కేంద్రం తాజా నిర్ణయం... దిగి రానున్న ధరలు!

ABN , First Publish Date - 2021-10-13T22:41:29+05:30 IST

వంట నూనెల ధరలు తగ్గాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం

కేంద్రం తాజా నిర్ణయం... దిగి రానున్న ధరలు!

న్యూఢిల్లీ : వంట నూనెల ధరలు తగ్గాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌లను తగ్గించింది. దీంతో వీటి ధరలు తగ్గి, వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వంట నూనెలను ప్రపంచంలో అత్యధికంగా కొనే దేశం మనదే. 


క్రూడ్ పామాయిల్‌పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను 10 శాతం నుంచి 2.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అదేవిధంగా క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది. పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ గ్రేడ్స్‌పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను 37.5 శాతం నుంచి 32.5 శాతానికి తగ్గించింది. 


భారత దేశానికి అవసరమైన వంట నూనెల్లో మూడింట రెండొంతులు విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఇండోనేషియా, మలేసియాల నుంచి పామాయిల్‌ దిగుమతి అవుతోంది. అర్జంటైనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ వస్తోంది. కొద్ది నెలలుగా వీటి ధరలు మన దేశంలో విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. 


ఈ పన్నుల తగ్గింపు వల్ల దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సమయంలో వంట నూనెల ధరలు తగ్గవచ్చునని భావిస్తున్నారు. 


Updated Date - 2021-10-13T22:41:29+05:30 IST