Abn logo
Sep 18 2021 @ 23:52PM

రా‘బడి’కేనా?

తల్లిదండ్రుల సమావేశాలకు హజరైన వైసీపీ నాయకులు(ఫైల్‌)

పాఠశాలల్లో రాజకీయ క్రీడ

పీఎంసీ దక్కించుకునేందుకు నేతలు పావులు

అధికార పార్టీలో విపరీతమైన పోటీ

తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు వైసీపీ నేతలు

కనీస నిబంధనలు పాటించని వైనం

(మెళియాపుట్టి)

‘విద్యా కమిటీలకు ఎన్నికలా? పాఠశాలల్లో రాజకీయలెందుకు? బడుల్లో రాజకీయ జోక్యం అవసరమా? ఈ నిర్ణయం విద్యావ్యవస్థను కలషితం చేయడమే’... విపక్షంలో ఉన్నప్పుడు విద్యాకమిటీల ఏర్పాటు, ఎన్నిక విషయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలివి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం తీరే మారిపోయింది. పీఎంసీలుగా పేరు మారడం తప్ప... కమిటీ ఎన్నికల్లో అంతా రాజకీయ ముద్ర నడుస్తోంది. ‘నాడు-నేడు’ పనుల్లో భాగంగా నిధుల వరదతో నేతలు పాఠశాలలపై దృష్టి సారించారు. తల్లిదండ్రుల కమిటీలు(పీఎంసీలు) దక్కించుకుంటే రా‘బడి’ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 3,875 పాఠశాలల్లో పీఎంసీల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 22న కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంతటా ఎన్నికల వాతావరణం కనిపించింది. నాడు-నేడు పనులతో పీఎంసీలకు ప్రాధాన్యం పెరిగింది. పదవులు దక్కించుకునేందుకు నేతలు సైతం పావులు కదుపుతున్నారు. దీంతో పాఠశాలల్లో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో విభేదాలు ఉన్నచోట ఎవరికి వారే తమ సానుభూతిపరులను పీఎంసీ పీఠాలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెళియాపుట్టిలో విభేదాలతో ఏకంగా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఓ నాయకుడు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చెప్పి తన అనుచరుడికి పదవి ఇప్పించాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. మధ్యాహ్న భోజనం, ఇతరత్రా సమస్యలను ఏకరవు పెడుతూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వాదనకు దిగడంతో రచ్చకెక్కింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. 


 అధికార పార్టీలో వర్గ విభేదాలు

జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్థాయిలో కూడా నేతలు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుతం ‘నాడు-నేడు’ పనులు తప్ప... ఇతర అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతరత్రా అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో పీఎంసీలదే కీలక పాత్ర. అందుకే పదవులకు ప్రాధాన్యం పెరిగింది.  ఇటీవల స్వాతంత్య్ర వేడుకల్లో పాఠశాలల్లో జెండా ఎగురవేసే అవకాశాన్ని ప్రభుత్వం పీఎంసీ అధ్యక్షుడికే ఇచ్చింది. వారి ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది. దీంతో అధికార పార్టీలో నేతలు ఎవరికివారు పావులు కదుపుతున్నారు. తల్లిదండ్రుల జాబితాను పట్టుకొని వారిని కలుస్తున్నారు. తాము సూచించిన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆదేశిస్తున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకు సైతం దిగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు హెచ్‌ఎంలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశాలకు నేరుగా నేతలు వచ్చి ఆశీనులవుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. అధికార పార్టీలో విభేదాలున్న చోట  ఒకరి మాట వింటే మరో వర్గం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. 


 ప్రశాంతంగా నిర్వహించాలి

పీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి. తల్లిదండ్రుల అభిప్రాయంతో పారదర్శకంగా చేపట్టాలి. వివాదాలు సృష్టించాలని చూస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. వివాదాలు లేకుండా ఎన్నికల రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం.

-సందీప్‌కుమార్‌, ఎస్‌ఐ, మెళియాపుట్టి