‘టీ’లేజర్స్.. Hyderabadలో నత్తనడకన వ్యాక్సినేషన్‌.. ఆరు రోజుల్లో ఇంతమందికేనా.. ఎందుకిలా..?

ABN , First Publish Date - 2022-01-09T15:14:24+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీనేజర్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు...

‘టీ’లేజర్స్.. Hyderabadలో నత్తనడకన వ్యాక్సినేషన్‌.. ఆరు రోజుల్లో ఇంతమందికేనా.. ఎందుకిలా..?

  • కేవలం 1.76లక్షల మందికే..
  • ఆసక్తి చూపని ప్రైవేటు యాజమాన్యాలు, తల్లిదండ్రులు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీనేజర్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు పలు ప్రైవేట్‌ ఆస్పత్లుల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేసినా చాలామంది ఆసక్తి చూపించడం లేదు. ఒమైక్రాన్‌ వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో  ఈనెల 3నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్‌ ఇస్తుండగా పెద్దగా నమోదు చేసుకోవడం లేదని సమాచారం.  


గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని విద్యా సంస్థల సమీపంలోని కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ సౌకర్యాన్ని కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 6.50 లక్షల మంది టీనేజర్లను వ్యాక్సినేషన్‌కు అర్హులుగా గుర్తించారు. అంటే వ్యాక్సిన్‌ ప్రారంభమైన ఆరురోజుల్లో రోజుకు మూడు జిల్లాల్లో కలిపి 30వేల మందికంటే తక్కువ మంది టీకాలు తీసుకున్నారు. శనివారం వరకు 1,76,968 మంది మాత్రమే వ్యాక్సిన్‌ స్వీకరించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. 


తర్వాత చూద్దాం..

విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న కొవిడ్‌ టీకాలపై ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. తల్లిదండ్రులు అనుమతించిన తర్వాతనే టీకాలు ఇప్పిస్తామని కొందరు చెబుతుండగా, పిల్లలకు జ్వరం వస్తుందనే  భయంతో మరికొంతమంది వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.  గ్రేటర్‌లోని రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు సంక్రాంతి పండుగ తర్వాత టీకా వేయించుకుంటామని తమ విద్యాసంస్థల కరెస్పాండెంట్లకు చెప్పినట్లు సమాచారం. ఆయా కేంద్రాల్లో రోజుకు 5 నుంచి 6వేల మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారని, పిల్లలు పెద్ద మొత్తంలో వస్తే నాలుగైదు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.

Updated Date - 2022-01-09T15:14:24+05:30 IST