37,223..వికారాబాద్‌ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2020-11-04T09:46:55+05:30 IST

అక్రమ లే అవుట్లు, అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశానికి అనూహ్య స్పందన లభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం జిల్లా నుంచి 37,223 మంది ప్రభుత్వానికి దరఖాస్తు

37,223..వికారాబాద్‌ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు భారీగా దరఖాస్తులు

మునిసిపాలిటీల్లో 21,041, గ్రామ పంచాయతీల్లో 16,182 అభ్యర్థనలు 

దరఖాస్తుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.3,72,23,000 ఆదాయం


దరఖాస్తులు వచ్చింది ఇలా..మున్సిపాలిటీ దరఖాస్తులు

తాండూరు 12,347

పరిగి 4,239

వికారాబాద్‌ 4,041

కొడంగల్‌ 414



వికారాబాద్‌ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు అంచనాకు మించి వచ్చాయి. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే వచ్చింది. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)  : అక్రమ లే అవుట్లు, అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశానికి అనూహ్య స్పందన లభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం జిల్లా నుంచి 37,223 మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 16,182 దరఖాస్తులు రాగా, నాలుగు మునిసిపాలిటీల పరిధిలో 21,041మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 435 అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మునిసిపాలిటీల పరిధిలో 214 అక్రమ లేఅవుట్లు ఉండగా, 15 మండలాల్లో 59 గ్రామపంచాయతీల పరిధిలో 221 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు తేల్చారు. పరిగి మునిసిపల్‌ పరిధిలో 117, వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో 81, తాండూరు మునిసిపల్‌ పరిధిలో 11, కొడంగల్‌ మునిసిపల్‌ పరిధిలో 5 అక్రమ లేఅవుట్లు ఉండగా,. పరిగి మునిసిపాలిటీలో 8,214, వికారాబాద్‌లో 3,018, తాండూరులో 900, కొడంగల్‌ మునిసిపాలిటీ పరిధిలో 480 అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అఽధికారులు గుర్తించారు. అయితే అధికారుల దృష్టికి రాని అక్రమ ప్లాట్ల యజమానులు కూడా ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు.


మునిసిపాలిటీల పరిధిలోని అక్రమ లేఅవుట్లలో మొత్తం 12,675 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అంతకుమించి 21,041 దరఖాస్తులు రావడం విశేషం. అదే పంచాయతీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 247 పంచాయతీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 16,182 దరఖాస్తులు వచ్చాయి. లేఅవుట్‌ క్రమబద్ధీకరణకు దరఖాస్తు ఛార్జీ కింద రూ.10 వేలు, ప్లాట్‌ క్రమబద్ధీకరణకు రూ.1,000 చొప్పున రుసుము చెల్లించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే... ఆ తర్వాత ప్లాట్లను పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం రోడ్లకు అవసరమయ్యే స్థలం ప్లాట్‌ నుంచి మినహాయిస్తారు. ఆ తరువాత మిగతా ప్లాట్‌కు ఎంత చెల్లించాలనేది తెలియజేయనున్నారు. ప్రభుత్వం జనవరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నా ప్రస్తుతం మునిసిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందితో గడువులోగా కష్టమేననేది స్పష్టమవుతోంది. 


ఖజానాకు కాసుల పంట

మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ కాసులు వర్షం కురవనుంది. జిల్లాలో అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ప్లాట్‌ యజమాని దరఖాస్తు ఛార్జీల కింద రూ.1,000 చెల్లిస్తే, లేఅవుట్ల యజమానులు ఒక్కో లేఅవుట్‌కు రూ.10వేలు చెల్లించారు. వచ్చిన దరఖాస్తులతోనే ప్రభుత్వ ఖజానాకు రూ.3 కోట్ల 72 లక్షల 23వేల ఆదాయం సమకూరింది. లే అవుట్ల్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించిన తరువాత ప్రభుత్వానికి రూ.వందల కోట్లలో ఆదాయం జమ కానుంది. 


ఫలించిన విస్తృత ప్రచారం

అనధికార లే అవుట్ల్లు, ప్లాట్ల యజమానులు ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ జిల్లా పంచాయతీ, మునిసిపల్‌ శాఖల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోకపోతే వాటికి రిజిస్ట్రేషన్‌ చేయరని, ఇదివరకే రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్న వారికి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరనే విషయం ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 

Updated Date - 2020-11-04T09:46:55+05:30 IST