలో నాపరాతి తవ్వకాలను పరిశీలించారు. అయితే అట్టి భూముల్లో మూడేళ్ల క్రితమే లీజు గడువు ముగిసినప్పటికీ కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావిస్తూ నాపరాతి తవ్వకాలు జరుపుతూ లక్షలాది రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర మైన్స్‌ విభాగం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తాండూరు మైన్స్‌, రెవెన్యూశాఖలకు చెందిన సర్వేయర్ల బృందంతో నాపరాతి గనుల్లో కొలతలు నిర్వహించారు. ఏమేరకు తవ్వకాలు జరిపారు. ఎంత విస్తీర్ణంలో ఖనిజ సంపద తొలగించారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి పడింది. గనుల్లో ఎంత లోతులో ఖనిజ సంపదను తరలించారనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్ల బృందం అక్కడే క్షేత్రస్థాయిలో కొలతలు నిర్వహించి తవ్వకాలపై సమగ్ర వివరాలు సేకరించారు. 


విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని వివరాలు..


తాండూరు మండల పరిధిలోని ఓగీపూర్‌, కరన్‌కోట్‌, సిరిగిరిపేట్‌, కోటబాస్పల్లి, సంగెంకలాన్‌, మల్కాపూర్‌ తదితర గ్రామాల్లోని నాపరాతి గనుల్లో అక్రమ తవ్వకాలను నివారించేందుకు విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయట పడతాయని పలువురు పేర్కొంటున్నారు. మైన్స్‌, రెవెన్యూ అధికారులు సకాలంలో తనిఖీలు నిర్వహించకపోవడంతోనే కొందరు అక్రమార్కులు లీజు గడువులు ముగిసినప్పటికీ యథావిఽదిగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైన్స్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తాండూరు ప్రాంతంలో తిష్ట వేసి తనిఖీలు నిర్వహిస్తే ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయం పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


లీజులు రెన్యూవల్‌ చేయకనే అక్రమ తవ్వకాలు

కరన్‌కోట్‌, ఓగీపూర్‌, నాపరాతి గనులు తవ్వుకునేందుకు అనుమతులు కొద్దిసంవత్సరాల క్రితం ముగిశాయి. అయితే వారు మరోసారి రెన్యూవల్‌ చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కాలేదు. దీంతో వారు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు వస్తున్నారని ముందస్తుగా సమాచారం తెలిస్తే తవ్వకాలను నిలిపివేస్తున్నారు. తిరిగి యథావిధిగా తవ్వకాలు  జరుపుతున్నారు. 

- బోయ అశోక్‌, కరన్‌కోట్‌


నాపరాతి గనుల యజమానులకు లీజులు ఇవ్వాలి

ఓగీపూర్‌, కరన్‌కోట్‌ గ్రామ శివారులోని నాపరాతి గనుల్లో లీజులు అయిపోయిన యజమానులందరికీ ప్రభుత్వం మరోసారి లీజులను రెన్యూవల్‌ చేయాలి. లీజులు రెన్యూవల్‌ అయితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అక్రమ తవ్వకాల జోలికి వెళ్లరు. లీజులు సకాలంలో రాకపోవడంతోనే కొంతమంది తవ్వకాలు జరుపుతున్నారు. 

-  దేవరాజ్‌, కరన్‌కోట్‌

Updated Date - 2020-11-23T04:38:45+05:30 IST