టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణమిదే

ABN , First Publish Date - 2020-12-06T07:23:37+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరే అధికార పార్టీ కొంప ముంచిందని అనుమానిస్తున్నారు. అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న

టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణమిదే

ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య విభేదాలు

నే‘తల’పట్లు.. వెన్నుపోట్లు

పలుచోట్ల సిటింగ్‌లకు ఎమ్మెల్యేల మోకాలడ్డు

అధిష్ఠానం వినకపోతే ఓడించి చూపారు

టికెట్లు ఇప్పించుకున్న చోట్ల గెలిపించుకున్నారు

ఎమ్మెల్యేల బంధువుల్ని ఓడించిన స్థానిక నేతలు

ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య వెన్నుపోట్లు.. టీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణమిదే


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరే అధికార పార్టీ కొంప ముంచిందని అనుమానిస్తున్నారు. అన్నిచోట్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వారికే స్థానిక కార్పొరేటర్‌ టికెట్లు ఇప్పించుకొనేందుకు ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎమ్మెల్యేను కాదని సిట్టింగులకు అనుకూలంగా సొంత నిర్ణయం తీసుకున్న చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది.


ముఖ్యంగా కార్పొరేటర్‌గా బలపడిన స్థానిక చురుకైన నేతలు భవిష్యత్తులో తమకు పోటీ వస్తారని భావించిన కొందరు ఎమ్మెల్యేలు వారికి టికెట్లు రాకుండా సాధ్యమైనంత మేరకు కృషి చేశారని, సాధ్యం కానిచోట సహాయ నిరాకరణతో ఇబ్బందులు పెట్టారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు పట్టుబట్టి తమ బంధువులకు టికెట్లు ఇప్పించుకున్న చోట్ల కూడా స్థానిక నేతలు సహాయ నిరాకరణతో వారిని ఓడించి, అధిష్ఠానం ముందు తలొంచుకొనేలా చేశారని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన పార్టీ అధినాయకత్వం ఎన్నికల మేనేజ్‌మెంట్‌ను ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులకు అప్పగించింది. అయితే, స్థానికంగా పార్టీలో గొడవలకు తోడు బీజేపీ సృష్టించిన భావోద్వేగం, వరద సాయం అందని పేదల ఆగ్రహావేశాలు అధికార పార్టీ వ్యూహాలను చిత్తు చేశాయని భావిస్తున్నారు.


 నాలుగు నియోజకవర్గాల్లో

ఐదేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో అన్ని డివిజన్లు టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు అదే జోరు కొనసాగింది. కానీ.. ఇప్పుడు అక్కడ ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. కచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాల్లోనూ ఓటమి నివ్వెరపరచింది. 15 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన కొందరు అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యేలపై, ఇతర నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మాజీ హోంమంత్రి నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌లో తన ఓటమికి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కారణమని బహిరంగంగానే ప్రకటించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని మొత్తం ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోగా.. అందులో ఐదు సిటింగ్‌ స్థానాలు. గాంధీనగర్‌ నుంచి పోటీచేసిన మరదలు పద్మనూ ఆయన గెలిపించుకోలేకపోయారు. ఎల్‌బీనగర్‌లో 11 డివిజన్లలో సిట్టింగులకు మరోసారి అవకాశం కల్పించారు. కొందరిని మార్చాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పట్టుబట్టినా.. అధినాయకత్వం పట్టించుకోలేదు. ఇక్కడ బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.


తలసానికి మిశ్రమ ఫలితాలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌లోనూ ఫలితాలు అధికార పార్టీని నిరాశపర్చాయి. ఐదు డివిజన్లూ ఆయనకు ఇష్టమైన వారికే టికెట్లు ఇచ్చినా ఇద్దరు ఓడిపోయారు.  ప్రస్తుత ఫలితాలు శ్రీనివాస్‌ యాదవ్‌ హవాకు కొంత చెక్‌ పెడుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్‌ నియోజకవర్గంలో ఆది నుంచి స్థానిక ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డికి కొందరు కార్పొరేటర్లతో సఖ్యత లేదు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కొందరు అభ్యర్థులను మార్చారని అంటున్నారు. వారిలో ఒకరు ఓడిపోగా.. మరొకరు గెలిచారు. భార్యను హబ్సిగూడ నుంచి బరిలోకి దించి, ఓటమి చవిచూశారు. స్థానిక నేతలే ఆమెను ఓడించారని అనుమానిస్తున్నారు.


