స్వాతంత్రోద్యమంలో ఎచ్చెర్ల నేతలు

ABN , First Publish Date - 2022-08-12T05:47:48+05:30 IST

స్వాతంత్రోద్యమంలో ఎచ్చెర్ల నేతలు కూడా భాగస్వామ్యమయ్యారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కొంతమంది తమ ఉద్యోగాలను సైతం వదులుకున్నారు.

స్వాతంత్రోద్యమంలో ఎచ్చెర్ల నేతలు
ఎస్‌.ఎం.పురం గ్రామం వ్యూ.. చౌదరి సత్యనారాయణ (ఫైల్‌ ఫోటో)

- ఎస్‌ఎంపురంలో కీలక సమావేశాలు
- చురుకైన పాత్ర పోషించిన చౌదరి సత్యనారాయణ

ఎచ్చెర్ల: స్వాతంత్రోద్యమంలో ఎచ్చెర్ల నేతలు కూడా భాగస్వామ్యమయ్యారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కొంతమంది తమ ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. ఎచ్చెర్ల మండలం షేర్‌మహమ్మద్‌ (ఎస్‌.ఎం) పురానికి చెందిన చౌదరి సత్యనారాయణతో పాటు ఇదే మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి నారాయణ, మొదలవలస కృష్ణమూర్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చౌదరి సత్యనారాయణ విద్యార్థి దశలోనే ఉద్యమబాట పట్టారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న అనుచరుడిగా వ్యవహరించారు. ఈయన స్వగ్రామమైన ఎస్‌ఎంపురంలో సమావేశాలు జరుగుతుండేవి. స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొనాలని 1921లో జాతీయ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. తరగతుల బహిష్కరణ ఉద్యమానికి చౌదరి సత్యనారాయణ నాయకత్వం వహించారు. విద్యార్థి దశలోనే సత్యనారాయణ బ్రిటీష్‌ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1922లో కల్లు వ్యాపారాన్ని వేలం వేయాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్నారు. 1923లో కళింగపట్నంలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో తన సహచరులతో కలిసి పాల్గొన్నారు. 1926లో గాంధీజీ ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టిన యాత్రకు సత్యనారాయణ హజరయ్యారు. 1930 ఏప్రిల్‌ 19న నౌపడలో రామలింగం మాష్టారు నాయకత్వాన ఉప్పు కుప్పల దోపిడీలో చౌదరి సత్యనారాయణ పాల్గొన్నారు. 1935-36లో బాబూ రాజేంద్రప్రసాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూల జిల్లా పర్యటనతో ఈ ప్రాంతంలో జాతీయోద్యమం ఊపందుకుంది. ఎన్‌జీ రంగా, వీవీ గిరి ప్రేరణతో కిసాన్‌ ఉద్యమంలో సత్యనారాయణ తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.

రెవెన్యూ ఉద్యోగాన్ని విడిచి..
చౌదరి సత్యనారాయణ రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో భాగస్వామ్యులయ్యారు. కిసాన్‌ ఉద్యమంలో, జాతీయోద్యమంలో పాల్గొన్న చౌదరిని అరెస్ట్‌ చేసి చీపురుపల్లి తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. సత్యాగ్రహంలో భాగంగా ఢిల్లీకి పాదయాత్ర చేసి అరెస్ట్‌ అయ్యారు. ఇదే ఏడాది మార్చిలో పలాసలో అఖిల భారత కిసాన్‌ మహాసభ రంగా నాయకత్వంలో జరిగాయి. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ లచ్చన్న, మార్పు పద్మనాభం, బెందాళం గవరయ్య, గానుగుల తరుణాచారితో పాటు సత్యనారాయణ పాల్గొన్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కళింగపట్నం తపాలా కార్యాలయంపై లచ్చన్న, శిల్లా రాజులరెడ్డి, చౌదరి సత్యనారాయణ నాయకత్వంలో లూఠీ చేశారు. 1942లో దూసి స్టేష్‌న్‌లో గాంధీజీ సభకు కనిమెట్ట, కింతలి, బొడ్డేపల్లి మీదుగా కాలినడకన వె ళ్లి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు జరిగిన కాంగ్రెస్‌ పాదయాత్రలో సత్యనారాయణ పాల్గొన్నారు.

- భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన చౌదరి సత్యనారాయణ నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికి తనతో పని ఉన్నా.. వారిని తన సైకిల్‌పైనే ఎక్కించుకుని సంబంధిత కార్యాలయానికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. దేశభక్తి గుర్తుగా తిరుపతి విమానశ్రయంలో కొంతమంది ప్రముఖులతో పాటు ఈయన ఫొటో కూడా పెట్టడం గమనార్హం.

Updated Date - 2022-08-12T05:47:48+05:30 IST