Abn logo
Sep 28 2021 @ 02:39AM

లేట‘రైట్‌ రైట్‌’!!

 • ఉల్లంఘనల ఊసే లేకుండా పీసీబీ నివేదిక
 • విశాఖ మన్యంలో మైనింగ్‌కు పచ్చజెండా!
 • సంయుక్త కమిటీ విచారణ జరిగిన మూడ్రోజులకే హడావుడిగా రిపోర్టు
 • పెద్దలను నొప్పించక.. తానొవ్వక.. మైనింగ్‌ నిర్వాహకులకు మేలు కలిగేలా!
 • పర్యావరణ విధ్వంసం, చెట్ల నరికివేతపై మౌనం..
 • రోడ్లకు ఎవరు అనుమతిచ్చారు?
 • వాహనాలతో కాలుష్యం లేదా?..
 • పచ్చని అడవి, జీవకోటిపై ప్రభావం ఉండదా?
 • ఒక్క మాటా చెప్పని కాలుష్య నియంత్రణ సంస్థ..
 • చిన్న లోపాలు ప్రస్తావించిన వైనం
 • కన్సెంట్‌ ఆర్డర్‌లోని ఐదంశాలు పాటించలేదని వెల్లడి
 • సరిదిద్దుకుని మైనింగ్‌ చేసుకోవచ్చని సూచన
 • కేసు ఎన్‌జీటీలో ఉండగా గ్రీన్‌సిగ్నల్‌ ఎలా ఇస్తారు?
 • పీసీబీ తీరుపై సర్వత్రా అనుమానాలు


విశాఖ మన్యంలో వివాదాస్పదంగా మారిన లేటరైట్‌ మైనింగ్‌పై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక విస్తుగొల్పుతోంది. తవ్విన ఖనిజాన్ని తరలించేందుకు భారీ వాహనాలు తిరగడానికి వీలుగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడి నిర్మించిన రహదారి.. విలువైన వేలాది చెట్ల నరికివేత వంటి కీలక అంశాల ఊసే లేకుండా.. చిన్న చిన్న లోపాలను ప్రస్తావించి.. వాటిని సరిదిద్దుకుని తిరిగి మైనింగ్‌ చేసుకోవాలని సూచించడం సంచలనం రేపుతోంది. అమరరాజా బ్యాటరీస్‌ విషయంలో ఎంతో దూకుడు ప్రదర్శించి క్లోజర్‌ నోటీసులిచ్చిన పీసీబీ.. పర్యావరణ విఽధ్వంసం జరుగుతున్న కేసులో అసలు విషయం వదిలేసి.. మిగతా వాటిపై స్పందించడం గమనార్హం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశాఖ మన్యంలో నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని నాతవరం మండలంలో లేటరైట్‌ మైనింగ్‌కు ప్రభు త్వం అనుమతులిచ్చింది. సరుగుడు పంచాయతీలో 121 హెక్టార్లలో మైనింగ్‌ జరుగుతోంది. అయితే లేటరైట్‌ పేరిట బాక్సైట్‌ తవ్వుతున్నారని.. పర్యావరణ అనుమతుల్లేకుండా అడవిలో వేలాది చెట్లను నరికివేసి భారీ రహదారిని నిర్మించారని.. ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాల కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి..  పర్యావరణ విధ్వంసం జరుగుతోందని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతానికే చెందిన మరిడ య్య అనే వ్యక్తి ఎన్‌జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. మైనింగ్‌ను అడ్డుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. దీనిపై సంయుక్త కమిటీ విచారణకు ఎన్‌జీటీ ఆదేశించింది. ఆగస్టు 18న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం మన్యంలో పర్యటించి విచారణ చేసిం ది. ఈ బృందంతోపాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు కూడా వెళ్లి విచారించారు. పర్యావరణ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలపైనే విచారణ జరిపారు. సంయుక్త కమిటీ విచారణ జరిగిన మూడ్రోజులకే.. అంటే ఆగస్టు 21న పీసీబీ విశాఖ కలెక్టర్‌కు ఓ నివేదిక సమర్పించింది. మైనింగ్‌ కోసం ఇచ్చిన కన్సెంట్‌ ఆర్డర్‌లో ఏవో ఐదు అంశాల్లో నిబంధనలను పాటించలేదని, ఆ లోపాలను సరిదిద్దుకున్నాక మైనింగ్‌కు అనుమతించాలని పేర్కొం ది.


