Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 08 Jul 2022 15:51:13 IST

సినిమా రివ్యూ: ‘హ్యాపీ బర్త్‌డే’(Happy birthday)

twitter-iconwatsapp-iconfb-icon

రివ్యూ: ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy birthday)

విడుదల తేదీ: 8–7–2022
నటీనటులు: లావణ్యా త్రిపాఠీ, నరేష్‌ ఆగస్త్య, వెన్నెల కిషొర్‌, సత్య, గెటప్‌ శ్రీను, రాహుల్‌ రామకృష్ణ, విద్యుల్లేఖ రామన్‌, గుండు సుదర్శన్‌ తదితరులు. (Lavanya tripati)
కెమెరా: సురేష్‌ సారంగం
సంగీతం: కాల భైరవ
సమర్పణ: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు
కథ–మాటలు–స్ర్కీన్‌ప్లే– దర్శకత్వం: రితేష్‌ రానా

‘అందాల రాక్షసి’ లావణ్యా త్రిపాఠీ సరైన విజయం అందుకుని చాలా కాలమైంది. ఇప్పటి వరకూ గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌, ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేసిన ఆమె ఆ గీత దాటి కాస్త రూట్‌ మార్చారు. వినోదం వైపు అడుగేశారు. తాజాగా ఆమె నటించిన ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో ఫుల్‌లెంగ్త్‌ కామెడీ రోల్‌ చేశారు. ‘మత్తు వదలరా’ సినిమాతో అలరించిన రితేశ్‌ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయం కోసం ఎదురుచూస్తున్న లావణ్యకు హిట్‌ దక్కిందా? ‘మత్తు వదలరా’ చిత్రంతో నవ్వులు పూయించిన రితేశ్‌ ఈ సినిమాతో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడా? అన్నది రివ్యూలో చూద్దాం. (Happy birthday movie review)

కథ
డిఫెన్స్‌ మినిస్టర్‌ రిత్విక్‌ సోధి (వెన్నెల కిశోర్‌) గన్‌ లైసెన్స్‌ లీగలైజ్‌ చేయాలనే బిల్లు ప్రవేశపెట్టి పాస్‌ చేయించి రిట్జ్‌ గ్రాండ్‌ హోటల్‌కు వస్తాడు. అతనికి అక్కడ ఏం జరిగింది.
హ్యాపీ.. పసుపులేటి (లావణ్యా త్రిపాఠీ) పుట్టినరోజు సెలబ్రేషన్‌ కోసం అదే హోటల్‌లో పాష్‌ పబ్‌లో దిగుతుంది. అక్కడ అమెకు ఏం జరిగింది.
లక్కీ (నరేష్‌ అగస్త్య) ఎవరు? రిట్జ్‌ హోటల్‌లో అతను మౌనవ్రతం పాటిస్తూ.. ఉండటానికి కారణం ఏంటి?
గూండా పేరుతో రాహుల్‌ రామకృష్ణ అదే హోటల్‌లో ఎందుకు దిగాడు. అతనికి లక్కీకి సంబంఽధం ఏంటి?
బేబీ పసుపులేటి(సెకెండ్‌ లావణ్య)ఎవరు? కథగా చెప్పాలంటే ఇదే!

1. లావణ్య
2. లక్కీ
3. మాక్స్‌ పెయిన్‌
4. బేబీ
5. స్నిప్పర్‌ సామ్‌
6. గూడుపుఠానీ..
ఇలా ఆరు అద్యాయాలుగా ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తుల కలయిక! దాని వెనుకున్న కారణాలు ఏంటనేది తెరపై చూడాల్సిందే! (Lavanya tripati's Happy birthday movie review)

