అక్రమాలు నిజం..అయినా కష్టం!

ABN , First Publish Date - 2020-12-05T04:43:26+05:30 IST

‘అవును...అవి అక్రమ లేఅవుట్లే... అధిక శాతం అనుమతులు లేకుండా వేసినవే’... ఇదీ ఉద్దానంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లపై అధికారుల మాట. అదీ స్వయంగా వారే పరిశీలించి మరీ నిర్ధారించిన మాట. కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. అధికారులు చర్యలు చేపట్టకుండా అక్రమార్కులు పైరవీలు సాగిస్తున్నారు. కొంతమంది నాయకులతో కలిసి ఒత్తిడి తెస్తుండడంతో యంత్రాంగం మిన్నకుండిపోతోంది.

అక్రమాలు నిజం..అయినా కష్టం!
ప్రగడపుట్టుగ లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఈవో వెంకటరావు





ఉద్దానంలో అడ్డగోలు లేఅవుట్లపై కానరాని చర్యలు

అధికారులపై అక్రమార్కుల ఒత్తిడి

 పరిశీలనకే పరిమితమైన యంత్రాంగం

 కనీసం నోటీసులు కూడా ఇవ్వని వైనం

 కొనుగోలుదారులకు కష్టాలు

(కవిటి, డిసెంబరు 4)

‘అవును...అవి అక్రమ లేఅవుట్లే... అధిక శాతం అనుమతులు లేకుండా వేసినవే’... ఇదీ ఉద్దానంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లపై అధికారుల మాట. అదీ స్వయంగా వారే పరిశీలించి మరీ నిర్ధారించిన మాట. కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. అధికారులు చర్యలు చేపట్టకుండా అక్రమార్కులు పైరవీలు సాగిస్తున్నారు. కొంతమంది నాయకులతో కలిసి ఒత్తిడి తెస్తుండడంతో యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అక్రమార్కులకు నోటీసులు జారీ చేయడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారులు తూతూ మంత్రంగా అక్రమ లేఅవుట్లను పరిశీలించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో ఉద్దానంలో అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా సాగిపోతోంది. కవిటి మండలం బొర్రపుట్టుగ, గొండ్యాలపుట్టుగ, జగతి, రాజపురం, మాణిక్యపురం, ప్రగడపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ధర్మపురం, ఈదుపురం, బూర్జపాడు, హరిపురంలలో అక్రమ లేవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో దాదాపు 100 లేఅవుట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 2న ‘తోటలు కూల్చేయ్‌.. ప్లాట్లు వేసెయ్‌’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు స్పందించారు. అక్రమ లే అవుట్లను పరిశీలించారు. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని నిర్ధారించారు. అక్రమార్కులకు నోటీసులు మాత్రం జారీచేయలేదు. దీని వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రియల్టర్లు తమపై చర్యలు లేకుండా కొంతమంది నాయకులతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే.. రియల్‌ దందా కొనసాగే అవకాశం ఉందని ఉద్దానం వాసులు అభిప్రాయపడుతున్నారు. 


కొనుగోలుదారుల్లో గుబులు

నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి ప్రస్తుతం గుబులు పట్టుకుంది. ఈ లేఅవుట్ల పరిశీలనకు అధికారులు పదేపదే వస్తుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎందుకు పరిశీలిస్తున్నారని సంబంధిత రియల్టర్లను కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏం చెప్పాలో తెలియక రియల్టర్లు నీళ్లు నములుతున్నారు. అక్రమ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ అధికారులు అనుమతులు మంజూరు చేసే అవకాశం లేదు. ఈ విషయం తెలిసి కొనుగోలుదారులు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా బొర్రపుట్టుగ, కవిటి, గొండ్యాలపుట్టుగ, రాజపురం, జగతి గ్రామాలతో పాటు సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో పలువురు కొనుగోలుదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొత్తగా ప్లాట్ల కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు.


హెచ్చరిక బోర్డులు ఎక్కడ?

జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా ఉన్న లే అవుట్లలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ.. ఉద్దాన ప్రాంతంలో మచ్చుకైనా ఒక్క లే అవుట్‌ వద్ద కూడా హెచ్చరిక బోర్డు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే కొంతమేర కొనుగోలుదారులు జాగ్రత్త పడేవారు. అటువంటి చర్యలు లేకపోవడంతో నిలువునా మునిగిపోతున్నారు. అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. కొంతమంది పైసా పెట్టుబడి లేకుండా మధ్యవర్తులుగా వ్యవహరించి కమీషన్‌ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద పట్టణాల కు మించిపోయేలా స్థలాలకు ధరలు ‘సృష్టిస్తున్నారు’. ఇప్పటికైనా అధికారులు అక్రమ లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని... అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


నోటీసులు జారీ చేస్తాం

నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ నుంచి అనుమతులు మంజూరు చేయం. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి. ప్రభుత్వ నిబంధనలు మేరకు అనుమతులు పొందిన లేఅవుట్లలో మాత్రమే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తాం.  అక్రమంగా లేఅవుట్లు వేసిన వారికి తక్షణమే నోటీసులు జారీ చేస్తాం. వారి వివరాలను డాష్‌ బోర్డులో పెట్టేవిధంగా చర్యలు తీసుకుంటాం.

-జి.వెంకటరావు, ఈవో, కవిటి మేజర్‌ పంచాయతీ 




 

 బోర్డులు పెట్టాల్సిందే

గుజరాతీపేట, డిసెంబరు 4: అక్రమ లేఅవుట్ల విషయం ప్రజలకు తెలిసేలా ఆ ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఈవోపీఆర్డీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను, ఓడీఎఫ్‌, సాలిడ్‌ వేస్ట్‌ ప్రొసెసింగ్‌ సెంటర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, శానిటేషన్‌, అనధికార ఇళ్ల స్థలాలు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని అనధికార లేఅవుట్లపై పంచాయతీ సెక్రటరీలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘కేసులు పెడతామని అక్రమార్కులను హెచ్చరించాలి. సచివాల యాల్లో సిబ్బంది బయోమెట్రిక్‌ వేయాలి. ఇంటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలి. కొత్త షాపులు, రెస్టారెంట్లపై కొత్త అసెస్‌మెంట్‌, రిఅసెస్మెంట్‌లు రూపొందించాలి. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వద్దు.  250 ఇళ్లకు గ్రీన్‌ అంబాసిడర్‌ను నియమించాం. మరుగుదొడ్లులేని గృహాలను గుర్తించాలి. వారంలో రెండు రోజులు ఈవోపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలు వలంటీర్లతో కలసి గ్రామాల్లో పర్యటించాలి.’ అని కలెక్టర్‌ ఆదేశించారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాసులు, డీపీవో రవికుమార్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2020-12-05T04:43:26+05:30 IST