సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు..
వైసీపీ జిల్లా ప్లీనరీలో ఇన్చార్జి మంత్రి సీదిరి
నడకుదురు(కరప), జూలై 5: అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో కలిగిన ఇబ్బందులను పట్టించుకోవద్దని, కార్యకర్తలే వైసీపీకి శిరోధార్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కరప మండలం నడకుదురు కుసుమ సత్య ఫంక్షన్హాల్లో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా ప్లీనరీకి ఆయన ముఖ్యఅతిఽథిగా విచ్చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ పడిన కష్టం, కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే నేడు పార్టీ ప్రజల్లో బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, నవరత్నాలు పేరుతో ప్రజలకు అనేక సంక్షేమ పఽథకాలను అందించామన్నారు. వచ్చే రెండేళ్లు సమష్టిగా పోరాడి పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా చూడాలన్నారు. కార్యకర్తల శ్రేయస్సు, సంతృప్తి, అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రభుత్వ ధ్యేయమని, మన పార్టీ లక్ష్యమని సీఎం జగన్ మాటగా ఆయన చెప్పారు. మరో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కార్యకర్తలు నిరాశ చెందవద్దని వలంటీర్లు పెత్తనం చేస్తున్నారని నిస్పృహ చెందవద్దని కోరారు. సచివాలయాలను కంట్రోల్లోకి తీసుకోవాలని, పెన్సన్లు, ఇతర సంక్షేమ పఽథకాలను మీ చేతుల మీదుగా పంపిణీ చేయమని సెలవిచ్చారు. బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జడ్పీచైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి బోస్, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఎమ్మెల్సీ, ప్లీనరీ పరిశీలకురాలు వరుధు కళ్యాణి, కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, దొరబాబు మాట్లాడారు. వేదికపైకి చివరలో పిలిచారని అలిగిన వైసీపీ రాష్ట్ర ప్రచారకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు కోపంతో సభ నుంచి బయటకు వెళ్లిపోగా, పార్టీ నాయకులు బుజ్జగించి తీసుకెళ్లారు. ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో పలువురు అసంతృప్తిని వెళ్లగక్కారు.