Abn logo
Feb 22 2020 @ 03:57AM

ఎకరం అసైన్డు తీసుకొన్నా... 40 మంది పేదలకు లబ్ధి

ముందస్తుగా నోటీసు ఇచ్చినా రైతులతో మాట్లాడే నిర్ణయం

‘పశ్చిమ’ కలెక్టర్‌ ముత్యాలరాజు వ్యాఖ్యలు

‘పసుపు-కుంకుమ భూములూ వదల్లేదు’ కథనంపై మీడియాకు వివరణ

బలవంతం లేదు.. ఇష్టంగా ఇస్తున్నారు

కడప కలెక్టర్‌ శ్రీకాకుళం ఇన్‌చార్జి కలెక్టర్ల వెల్లడి


ఏలూరు, కడప, శ్రీకాకుళం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): చట్టప్రకారం ఒక ఎకరం అసైన్డు భూమి తీసుకొన్నప్పటికీ, దానిని 40 మంది పేదలకు పంచి లబ్ధి చేకూర్చుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. పేదల అసైన్డు భూములను స్థలాల సేకరణలో ఎందుకు తీసుకొంటున్నారని మీడియా ప్రశ్నించగా, కలెక్టర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెట్టడానికి పేదలనే కొడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ రాస్తే.. ఇప్పటిదాకా ప్రభుత్వం, అధికారులు ఖండిస్తూ వచ్చారు. అయితే, ముత్యాలరాజు వ్యాఖ్యలు పేదలపై వేటగా మారిన స్థలాల సేకరణ మారిందన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. ‘పసుపు-కుంకుమ భూమినీ వదల్లేదు’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వచ్చిన కథనంపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన స్పందించారు. అలాగే, పేదల స్థలాల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న వరుస కథనాల నేపథ్యంలో కడప కలెక్టర్‌  సి.హరికిరణ్‌, శ్రీకాకుళం ఇన్‌చార్జి కలెక్టర్‌ కె. శ్రీనివాసులు కూడా స్పందించారు. తణుకు సమీపాన ఉన్న పైడిపర్రులో పసుపు-కుంకుమ భూముల సేకరణ వ్యవహారంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు స్పందిస్తూ.. అక్కడ నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఇప్పుడు రైతులే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ‘‘పైడిపర్రు గ్రామంలో రైతులకు చెప్పకుండానే నోటిఫికేషన్‌ జారీ చేశామనడం సరికాదు. ప్రజావసరాల దృష్ట్యా ముందస్తుగా నోటిఫికేషన్‌ ఇచ్చినా, రైతులతో చర్చించే తుది నిర్ణయాలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం వారికి పరిహారం చెల్లించే విషయంలో చర్చిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గుర్తించిన అసైన్డు భూములను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నాం. ఇదే గ్రామానికి చెందిన గోళ్ల సుబ్బలక్ష్మికి చెందిన 92 సెంట్ల భూమిని స్వాధీన పరుచుకోలేదు’’ అని వివరించారు. అలాగే, పైడిపర్రులో రైతులకు 56 లక్షలు చొప్పునే చెల్లించేందుకు ఒత్తిడి చేస్తున్నామనడం కూడా సరికాదని, అసైన్డు భూముల వ్యవహారంలో తగిన చట్ట పరిధిలోనే భూమిని స్వాధీనం చేసుకుంటున్నామే తప్ప ఎవరినీ వేధించడం, ఒత్తిడి చేయడం తమ లక్ష్యం కాదన్నారు. కాగా, గతంలో ఇంటి పట్టా తీసుకొని ఉంటే అదే స్థలంలో వారికే ఇంటి పట్టాలు ఇస్తామని కడప జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. ‘‘తండ్రి పట్టాలిస్తే.. తనయుడు లాగేసుకుంటున్నాడు’’ శీర్షికన ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రచురించిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చినా ఇప్పటికీ అవి ఖాళీగానే ఉన్నాయి. తెలిసోతెలియక ప్రజలు ప్రభుత్వ ఇంటి పట్టా కొనుగోలు చేసి ఉంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వాటిని క్రమబద్దీకరిస్తున్నాం. అంతేగానీ ఎవరి ఇంటి పట్టా లాక్కోవడం లేదు’’ అని వివరించారు. కాగా, పేదలకు స్థలాల సేకరణలో భాగంగా ఎక్కడా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోలేదని, జిరాయితీ భూములు కల్గిన రైతులు స్వచ్ఛందంగానే వాటిని ఇచ్చారని శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కే శ్రీనివాసులు తెలిపారు. 


భూమి లాగేసుకుంటున్నారని...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి శివారు లింగారెడ్డిగూడేనికి చెందిన కొరపాటి అన్నమ్మ వయసు 60. 40 ఏళ్లుగా సాగే ఆమెకు తెలిసిన జీవితం. తాను సాగు చేస్తున్న అసైన్డు భూమి స్థలాల సేకరణలో పోతున్నదని తెలుసుకొని.. అన్నమ్మ తట్టుకోలేకపోయింది. గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురయి మరణించింది. అన్నమ్మకు గతంలో ఎకరన్నర అసైన్డు భూమిని ప్రభుత్వం కేటాయించింది. బోరు కూడా మంజూరు చేసింది. ఆ భూమిలో ఆమె ఏటా వరివేస్తోంది. ఆ భూమిని తన కుమార్తెలకు పసుపు-కుంకుమ కింద ఇచ్చింది. ఈ వయసులోనూ ఆ పొలంలో పనులు చేస్తోంది. గురువారం రెవెన్యూ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. పొలం కొలతలు వేసుకుని వెళ్లారు. అన్నమ్మ ఎంత బతిమాలినా అధికారులు వినిపించుకోలేదని తోటి మహిళా రైతులు వాపోయారు. తన పొలం కూడా సేకరణలో పోవడంతో అదే ప్రాంతానికి చెందిన కొరపాటి నవరత్నం మంచం పట్టింది.


మా భూమే కనిపించిందా?

‘‘మాకు ఎకరం పొలం ఉంది. సీజన్లో వ్యవసాయ పనులు, ఖాళీ సమయాల్లో ఇతర ఉపాధి పనులు చేసుకుంటాం. అలాంటి మా మా భూమే అధికారులకు కనిపించిందా? ఇది చాలా అన్యాయం’’

- బి.ఈశ్వరమ్మ, బాధిత రైతు, 

విజయనగరం మండలం 

ఇది తగునా?

‘‘నాకు ఎకరం పొలం ఉంది. కూరగాయలు, అరటి సాగుచేస్తున్నాను. ఈ ఏడాది రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. కళ్లెదుటే పక్వానికి వచ్చిన పంటను నాశనం చేశారు. అధికారులకు ఇది తగునా? మా ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది’’

- ఎ.రామమ్మ, రాకోడు, విజయనగరం జిల్లా

పరిహారం అందిస్తాం..

‘‘ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు రైతుల నుంచి సేకరిస్తున్నాం. మిగతాది రైతులు సాగుచేస్తున్నా.. రెవెన్యూ రికార్డుల్లో గెడ్డ పోరంబోకుగా ఉంది. సేకరిస్తున్న మూడు ఎకరాలకు మాత్రం పూర్తిస్థాయిలో పరిహారం అందిస్తాం. సాగులోని భూమికీ డబ్బులిస్తాం’’

       - రవికుమార్‌, ఆర్‌ఐ, విజయనగరం

Advertisement
Advertisement
Advertisement