కేజ్రీవాల్‌కు రెండు కేసుల్లో బెయిలు మంజూరు

ABN , First Publish Date - 2021-10-25T22:53:14+05:30 IST

మత సామరస్యాన్ని దెబ్బతీయడం, ఎన్నికల నేరాలకు

కేజ్రీవాల్‌కు రెండు కేసుల్లో బెయిలు మంజూరు

న్యూఢిల్లీ : మత సామరస్యాన్ని దెబ్బతీయడం, ఎన్నికల నేరాలకు పాల్పడటానికి సంబంధించిన కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లామేకర్స్ స్పెషల్ కోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసింది. ఆయన కోర్టుకు హాజరై, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నమోదైన ఈ కేసుల నుంచి తనకు ఉపశమనం కల్పించాలని జడ్జిని కోరారు.  ఈ రెండు కేసుల్లోనూ తదుపరి విచారణ నవంబరు 3న జరుగుతుందని స్పెషల్ జడ్జి పీకే జయంత్ తెలిపారు. 


కేజ్రీవాల్ తరపు న్యాయవాది మదన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులపై విచారణకు స్వయంగా కోర్టుకు హాజరుకావడం నుంచి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. అయితే ఆయన తనంతట తాను కోర్టుకు హాజరయ్యారని చెప్పారు. బాధ్యతాయుతమైన పౌరునిగా, ఈ కేసు విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో, ఇష్టపూర్వకంగా ఆయన కోర్టుకు హాజరై, బెయిలు కోసం దరఖాస్తు చేశారని, కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసిందని చెప్పారు. 


2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని గౌరీ గంజ్, ముసాఫిర్ ఖానా పోలీస్ స్టేషన్లలో ఈ రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ తరపున ప్రచారం సందర్భంగా వీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. 


Updated Date - 2021-10-25T22:53:14+05:30 IST