కరోనాకు ముగ్గురు బలి

ABN , First Publish Date - 2020-05-30T09:14:43+05:30 IST

కరోనా కాటుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు బలయ్యారు. రంగా రెడ్డిలో ఒకరు,

కరోనాకు ముగ్గురు బలి

రంగారెడ్డిలో ఒకరు, మేడ్చల్‌లో ఇద్దరు

తాజాగా 21 కేసులు నమోదు



(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా కాటుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు బలయ్యారు. రంగా రెడ్డిలో ఒకరు, మేడ్చల్‌లో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్‌ జిల్లాలో 6 కేసులు పాజి టివ్‌గా తేలాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మహేశ్వరంలో 4, బాలా పూర్‌లో ఇద్దరు, చందానగర్‌లో ఇద్దరు, మణికొండ, నార్సింగ్‌లో ఒకరు చొప్పున, సరూర్‌ నగర్‌లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో సరూర్‌నగర్‌ ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన 78 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 405కు చేరుకుంది.  


మహేశ్వరం మండలంలో..

మహేశ్వరం మండల కేంద్రంలో నాలుగు, హర్షగూడ గ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై పాజిటివ్‌ వచ్చినవారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన వారిలో 8 ఏళ్ల పాప కూడా ఉండడం విశేషం. కరోనా వచ్చిన వ్యక్తులు నివాసం ఉండే మహేశ్వరంలోని పోచమ్మబస్తీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలను ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆర్పీ జ్యోతి, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, మహేశ్వరం సీఐ వెంకన్ననాయక్‌, వైద్యాధికారి సంధ్యారాణి సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. 


మేడ్చల్‌ మండలంలో..

లాక్‌డౌన్‌ ప్రారంభమై దాదాపు రెండు నెలల తర్వాత మేడ్చల్‌ మండలంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. గౌడవెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(38)కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. మహిళ కుటుంబసభ్యులు గౌడవెల్లి గ్రామంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఈ నెల మహిళకు పాము కాటువేయడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది.


ఈ క్రమంలో గురువారం సాయంత్రం తీవ్ర జ్వరం రావడంతో వైద్యులు అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. దీనితో మహిళను చికిత్స  నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులను కూడా కరోనా పరీక్షల కోసం పంపించారు. ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, ఎండీవో శశిరేఖ, సర్పంచ్‌ సురేందర్‌ పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2020-05-30T09:14:43+05:30 IST