మహిళలపై లాఠీ

ABN , First Publish Date - 2020-06-07T09:36:24+05:30 IST

ఓ చిన్న గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలను తాళలేక ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసులపై

మహిళలపై లాఠీ

  • రోడ్డు నిర్మాణంపై ఇరువర్గాల వివాదం
  • ఓ వర్గంపై విచక్షణరహితంగా పోలీసుల దాడి
  • సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలు, మరో మహిళ 
  • తిరగబడ్డ యువకులు.. మరిన్ని బలగాల రాక


రణస్థలం, జూన్‌ 6: ఓ చిన్న గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలను తాళలేక ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో  పోలీసులపై స్థానిక యువకులు తిరగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల పంచాయతీ కొత్తముక్కాం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... గ్రామంలో ముందుగా కాలువలు నిర్మించి ఆ తరువాత సీసీ రోడ్లు వేస్తామని అధికారులు, నాయకులు చెప్పారు. అయితే, ఓ వీధిలో కాలువ నిర్మించకుండా పాత రోడ్డుపైనే కొత్తగా సీసీ రోడ్డు వేసేందుకు శనివారం పనులు ప్రారంభించారు. ఈ పనులను వైసీపీకి చెందిన ఓ వర్గం అడ్డుకుంది. కాలువలు నిర్మించకుండా రోడ్డును ఎత్తు చేస్తే వర్షం నీరు ఇళ్లలోకి వస్తుందని, ముందు కాలువలు నిర్మించాలంటూ మాజీ సర్పంచ్‌ వర్గీయులను నిలదీశారు. దీంతో వివాదం రాజుకుని ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. సమాచారం అందుకున్న జేఆర్‌పురం పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్‌ఐ ఇ.శ్రీనివాసరావు సహా పోలీసులు లాఠీలు, చేతులతో మహిళలను విచక్షణ రహితంగా కొట్టారు. ఓ వర్గం వారిని వెంటాడి మరీ కొట్టడంతో భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసుల దెబ్బలకు వృద్ధురాలు పోలీసమ్మ(60), మరో మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానిక యువకులు పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లావేరు పోలీసులను రప్పించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సినపోలీసులే ఒక వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడికి దిగడం విమర్శలకు తావిచ్చింది.

Updated Date - 2020-06-07T09:36:24+05:30 IST