రాజేంద్రనగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే బంధువును కూడా స్థానిక నేతలే ఓడించారని అనుమానిస్తున్నారు. అంబర్‌పేటలో మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసింది. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఓడిపోయినాకానీ స్థానిక ఎమ్మెల్యేలలో ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఉన్నారు. పైకి సానుభూతి వాక్యాలు పలికినా తగిన శాస్తి జరిగిందంటూ లోలోపల సంతోష పడుతున్నట్లు చెబుతున్నారు. 




వెన్నంటే ఉండి వెన్నుపోట్లు

ఓడిన అభ్యర్థులు కారణాలను విశ్లేషించుకుంటున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం, డివిజన్‌ ఇన్‌చార్జిగా వచ్చిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, వారి అనుచరుల సహకారం, డివిజన్‌ పరిధిలో ఉన్న శ్రేణుల సహకారంపై లెక్కలు వేస్తున్నారు. వెన్ను పోటుదారులను గుర్తించే పనిలో పడ్డారు. గెలిచిన అభ్యర్థుల కుల గోత్రాలు ఎమ్మెల్యేకు సరిపోయే విధంగా ఉంటే కుట్ర చేసి ఓడించారనే ఆరోపణలు చేస్తున్నారు. ఎల్‌బీ నగర్‌లో ఓ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త తనతో పక్కనున్న వాళ్లు బాగా డబ్బులు ఖర్చు పెట్టించారని బాధ పడిపోయారు. ఆ డబ్బులు ఓటర్లకు చేరకపోవడం వల్లే ఓడిపోయామని అనుమానం వ్యక్తం చేశారు.


మల్కాజిగిరిలో ఓ అభ్యర్థి పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేయగా.. ఓటర్లకు చేరలేదని చెబుతున్నట్లు తెలిసింది. కులాలు, మహిళా, యువజన సంఘాలకు అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదు సమర్పించారు. అపార్ట్‌మెంట్లు, కాలనీ అసోసియేషన్లు కోరిన కోర్కెలను తీర్చారు. దైవసాక్షిగా ప్రమాణాలు చేసిన వారు సైతం తమను నిలువునా ముంచారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ నియోజ కవర్గాల పరిధిలో అభ్యర్థుల అనుచరులు ఓటర్లతో వాదనలకు దిగినట్లు సమాచారం. 


మార్పుచేసి గెలిపించారు

ఎమ్మెల్యేల అభిప్రాయాలను పట్టించుకోకుండా టికెట్లు కేటాయించిన చోట్ల పార్టీ దెబ్బతింది. పట్టుబట్టి అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ఇందుకు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ఒక ఉదాహరణ. ఆయన సిట్టింగ్‌లను కాదని కొత్త అభ్యర్థులను నిలబెట్టి ఐదింట నాలుగు చోట్ల విజయం సాధించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ నాలుగు సీట్లలో తనకు నచ్చిన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్నారు.


శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరు సిట్టింగులను మార్చి రెండు చోట్లా గెలిపించుకున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఇద్దరు సిట్టింగులను మార్చాలని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదు. వారిద్దరూ ఓడిపోయారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే మూడు మార్పులు చేసి రెండు గెలిపించుకున్నారు. ముషీరాబాద్‌లో ఎమ్మెల్యేకు ఇష్టంలేని సిట్టింగులు ఓడిపోయారు.  కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్ల తీరు ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. వారి ఓటమికి ఎమ్మెల్యేలే పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్నాయి. 


Updated Date - 2020-12-06T07:23:37+05:30 IST