వెలిగొండలో లీకు

ABN , First Publish Date - 2021-07-27T06:11:58+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే మొదటి సొరంగం ద్వారా కృష్ణాజలాలు ప్రవహిస్తున్నాయి.

వెలిగొండలో లీకు
మొదటి సొరంగం నుంచి బయటకు వచ్చిన నీరు

హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద లీకులు

జాలువారుతున్న వరదనీరు

అయోమయంలో అధికారులు

వర్షాలు ఎక్కువైతే మరింత ప్రమాదం

పూర్తి కాని ఫీడర్‌ కెనాల్‌ పనులు

పెద్ద దోర్నాల, జూలై 26 : వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే మొదటి సొరంగం ద్వారా కృష్ణాజలాలు ప్రవహిస్తున్నాయి. ఇది ప్రమాదానికి హేతువుగా మారే అవకాశం లేకపోలేదు. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు చేరుకుంది. ఈ ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులోని కీలకమైన మొదటి సొరంగం పనులు ఇటీవలే పూర్తిచేశారు. ఆ సొరంగానికి కృష్ణానదికి అనుసంధానంగా కొల్లంవాగు వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటర్‌ పనులూ చేశారు. అయితే ఆ పనుల్లో ఏ లోపాలున్నాయో ఏమో గానీ కృష్ణానదికి నిండుగా నీరు చేరేసరికి హెడ్‌ రెగ్యులేటర్‌ లీకుల ద్వారా వరద నీరు సొరంగంలోకి ప్రవహిస్తోంది. దీంతో సంబంధిత అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి లీకుల ద్వారా ఏకధాటిగా ప్రవహిస్తున్న వరద నీరు సొరంగంలో 3 అడుగుల మేర చేరింది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా బయటకు తోడిపోయిస్తున్నారు. అయినా ఏ మాత్రం నీటి నిల్వలో తేడా కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందుతున్నారు. హెడ్‌ రెగ్యులేటర్‌ లీకులకు ఇప్పుడు ఎలా మరమ్మతులు నిర్వహించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. సొరంగం అంతర్భాగంలోకి వెళ్లే లాకుల్లోకి కూడా సగానికిపైగా వరద నీరు చేరింది. దీంతో హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సీజనంతా వర్షాకాలం కావడంతో ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు ఉధృతి ఎక్కువైనప్పుడు డ్యామ్‌కు మరింత నీరు చేరుతోంది. ఈ నలబైరోజులూ ఇదే పరిస్థితి నెలకొంటే వరద నీరు వస్తూనే ఉంటుంది.


నిలిచిపోయిన రెండో సొరంగం పనులు

వరదనీరు లీకేజీ వల్ల రెండో సొరంగం పనులు నిలిచిపోయాయి.సాధారణంగా మొదటి సొరంగంలోకి నీరొస్తే రెండో సొరంగం పనులు యథావిధిగా నిర్వహించవచ్చు. కానీ  ఇక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొదటి సొరంగం పనులు పూర్తయినా రెండో సొరంగం పనులు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రెండువైపుల నుంచి తవ్వకం చేయాలని అధికారులు భావించారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగాన్ని కలుపుతూ మధ్యలో అప్రోచ్‌ కాలువను తవ్వారు. దీంతో మొదటి సొరంగంలోకి వచ్చిన వరద నీరు రెండో సొరంగంలోకి కూడా చేరాయి.  పనులు నిలిచిపోయాయి.   

 

అధిక వరద నీటితో రైతులకు ముప్పు

కృష్ణా నదిలో 885 అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టం కాగా 840 అడుగుల నుంచి మిగులుజలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అందులో మొదటి సొరంగం పనులు పూర్తిచేసుకుని కొల్లంవాగు ప్రాంతం వద్ద హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మించి రెండు గేట్లు ఏర్పాటు చేశారు. గేట్ల మీదుగా వరద నీరు సొరంగం లోపలికి ప్రవహిస్తున్నాయి. అంటే 840 అడుగులకు మించి మరో 7 మీటర్లకుపైగా కృష్ణా నదిలో నీరు నిల్వ ఉన్నట్లు భావించాలి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువైతే క్లస్టర్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదులుతారు. అప్పటిదాకా డ్యాం నిండా నీరుఉండటంతో సొరంగంలోకి వరద నీరు వస్తూనే ఉంటుంది. ఈ నీటిని ప్రాజెక్టు అధికారులు సొరంగం నుంచి బయటకు తోడి పోసే క్రమంలో సమీపంలోని గంటవానిపల్లె చెరువుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆ చెరువు నిండా నీరుంది. దీంతో పీఢర్‌ కెనాల్‌కు తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీఢర్‌ కాలువ నిర్మాణం పూర్తికాలేదు. మధ్యలో కొంతభాగం తవ్వాల్సి ఉంది. పీఢర్‌ కెనాల్‌కు నీటిని తరలిస్తే ఎక్కడో ఒక చోట కరకట్ట తెంచుకుని పొలాలపై ప్రవహించే అవకాశాలున్నాయి. గతంలో కూడా కడపరాజుపల్లె వద్ద కాలువకట్ట తెగి పంటపొలాలన్నీ నాశనమయ్యాయి.  


ప్రభుత్వ వైఫల్యం వల్లే అంతా...

కృష్ణా నది వరద నీరు హెడ్‌ రెగ్యులేటర్‌ లీకుల ద్వారా సొరంగంలోకి ప్రవహించిందంటే ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు ఆరోపించారు. వరద నీరు ఉధృతి ఎక్కువైతే పంట పొలాలు, ప్రజలకు నష్టం చేకూరుతుందని అంత నిర్లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు.


 సీపేజ్‌  వాటర్‌ రావడం   మామూలే..! :  ఈఈ చినబాబు

హెడ్‌ రెగ్యులేటర్‌ లీకుల నుంచి కృష్ణానది వరద నీరు వెలిగొండ మొదటి సొరంగంలోకిప్రవహిస్తున్న విషయమై సంబంధిత ఈఈ చినబాబును వివరణ కోరగా నిర్మాణం పనుల్లో సీపేజ్‌ వాటర్‌ రావడం మామూలే కదా అంటూ తాఫీగా సమాధానమిచ్చారు.




Updated Date - 2021-07-27T06:11:58+05:30 IST