లా వర్సిటీ వీసీ నియామక అధికారం ముఖ్యమంత్రిదే

ABN , First Publish Date - 2022-05-06T14:24:30+05:30 IST

డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ను ఇకపై రాష్ట్ర ముఖ్యమంత్రే నియమించేలా గురువారం న్యాయశాఖ మంత్రి రఘుపతి అసెంబ్లీలో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టారు.

లా వర్సిటీ వీసీ నియామక అధికారం ముఖ్యమంత్రిదే

                       - శాసనసభలో ముసాయిదా చట్టం ఆమోదం


చెన్నై: డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ను ఇకపై రాష్ట్ర ముఖ్యమంత్రే నియమించేలా గురువారం న్యాయశాఖ మంత్రి రఘుపతి అసెంబ్లీలో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టారు. సభ్యుల చర్చ అనంతరం ఈ ముసాయిదా చట్టాన్ని ఆమోదించినట్లు స్పీకర్‌ అప్పావు ప్రకటించారు. ఇటీవలే రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్లను ముఖ్యమంత్రి నియమించేలా వీసీల చట్టాన్ని సవరించి ముసాయిదా చట్టాన్ని శాసనసభలో ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ బిల్లును మరుసటి రోజు గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. ఈ నేపథ్యంలో నగరంలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయవిశ్వవిద్యాలయం వీసీని కూడా ముఖ్యమంత్రి నియమించేలా చట్టాన్ని సవరించి న్యాయశాఖ మంత్రి రఘుపతి శాసనసభలో ముసాయిదా తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో వీసీలను ఛాన్సలర్‌ (రాష్ట్ర గవర్నర్‌) నియమిస్తారనే వాక్యాన్ని తొలగించి, వీసీలను ప్రభుత్వమే నియమిస్తుందని సవరించి ముసాయిదా చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం న్యాయవిశ్వవిద్యాలయం వీసీగా నియమించబడేవారు అక్రమాలకు పాల్పడితే వారిని సీఎం తొలగించి, సెర్చ్‌కమిటీ ప్రతిపాదించే ముగ్గురిలో ఒకరిని  వీసీగా నియమించనున్నారని తెలిపారు. ఈ ముసాయిదా చట్టానికి సంబంధించిన బిల్లు కూడా త్వరలో గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నట్లు తెలుస్తోంది.

Read more