అయితే అందులో పర్యావరణ విధ్వంసం, భారీగా చెట్లు నరికి రహదారి నిర్మించడం, గాలి, నీటి కాలుష్యం గురించి ప్రస్తావించలేదు. 72 గంటల వ్యవధిలోనే ఈ నివేదిక ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? మరిడయ్య ఆరోపిస్తున్నట్లుగా భారీ ఉల్లంఘనలు జరగడం లేదని, పర్యావరణ విధ్వంసమే లేద ని చెప్పేందుకే హడావుడిగా నివేదిక ఇప్పించారా అన్న అనుమానాలున్నాయి. ఇతరులను నొప్పించక, తానొవ్వ క అన్న చందంగా జాగ్రత్తగా నివేదిక ఇచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయం ఉంది. రహదారుల వెంట దుమ్ములేవకుండా నీళ్లు చల్లే ఏర్పాట్లు చేసుకోలేదని పీసీబీ తన రిపోర్టులో ప్రస్తావించింది. కానీ పచ్చని అడవిలో భారీ రహదారులను ఎలా నిర్మించారు? ఎవ రు అనుమతిచ్చారో ప్రస్తావించలేదు. రహదారి నిర్మా ణం కోసం వేలాది చెట్లను ఎవరి అనుమతితో నేలకూల్చారో స్పష్టత ఇవ్వలేదు. చెట్ల నరికివేత పర్యావరణ పరిరక్షణ పరిధిలోకి రాదా? ఇది పీసీబీ పరిధిలో లేని విషయమా? పచ్చని అడవి, అక్కడ జీవించే జీవకోటిపై ప్రభావం ఉందో ఒక్క మాట కూడా చెప్పలేదు. పీసీబీ ఈ అంశాలపై స్పందిస్తే.. కచ్చితంగా వాస్తవాలనే ప్రస్తావించాల్సి ఉంటుంది. అదే జరిగితే మరిడయ్య చేసిన ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నివేదికలోని అంశాలు బలం చేకూర్చేవిగా ఉన్నాయని రచ్చ జరగొచ్చు. అది పెద్దలు, మైనింగ్‌ నిర్వాహకుల ప్రయోజనాలను దెబ్బతీయవచ్చు. బహుశా ఈ కారణాలతోనే పీసీబీ కీలక అంశాలను ప్రస్తావించలేదా? లేక అవి తన పరిధిలోవి కాదని వదిలేసిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై వివరణ తీసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా పీసీబీ అధికారి స్పందించలేదు. 


అలా ఎలా చెబుతారు?

మైనింగ్‌ ఏరియాలో నీటి ప్రవాహనాన్ని అడ్డుకునేందుకు అవసరమైన డ్రైయిన్లు, గుంతలు ఏర్పాటు చేయలేదు. రక్షణ గోడలను నిర్మించలేదు. మైనింగ్‌ ఏరియా సరిహద్దు వెంట గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేసే పనులు ప్రారంభించలేదు. మైనింగ్‌ను వాహనాల్లో తరలిస్తున్నప్పుడు గాల్లోకి దుమ్ము లేవకుండా నిరోధించేందుకు నీళ్లు చల్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. మైనింగ్‌ ఏరియాలో గాలి కాలుష్యాన్ని పరిశీలించే స్టేషన్‌ ఏర్పాటు చేయలేదు..్‌ అని పీసీబీ తన నివేదికలో పేర్కొంది. తన విచారణలో ఈ అంశాలే కనిపించాయని.. ఈ లోపాలను సరిదిద్దుకున్నాక మైనింగ్‌ చేపట్టుకోవలసిందిగా నిర్వాహకులను ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు సిఫారసు చేసింది. ఓవైపు అక్రమ మైనింగ్‌పై ఎన్‌జీటీ విచారణ జరుపుతుండగానే.. పీసీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎన్‌జీటీ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై అక్టోబరులో విచారణ జరుపనుంది. మరోవైపు.. జాయింట్‌ కమిటీ కూడా ఇటీవల తన నివేదికను ట్రైబ్యునల్‌కు సమర్పించింది. ఈ నెల 24న కేసు విచారణకు వచ్చినప్పుడు.. పలు శాఖల నుంచి రిపోర్టులు ఇంకా రాకపోవడంతో ట్రైబ్యునల్‌ విచారణను అక్టోబరు 30కి వాయిదావేసింది.

క్రైమ్ మరిన్ని...