సీఎం చెప్పినా నాయకులు వినరు

ABN , First Publish Date - 2021-07-15T06:11:28+05:30 IST

మాస్క్‌ పెట్టుకోకపోతే వంద రూపాయలు జరిమానా విధించాల్సిందే అని సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించినా ఆ పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు.

సీఎం చెప్పినా నాయకులు వినరు
మాస్కుల్లేకుండా సమావేశంలో పాల్గొన్న నాయకులు

తంబళ్లపల్లె, జూలై 14: మాస్క్‌ పెట్టుకోకపోతే వంద రూపాయలు జరిమానా విధించాల్సిందే అని సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే అన్నీ ఉత్తుత్తి మాటలే అని వైసీపీ తమ్ముళ్లు నిరూపిస్తున్నారు. తంబళ్లపల్లె మల్లయ్యకొండపై మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆలయ జీర్ణోద్ధరణ పనుల పారంభోత్సవ కార్యక్రమమే ఇందుకు సాక్ష్యం. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలు భౌతికదూరం సంగతే మరిచారు. గుంపులుగా కనిపించారు. తొక్కిసలాటగా ఉన్నా నియంత్రించే వారు లేరు. వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చిన మంత్రిగానీ, ఎమ్మెల్యేలుగానీ మాస్క్‌లు కూడా ధరించలేదు. వీరిని చూసి అనుచరులు కూడా మాస్క్‌లు తీసేశారు. కొందరు గడ్డాల కిందకు లాక్కుని తిరిగారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలతో జిల్లాలో రెండో వేవ్‌ మారణహోమం సృష్టించినా నాయకుల తీరు మారడం లేదు. అంచనాకన్నా ముందే మూడో వేవ్‌ను నాయకులు మోసుకొస్తున్నారని ఇటువంటి కార్యక్రమాలు సూచిస్తున్నాయి. 

Updated Date - 2021-07-15T06:11:28+05:30 IST