యూపీ జిల్లా కోర్టులో లాయర్‌ హత్య!

ABN , First Publish Date - 2021-10-19T07:16:47+05:30 IST

యూపీలోని షాజహాన్‌పుర్‌ జిల్లా కోర్టులో సోమవారం పట్టపగలే ఒక న్యాయవాది హత్య జరిగింది. భూపేంద్రసింగ్‌(38) అనే న్యాయవాదిని ....

యూపీ జిల్లా కోర్టులో లాయర్‌ హత్య!

పాత తగాదాలతో తోటి లాయరే కాల్పులు

షాజహాన్‌పుర్‌(యూపీ), అక్టోబరు 18: యూపీలోని షాజహాన్‌పుర్‌ జిల్లా కోర్టులో సోమవారం పట్టపగలే ఒక న్యాయవాది హత్య జరిగింది. భూపేంద్రసింగ్‌(38) అనే న్యాయవాదిని తోటి లాయరే తుపాకితో కాల్చి చంపాడు. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన కాల్పులు ముగ్గురి మరణానికి దారి తీసిన ఘటన మరువకముందే యూపీ జిల్లా కోర్టులో ఈ హత్య జరిగింది. న్యాయవాది భూపేంద్రసింగ్‌ సోమవారం మధ్యాహ్నం ఒక కేసుకు సంబంధించి షాజహాన్‌పుర్‌ జిల్లా కోర్టులోని మూడో అంతస్తులోని క్లర్కును కలిసేందుకు వెళ్ళారు. అప్పుడు తుపాకి కాల్పులు వినిపించాయి.


ఆ వెంటనే ఆయన ప్రాణాలు కోల్పోయారని, మృతదేహం వద్ద లైసెన్సు లేని ఒక పిస్తోలు కూడా పడి ఉందని జిల్లా ఎస్పీ ఎస్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ నేరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను కాల్పులు జరిపినట్లుగా నిందితుడైన మరో న్యాయవాది ఒప్పుకున్నాడు. వారి మధ్య ఉన్న పాత వివాదాలే దీనికి కారణమని రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. దీనిపై ఆగ్రహం చెందిన జిల్లాలోని న్యాయవాదులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలపై గొప్పలు చెప్పుకొనే బీజేపీ సర్కారు సిగ్గుపడాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. యూపీలో ఎవరికీ రక్షణ లేదనడానికి న్యాయవాది తాజా హత్యే నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు.   

Updated Date - 2021-10-19T07:16:47+05:30 IST