కొలిక్కివచ్చిన Bank Of Baroda కుంభకోణం.. కోట్ల రూపాయిలు పక్కదారి..!

ABN , First Publish Date - 2021-09-15T12:22:14+05:30 IST

మొత్తం నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్లు తనిఖీలను ..

కొలిక్కివచ్చిన Bank Of Baroda కుంభకోణం.. కోట్ల రూపాయిలు పక్కదారి..!

  • డ్వాక్రా సంఘాల్లో రూ. 2.37 కోట్ల పక్కదారి! 
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగుల నిర్వాకం


చిత్తూరు జిల్లా/కలికిరి : డ్వాక్రా సంఘాల్లో జరిగిన లావాదేవీలపై 27 రోజులుగా చేపట్టిన తనిఖీలు మంగళవారానికి కొలిక్కి వచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగుల నిర్వాకంతో  మొత్తం రూ. 2.37 కోట్లు మహిళా సంఘాల్లో పక్కదారి పట్టినట్లు తేల్చారు. బీవోబీలో ఖాతాలున్న మొత్తం 232 గ్రూపుల్లో జరిగిన లావాదేవీలను వడపోయగా 79 గ్రూపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. రూ.2,36,84,412 సంఘాల ఖాతాల నుంచి యథేచ్ఛగా దారి మళ్ళించినట్లు నిగ్గుతేల్చారు. బ్యాంకులో తాత్కాలిక మెసెంజరుగా పనిచేస్తున్న ఆలీఖాన్‌ ఖాతాల్లోకి ఎక్కువగా చేరినట్లు తేటతెల్లమ య్యింది. ముగ్గురు మేనేజర్లు పనిచేసిన ఆరేళ్ళ కాలంలో బ్యాంకులోని ఉద్యోగులంతా ఆలీఖాన్‌తో చేతులు కలిపినట్లు స్పష్టమైంది. మొత్తం నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్లు తనిఖీలను పర్యవేక్షిస్తున్న ఏసీ రూతూ, ఏపీఎం సుబ్రమణ్యం తెలిపారు. 

  

స్పందించిన డీఆర్‌డీఏ పీడీ తులసి..

కలికిరి డ్వాక్రా గూపుల్లో వెల్లడవు తున్న అక్రమాలు రూ.కోట్లకు చేరుకుంటున్నా డీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన మహిళా సంఘాల ఆగ్రహావేదనల వార్తపై గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ డీఎంకే తులసి స్పందించారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతాలున్న 232 సంఘాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు జిల్లా ఐబీ, ఫైనాన్స్‌ విభాగాల ఆధ్వర్యంలో 12 మంది (సీసీలు, డీఎంజీలు)తో తనిఖీలు చేయడానికి గత నెల 18న విచారణ కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు. బీవోబీలో 232 సంఘాలు, 11 గ్రామ సమాఖ్యలతోపాటు మండల మహిళా సమాఖ్యకు చెందిన ఖాతాలు న్నాయని వెల్లడించారు. బీవోబీ ఉద్యోగులు జరిపిన నిధుల దుర్వినియోగంపై ఎల్‌డీఎంతో చర్చించడం జరిగిందని తెలిపారు. విచారణ పూర్తయి తుది నివేదిక అందిన అనంతరం బాధిత స్వయం సహాయక సంఘాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే చర్యలకు ముందు వ్యవస్థీకృత లోపాలపై తమ వాదనలు కూడా పీడీ ఆలకించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.


మొత్తానికి స్వాహా జరిగింది ఎంత?

డ్వాక్రా గూపులకు సంబంధించి రూ. 2.37 కోట్లు పక్కదారి పట్టినట్లు తేలినా మొత్తం బ్యాంకులో జరిగిన అక్రమాల మొత్తం ఎంత అనేది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు.వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి డిపాజిట్లలో నగదు గల్లంతు, బంగారు, పంట రుణాలకు చెల్లించినవి జమ కాకపోవడం వంటి అంశాల్లో దాదాపు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు రుజువయ్యాయి. ఇక డమ్మీ గ్రూపులను సృష్టించి, బినామీ గ్రూపుల పేర్లు, అకౌంట్లు మార్చి దోచుకున్నది మరో రూ. 50 లక్షలుగా వెల్లడయ్యింది. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 3 కోట్లు దాటిపోయిందని లెక్క తేలుతోంది. ఇవి కాకుండా బ్యాంకు అధికారులకు నేరుగా అందిన ఫిర్యాదుల మొత్తం ఎంత అన్నది కూడా తేలాల్సి వుంది.

Updated Date - 2021-09-15T12:22:14+05:30 IST