వరంగల్‌ ఘటనలో తాజా అప్డేట్ ఇదీ..

ABN , First Publish Date - 2020-05-24T12:22:27+05:30 IST

అనుమానాస్పద స్థితిలో 9 మంది మృతి చెందిన సంఘటనపై

వరంగల్‌ ఘటనలో తాజా అప్డేట్ ఇదీ..

  • రంగంలోకి దిగిన క్లూస్‌టీం
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైదరాబాద్‌ అధికారులు

వరంగల్ /గీసుగొండ : గీసుగొండ మండలం గొర్రెకుంట శివారు సాయిదత్తా ట్రేడర్స్‌ వద్ద పాడుపడిన బావిలో పడి అనుమానాస్పద స్థితిలో 9 మంది మృతి చెందిన సంఘటనపై పోలీసులు శనివారం పలు కోణాల్లో పరిశీలించారు. క్లూస్‌టీం, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫోరెనిక్స్‌ నిపుణుడు బావి, మృతులు నివసించిన గదులను పరిశీలించారు. మృతులు గదుల్లోని పలు వస్తువుల నుంచి ఫింగర్‌ ప్రింట్‌లను సేకరించారు. బిహారీలు ఉన్న  రెండో అంతస్థులోని గదులను నిశితంగా పరీక్షించారు. ఈ రెండో అంతస్థు పక్కనే పాడుపడిన బావి ఉండటంతో ఇక్కడే ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పరిశీలించారు.


బావికి 100మీటర్ల దూరంలో ఉన మక్సూద్‌ కుటుంబం ఉన్న రెండు గదుల్లోని అన్ని వస్తువులను క్లూస్‌టీం బృందం గంటపాటు పరిశీలించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫోరెనిక్స్‌ నిపుణుడు మృతదేహాలపై క్రాషెష్‌ ఉన్నట్లు చెప్పారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ల్యాబ్‌ రిపోర్టులు వస్తాయని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేశారు. సాయిదత్తా ట్రేడర్స్‌ ఆవరణలోకి ఎవరిని రానివ్వకుండా చూడాలని సీఐ శివరామయ్యను డీసీపీ ఆదేశించారు. మృతుల మిస్టరీని ఛేదించేందుకు ఇప్పటికే ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారులు చెప్పారు.

Updated Date - 2020-05-24T12:22:27+05:30 IST