వరి వైపే మొగ్గు

ABN , First Publish Date - 2021-12-02T06:06:29+05:30 IST

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా చేసిన ప్రకటనతో జిల్లాలో 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే రైతుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భావించారు.

వరి వైపే మొగ్గు
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో పోసిన వరినారు

- యాసంగిలో ప్రత్యామ్నాయం కష్టమే 

- నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్న  రైతులు

- జిల్లాలో మొదలైన సాగు 

- నిరాశ పరిచిన కేసీఆర్‌ ప్రకటన

- మిల్లర్లపైనే ఆశలు 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా చేసిన ప్రకటనతో జిల్లాలో 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే రైతుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో కొద్ది రోజులుగా  ఆందోళన చెందుతున్న రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భావించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ ప్రకటన వారిని అయోమయంలో పడేసింది. కనీసం ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు ప్రకటించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరికి  కొందరు మిల్లర్లపై ఆశలు పెట్టుకొని వరి నారుమడులు పోసుకుంటున్నారు. 

దొడ్డురకం వద్దని ప్రచారం

యాసంగిలో దొడ్డురకం ధాన్యం వద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం మొదలు పెట్టింది. రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలు వేయడం కష్టమంటున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం, భారీ వర్షాలతో భూముల్లో తడి ఎక్కువగా ఉండడం వంటి పరిణామాలతో ప్రత్యామ్నాయ పంటల కంటే వరి సాగు మాత్రమే  వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో వానాకాలంలో 2.49 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా 1.73 లక్షల ఎకరాల్లో వరి, 63,151 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వరి కోతల సమయంలోనూ పొలాలు బురదగానే ఉన్నాయి. భూమి ఆరకుండా పొద్దు తిరుగుడు, వేరుశనగ, పెసర, మినుములు, కూరగాయలు వంటి పంటలు పండించడం కష్టమని  రైతులు అభిప్రాయపడుతున్నారు. యాసంగిలో జిల్లాలో సాధారణంగా 1.75 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఇందులో 1.67 లక్షల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు వేసుకుంటారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల కోసం జిల్లా అధికారులు 1062.75 క్వింటాళ్లలో విత్తనాలను సిద్ధం చేశారు. ఇందులో వేరు శనగ 604.50 క్వింటాళ్లు, శనగలు 304.75, పెసర 27.50, మినుములు 27 క్వింటాళ్లతోపాటు 8882 మెట్రిక్‌ టన్నుల ఎరువులను  సిద్ధంగా ఉంచారు. 

వరికి సన్నద్ధం

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు  ఎలా ఉన్నా రైతులు మాత్రం వరిసాగుకు సిద్ధమవుతున్నారు. మిల్లర్లపై అశలు పెట్టుకొని పొలాలు దున్ని నారుమళ్లు పోసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, కోనరావుపేట, వేములవాడ, చందుర్తి మండలాల్లో పలు గ్రామాల్లో ఇప్పటికే సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు పెట్టినా రైతులు ఆసక్తి చూపడం లేదు. 

మిల్లర్లలో అయోమయం

జిల్లాలో ప్రధానంగా రైస్‌మిల్లులు ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యంపైనే ఆధారపడి పని చేస్తున్నాయి. మొత్తం 74 రైస్‌ మిల్లులు ఉండగా 32 బాయిల్డ్‌, 42 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇప్పటికే గత యాసంగి ధాన్యం నిల్వలు మిల్లుల్లో పేరుకుపో యాయి. వానాకాలం ధాన్యం దించుకోవడానికి మిల్లర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో యాసంగి ధాన్యం కొనుగోలు లేకపోవడం, నేరుగా మిల్లర్లు కొనుగోలు చేయడం వంటివాటితో ఇబ్బందులు  తలెత్తే అవ కాశం ఉంది. పెట్టుబడులు లేని మిల్లర్లు ధాన్యం కొను గోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో నష్టపోతారని భావిస్తున్నారు. 

 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు 

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 265 కొనుగోలు కేంద్రాలకు 257   ప్రారంభించారు.  ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో కొనుగోలు పూర్తి చేసి మూసివేశారు. ఇప్పటి వరకు 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  సేకరించారు. ఐకేపీ ద్వారా 32,159 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 1,01,665, డీసీఎంస్‌ ద్వారా 4,143, మెప్మాద్వారా 1421, మార్కెట్‌ యార్డుల ద్వారా 1372 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.275.89 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 10.908 మంది రైతుల ఖాతాల్లో రూ.120.56 కోట్లు జమ చేశారు.

Updated Date - 2021-12-02T06:06:29+05:30 IST