కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. నచ్చిందా ధరించేయ్!

ABN , First Publish Date - 2021-06-24T19:46:49+05:30 IST

విచిత్రమైన డ్రెస్సింగ్‌ శైలిని అనుసరించే బాలీవుడ్‌ సెలబ్రిటీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. నచ్చిందా ధరించేయ్!

  • నేటి ఫ్యాషన్‌ ఇదేనోయ్‌..
  • ఫ్యాషన్‌ వీక్‌లలో విడుదల చేసిన డిజైనర్లు
  • ఆండ్రోజినస్‌ ఫ్యాషన్‌తో మురిసిపోతున్న నవతరం

విచిత్రమైన డ్రెస్సింగ్‌ శైలిని అనుసరించే బాలీవుడ్‌ సెలబ్రిటీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రణ్‌వీర్‌ సింగ్‌. అమ్మాయిలు ధరించే స్కర్ట్‌లను సైతం సౌకర్యవంతంగా ధరించి హోయలు పోతుంటాడు. ‘ఇదేం స్టైల్‌ రా బాబూ’ అని నోర్రెళ్లబెట్టే వారి సంగతి ఎలాగున్నా, అతను మాత్రం ఓ స్టైల్‌ ఐకాన్‌. ట్రెండ్‌ సెట్‌ చేస్తూనే ఉంటాడు. ఇదిగో ఇలా ట్రెండ్‌ సెట్‌ చేయాలనుకునే వారు ఇటీవలి కాలంలో అనుసరిస్తోన్న వినూత్న ధోరణి ఆండ్రోజినస్‌.


హైదరాబాద్‌ సిటీ : రేపటి తరపు ధోరణులను ఈరోజే చూసే ఫ్యాషన్‌ పండితులు లింగసమానత్వాన్ని తమ డ్రెస్‌ డిజైనింగ్‌ ద్వారానే చూపుతున్నారు. ఆండ్రోజినస్‌ అంటూ కొత్త కలెక్షన్‌నూ ఆవిష్కరిస్తున్నారు.  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో సౌకర్యానికి పెద్దపీట వేస్తోన్న వేళ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌... అది కూడా ఓ ట్రెండేనోయ్‌ అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలవాలనే తాపత్రయంతో మగవారు స్కర్టులు ధరిస్తుంటే, ఆడవారు షార్ట్‌ పింక్‌ స్టైల్‌తో బ్యాగీ ఫ్యాంట్లూ ధరిస్తున్నారు. ఆఖరకు వివాహ వస్త్రాలలో కూడా కొంతమంది డిజైనర్లు ఆండ్రోజినస్‌  ఫ్యాషన్‌లను జోడిస్తుండటం విశేషం.


లింగభేదాలను చెరిపేసి..

యునిసెక్స్‌... ఇటీవలి కాలంలో ఫ్యాషన్‌లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట ఇది. స్త్రీ, పురుష.... లింగ భేదాలను చెరిపేసిన ధోరణి కూడా ఇదే! యాక్ససరీలతో ఆరంభమైన యునిసెక్స్‌ తంత్రం ఇప్పుడు అప్పెరల్స్‌ పరంగానూ కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆడ-మగ సమానమన్నప్పుడు డ్రెస్‌ల విషయంలో మాత్రం ఎందుకని ప్రశ్నించే డిజైనర్లు పెరుగుతున్నారు. అలాగని ఆండ్రోజిన్‌సను యునిసెక్స్‌ ఫ్యాషన్‌గా అభివర్ణించడానికి మాత్రం వారు అంగీకరించడం లేదు.  ఇదే విషయమై ఫ్యాషన్‌ డిజైనర్‌ శృతి వెల్లడిస్తూ ‘యునిసెక్స్‌లో ఒకే గార్మెంట్‌ లేదంటే యాక్ససరీని ఆడా, మగ ధరిస్తారు. కానీ ఆండ్రోజినస్‌ ఫ్యాషన్‌లో ఈ లింగ భేదాలేవీ ఉండవు.


సరిగ్గా చెప్పాలంటే యునిసెక్స్‌ అనే ట్యాగ్‌ కూడా ఉండదు. కట్‌, క్లాతింగ్‌ ఎక్కడా ఈ భేదం కనిపించదు’ అని అన్నారు. గత లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో కూడా సునైనా ఖేరా, కునాల్‌ రావల్‌ లాంటి వారు ఆండ్రోజిన్‌సకు తమ కలెక్షన్‌లో చోటిచ్చారని మరో డిజైనర్‌ ప్రియ చెబుతూనే జీవనశైలిలో లింగ భేదాలు లేవని నమ్మిన రోజు ఇది ఓ సంస్కృతిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారామె. డిజైనింగ్‌లో లింగం ఇప్పుడు కాలం చెల్లిన నేపథ్యంగా మారుతుందని, మరీ ముఖ్యంగా ఎల్‌జీబీటీక్యుఐ కమ్యూనిటీ ధైర్యంగా బయటకు వస్తోన్న కాలంలో ఇది మరింత స్పష్టంగా కనబడుతుందన్నారు డిజైనర్‌ అల్తాఫ్‌.


పాతదే.. కొత్తగా..!

ప్రతి అమ్మాయిలోనూ మగవారి ఆలోచనా ధోరణి ఉంటుంది. అలాగే అబ్బాయిల్లో ఏదో ఒక మూల స్త్రీ లక్షణాలూ దాగి ఉంటాయి. అవి బయటకు రావటానికి ఈ ఆండ్రోజినస్‌ ఫ్యాషన్స్‌ దోహదం చేస్తాయంటున్నారు డిజైనర్లు. ఆండ్రోజినస్‌ అనేది భారతీయ ఫ్యాషన్‌లలో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అది ఇప్పుడు రివైవ్‌ అవుతుంది. అప్పట్లో మహారాజులు లాంగ్‌ గౌన్లు వేసేవారు. జువెలరీ కూడా అదే రీతిలో ఉండేది. కాలక్రమంలో అది పోయింది. అదిప్పుడు ఫ్యాషన్‌ పేరుతో పునరుద్ధరించబడుతోందనీ చెబుతున్నారు. అయితే ఈ వాదనను తిప్పి కొట్టేవారూ ఉన్నారు. ఎలాంటి ఫ్యాషన్‌ అయినా అది ఆ వ్యక్తి భావ వ్యక్తీకరణకు ప్రతీకలుగానే చూడాలన్నారు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ సభ్యుడైన మ్యాడీ. ఆండ్రోజినస్‌ శైలిని ఫ్యాషన్‌గా కన్నా సౌకర్య పరంగా చూస్తేనే బాగుంటుందని డిజైనర్లు చెబుతున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో ఇది ట్రెండీగా మాత్రమే కాదు సౌకర్యం పరంగానూ ఉన్నతంగానే ఉంటుందంటున్నారు అల్తాఫ్‌.

Updated Date - 2021-06-24T19:46:49+05:30 IST