విశ్లేషణ:
ఇంటింటికీ గన్ను సదుపాయం ఉంటే ఎలా ఉంటుందన్న దగ్గర కథ మొదలైంది. ఆ లైన్‌ ఓ హోటల్‌లో చేరి అక్కడి నుంచే మిగతా కథ నడుస్తుంది. పేక్షకుడికి చక్కని వినోదాన్ని పంచితే లాజిక్కులు గురించి ఆలోచించకుండా సినిమాను ఆదరిస్తారు. 1. లావణ్య, 2. లక్కీ, 3. మాక్స్‌ పెయిన్‌, 4. బేబీ, 5. స్నిప్పర్‌ సామ్‌, 6. గూడుపుఠానీ.. ఈ ఆరు ఆధ్యాయాల్లో పాత్రలు ఎప్పుడు ఎలా వచ్చి.. ఎలా వెళతాయో కూడా అర్థం కాకుండా ఉన్నాయి. పార్లమెంట్‌లో బిల్‌ పాస్‌ చేసే సీన్‌ సటైరికల్‌ ఉంది. ఆ తర్వాత సన్నివేశాలు ఫన్‌ పంచుతాయి. ఆ తర్వాత తెరపై ఏవేవో పాత్రలు వస్తుంటాయి. ఆ పాత్రలు అక్కడక్కడా నవ్వించినా ఎక్కువ శాతం విసుగు పుట్టించేలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే కామెడీ షోల్లో స్కిట్స్‌లా అనిపించాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన చాలా మీమ్స్‌ ఈ సినిమా తెరపై కనిపించాయి. హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో మద్యం సేవించడం హానికరం అన్న డిస్‌క్లైమర్‌తోపాటు ‘ఈ పాట నిర్మాత కోరిక మేరకు చిత్రీకరించబడింది’ అని వేశారు. అంటే ఆ పాటను కావాలని సినిమాలో ఇరికించారా అన్న అనుమానం ప్రేక్షకుడికి రాకపోదు. స్ర్కీన్‌ మీద కాస్త రిలాక్స్‌డ్‌గా ఉన్న పాత్ర ఏదన్నా ఉందీ అంటే అది మాక్స్‌ పెయిన్‌ సత్యదే. ఆటో గేర్‌ కార్‌ డ్రైవింవ్‌ ఎలా అన్న వీడియో సన్నివేశం కడుపుబ్బ నవ్వించింది. ఫారినర్‌, వెన్నెల కిశోర్‌, సత్య మధ్య అనువాద సన్నివేశం బాగా ఆకట్టుకుంటుంది. అయితే వరుస పెట్టి పాత్రలు రావడంతో కథ అంతా గందరగోళం అనిపించింది. యూట్యూబర్‌ రవితేజ, వైవా హర్షా టీమ్‌తో వచ్చిన సీక్వెన్‌, అక్కరలేని యాక్షన్‌ సీన్లు, ట్విస్ట్‌లు బోర్‌ కొట్టించాయి. హీరోయిన్‌ లావణ్యకు కొత్త తరహా పాత్ర ఇది. పాత్రకు తగ్గట్టు యాక్ట్‌ చేసుకుంటూ వెళ్లిపోయింది. నటన విషయంలో ఎక్కడా మైనస్‌ అనిపించుకోలేదు. తెరపై బోర్‌ కొట్టించని పాత్ర సత్యదే. అతని పాత్ర ఎక్కడా విసుగు కలిగించలేదు. కనిపించిన ప్రతిసారీ నవ్వించాడు. గుండు సుదర్శన్‌ ట్రాక్‌ కూడా ఫర్వాలేనదిపించింది. గెటప్‌ శ్రీను, రోహిణి సీన్స్‌ వర్కవుట్‌ కాలేదు. వరుసగా ఏడెనిమిది ట్రాక్‌లు రావడంతో ఏదీ గుర్తు పెట్టుకునేలా లేదు. (Lavanya tripati's Happy birthday movie review)

సెటైర్‌, కామెడీ టైమింగ్‌ బాగా తెలిసిన దర్శకుడు రితేష్‌. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సర్రియల్‌ కామెడీ అంటూ దర్శకుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు.  ‘మత్తు వదలరా’ వంటి సినిమాతో రితేశ్‌ సక్సెస్‌ సాధించడంతో ఇదేదో కొత్త జానర్‌ కథ అనుకుని ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఏదో ఉంటుందని నమ్మారు. ‘మత్తు వదలరా’ సినిమా సక్సెస్‌కి కామెడీ పండిన తీరు, టైమింగ్‌ కారణం. అయితే సర్రియల్‌ కామెడీ అంటూ హ్యాపీ బర్త్‌డే’ విషయంలో ఆయన పెంచిన అంచనాలను అందుకోలేకపోయాడు. రాసుకున్న కథకు ఓకే అనిపించినా, నడిపించిన తీరు ఆకట్టుకోలేదు. నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నప్పటికీ ఆ సందర్భాలను సరిగా వినియోగించుకోలేదు. అసలు తెరపై అన్ని పాత్రలు ఎందుకు వచ్చాయి.. ఎందుకు వింతవింతగా ప్రవర్తిస్తున్నాయి.. ఇదంతా ఎందుకు అంటే... వెన్నెల కిశోర్‌ మీద లావణ్య పగ తీర్చుకోవడానికి అని కన్‌క్లూజన్‌ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాస్త క్రిస్ప్‌గా చెప్పుంటే బావుండేది. ఇక టెక్నీషియన్ల విషయానికొస్తే.. కాలభైరవతో చక్కని ట్యూన్స్‌ రాబట్టుకోలేకపోయారు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఆకట్టుకుంది. కెమెరా వర్క్‌ బావుంది. నిర్మాతల విలువలు   రిచ్‌గా ఉన్నాయి. గుండు సుదర్శన్‌, క్లైమాక్స్‌ ఫైట్‌, రవితేజ సీక్వెన్స్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. ‘కథ ఎలా ఉన్నా ఫర్వాలేదు. లాజిక్కులతో మాకు పనే లేదు.. తెరపై  లెక్కలేని పాత్రలు ఎన్ని వచ్చినా తట్టుకోగలం అనుకునే వారు, సర్రియల్‌ కామెడీ అంటే ఇదేనేమో అనుకునేవారు ఈ సినిమా చూసే ధైర్యం చేయవచ్చు. (Lavanya tripati's Happy birthday movie review)

ట్యాగ్‌లైన్‌: బోరింగ్‌ బర్త్‌డే 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement