వస్తానంటే వద్దంటామా.. వలసలను ప్రోత్సహిస్తున్న పార్టీలు

ABN , First Publish Date - 2020-11-21T19:44:57+05:30 IST

పార్టీలు బలం పెంచుకునేందుకు బలగాన్ని పటిష్ఠం చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా సీనియర్‌లు పాచికలు వేస్తున్నారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ గోడ దూకే వారిని ప్రోత్సహించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. వలసల వల్ల పార్టీకి బలం పెరిగి హైప్‌ వస్తుందని, ఓటర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుందని సీనియర్‌లు చెబుతున్నారు.

వస్తానంటే వద్దంటామా.. వలసలను ప్రోత్సహిస్తున్న పార్టీలు

బలమైన అభ్యర్థుల కోసం గాలం వేస్తున్న నేతలు

ఖైరతాబాద్‌లో మారనున్న రాజకీయ చిత్రం


బంజారాహిల్స్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పార్టీలు బలం పెంచుకునేందుకు బలగాన్ని పటిష్ఠం చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా సీనియర్‌లు పాచికలు వేస్తున్నారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ గోడ దూకే వారిని ప్రోత్సహించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. వలసల వల్ల పార్టీకి బలం పెరిగి హైప్‌ వస్తుందని, ఓటర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుందని సీనియర్‌లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వలసలు రాజకీయ వేడిని పుట్టిస్తాయని, అన్నీ కలిసి వస్తే విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పట్టు కోసం అన్నిపార్టీలు తమదైన శైలితో ఎత్తులు వేస్తున్నాయి.


టీఆర్‌ఎస్‌ పాచికలు

రాష్ట్ర రాజకీయాల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ ఆదిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడి ఓటర్లు విభిన్నంగా తీర్పునిస్తుంటారు. ఒకప్పుడు కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఓటర్లు తరువాత బీజేపీ, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు టీఆర్‌ఎస్‌ పాచికలు వేస్తుంది. హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్‌, సోమాజిగూడను గత గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టికెట్‌ ఎవరికన్నది పార్టీ అధిష్ఠానం చేతిలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎ్‌సలోకి లాగేందుకు ఆ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. కొన్నిచోట్ల బీజేపీ టికెట్‌ కోసం పోటీ ఉంది. కానీ ఒక్కరికే అవకాశం దక్కుతుంది. మిగతా వారిని టీఆర్‌ఎ్‌సలోకి లాగేందుకు నామినేటెడ్‌ పదవులు ఇస్తాం, వ్యాపారాల్లో సహకరిస్తామంటూ ఇన్‌చార్జిలు తెర వెనుక హామీలు గుప్పిస్తున్నారు. సిట్టింగ్‌లకు ఇతర పార్టీల ఆశావాహులు కలిస్తే విజయం నల్లెరు మీద నడకే అని పార్టీ భావిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


పంథా మార్చిన బీజేపీ 

టీఆర్‌ఎస్‌ ఎత్తు గడ ఓ లాగా ఉంటే బీజేపీ పంథా మార్చింది. నియోజకవర్గంలో ఉన్న ఆరుగురు సిట్టింగ్‌లకు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలోకి చేరిన దానం తన అనుచరులను కూడా పార్టీలోకి తీసుకువచ్చారు. ఈ సారి కార్పొరేటర్‌ టికెట్‌ మీకే అని వాగ్దానం చేశారు. దీంతో సిట్టింగ్‌లే కాకుండా టీఆర్‌ఎస్‌ ఆశావహుల సంఖ్య కూడా చాలానే ఉంది. ప్రస్తుత కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్లు రేసులో ఉన్నారు. బుధవారం తొలి జాబితాలో సిట్టింగ్‌లైన విజయారెడ్డి, గద్వాల్‌ విజయలక్ష్మి, మన్నె కవితారెడ్డి, కాజా సూర్యనారాయణకు టికెట్‌ ఇచ్చారు. ఈ సీట్లలో దానం అనుచరులు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరికి గాలం వేసేందుకు బీజేపీ సీనియర్‌లు రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ ఆశావహుల్లో గతంలో కార్పొరేటర్లుగా చేసిన వారు ఉన్నారు. ఇలాంటి వారిని పార్టీలోకి తీసుకుంటే టీఆర్‌ఎ్‌సను మానసికంగా దెబ్బతీసినట్టు అవుతుందని బీజేపీ సీనియర్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ చేసుకుంటోంది. అవకాశం దొరికితే పైచేయిసాధించాలని భావిస్తోంది. 


అవకాశంగా మార్చుకుంటున్న గల్లీ నాయకులు

ఎన్నికల ముందు నేతల వలసల కంటే గల్లీ లీడర్ల గోడ దూకుడే ఎక్కువగా ఉంటుంది. ఎవరెక్కువ ఇస్తే అటు వైపు మొగ్గు చూపిస్తున్నారు. కొంత మంది బృందాలుగా ఏర్పడి రోజుకో పార్టీలో చేరుతున్నట్టు కండువాలు కప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి రెండు బృందాలు పార్టీల వద్ద అందినంత వసూలు చేసి బిచాణా ఎత్తేశాయి. కొన్ని మురికివాడల్లో బస్తీ సంక్షేమ సంఘాలు వారు కూడా వేగంగా కడువాలు మారుస్తున్నారు. ఓటు బ్యాంకు బలంగా ఉన్న బస్తీల్లో నాయకులను ఆకట్టుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఫిలింనగర్‌లో అనేక బస్తీలను తమవైపు తిప్పుకున్నాయి. మిగతా పార్టీలు మాత్రం కండువా వేసుకోగానే కాదు ఓట్లు పడాలి కదా అంటూ కొట్టేస్తున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల ముందు పార్టీల్లో చేరికలు సర్వసాధరణమని, దీంతో ఓటు బ్యాంకులో తేడాలు రావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

Updated Date - 2020-11-21T19:44:57+05:30 IST