సినిమాలో మద్యపాన, ధూమపాన సన్నివేశాలు ఉంటే తెరపై తప్పకుండా ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హనికరం’ అనే హెచ్చరిక జారీ చేయాల్సిందే. ఎందుకంటే... పాత్రలకు అనుగుణంగా నటీనటులు ప్రవర్తించే తీరు చూసి ప్రేక్షకులు ప్రభావితం కాకూడదని! కొందరు దర్శకులు, నటీనటులు మద్యపాన, ధూమపాన సన్నివేశాలకు దూరంగా ఉంటున్నారు కూడా! అయితే, లాక్డౌన్లో కొత్త ధోరణి మొదలైంది. సామాజిక బాధ్యతను విస్మరించిన కొందరు నటీనటులు సామాజిక మాధ్యమాల్లో మద్యపాన ఉత్పత్తులకు ప్రచారం ప్రారంభించారు. లావణ్యా త్రిపాఠీ అటువంటి ప్రచారానికి ‘నో’ చెప్పారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డబ్బు కంటే సామాజిక బాధ్యత ముఖ్యమని పలు అవకాశాలు వచ్చినప్పటికీ లిక్కర్ ప్రచారానికి ‘నో’ అన్నారట. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్ప్రెస్’, కార్తికేయ గుమ్మకొండ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో లావణ్యా త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్నారు.