Abn logo
Mar 3 2021 @ 23:51PM

న్యాయవాది మృతి.. ఆత్మహత్యగా భావిస్తున్నాం : డీఎస్పీ

కడప(క్రైం), మార్చి 3: నగరంలోని ప్రముఖ న్యాయవాది పుల్లగూర సుబ్రమణ్యం మృతి ఆత్మహత్యగా భావిస్తున్నామని కడప డీఎస్పీ సునీల్‌ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ వస్తున్న సుబ్రమణ్యం ఈ నెల 1వ తేదీ సాయంత్రం 5.45కు సమీపంలో ఉన్న ఆయన కార్యాలయానికి బైకుపై వచ్చాడని, అక్కడ పార్కింగ్‌ చేసి నడుచుకుంటూ పక్కనున్న శిల్పకళా సదనం అపార్ట్‌మెంటులోకి నడుచుకుంటూ వెళ్లాడన్నారు. అయితే ఉదయం 5.55 గంటలకు పై నుంచి కింద పడుతున్నట్లుగా సీసీ ఫుటేజీలో పరిశీలించామన్నారు. ఆయనకు చెందిన ఫోన్‌ కాల్స్‌కు సంబంధించి సీబీఆర్‌ రిపోర్టుకు పెట్టామని, అలాగే ఆయన మానసిక స్థితి, ఫ్యామిలీ వృత్తి రీత్యా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, ఆయన మృతికి గల కారణాలు త్వరలోనే కనుగొంటామన్నారు. అయితే న్యాయవాది సుబ్రమణ్యం మృతిపై పోలీసుశాఖ తరపున విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అయితే సుబ్రమణ్యం మృతిపై మరో అడ్వకేట్‌ అరవింద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, కుటుంబ సభ్యులను కూడా అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మృతికి గల కారణాలు వెల్లడిస్తామన్నారు. కాగా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగాలే తప్ప చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యకు పాల్పడి జీవితాలను ముగించుకోవద్దని డీఎస్పీ సునీల్‌ సూచించారు. ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. 


న్యాయవాది సుబ్రమణ్యంది హత్యే !

- ఓపీడీఆర్‌ నిజనిర్ధారణ కమిటీ

కడప(క్రైం)/కడప(రూరల్‌), మార్చి 3: కడప బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది సుబ్రమణ్యంను పథకం ప్రకారమే అపార్ట్‌మెంట్‌పై నుంచి తోసివేసి హత్య చేసినట్లు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెల్లడైనట్లు ఆ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, ఉపాధ్యక్షుడు కొండారెడ్డి, న్యాయవాది అమీన్‌పీర్‌లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుబ్రమణ్యం మృతిపై అపార్ట్‌మెంటు వాసులను, స్థానికులను, డాక్టర్‌ను, సహ న్యాయవాదులను, మృతుని కక్షిదారుల నుంచి నిజనిర్ధారణ కమిటీ వాస్తవాలను సేకరించిందన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని తేటతెల్లమైందన్నారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు భోజనం సరిగా చేయరు, కక్షిదారులతో మాట్లాడరన్నారు. అయితే సుబ్రమణ్యం మృతి చెందిన రోజు సాయంత్రం 5గంటలకు తన కార్యాలయానికి వెళ్లి కక్షిదారులతో మాట్లాడినట్లు సహ న్యాయవాదులు చెబుతున్నారన్నారు. తరువాత శిల్పాసదన్‌ అపార్ట్‌మెంట్‌లోనికి వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయన్నారు. ఏదేమైనా పోలీసులు వెంటనే ఈ దిశగా కేసును చేధించి సుబ్రమణ్యం మృతికి కారకులైన వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతున్నట్లు తెలిపారు.


బార్‌ అసోసియేషన్‌ సంతాపం

ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం మృతిపట్ల బుధవారం కడప బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో సంతాప సభను నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి.రాఘవరెడ్డి, అరుణకుమారి, పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు సుబ్రమణ్యం అందించిన సేవలను కొనియాడారు. 

Advertisement
Advertisement
Advertisement