తిరస్కారం నుంచి పురస్కారం వరకూ.. లతా మంగేష్కర్ జీవితం సాగిందిలా..

ABN , First Publish Date - 2022-02-06T16:06:25+05:30 IST

బాలీవుడ్‌లో నూర్జహాన్, శంషాద్ బేగం..

తిరస్కారం నుంచి పురస్కారం వరకూ.. లతా మంగేష్కర్ జీవితం సాగిందిలా..

బాలీవుడ్‌లో నూర్జహాన్, శంషాద్ బేగం, జోహ్రా బాయి అంబాలే వాలీ తదితర దిగ్గజ గాయకులపై ఆధిపత్యం చెలాయించిన లతా 1940లలో బాలీవుడ్‌లోకి కాలుమోపారు. తొలిదశలో పలువురు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులు ఆమె వాయిస్ చాలా సన్నగా ఉన్నదంటూ ఆమెకు సినిమాల్లో పాడేందుకు అవకాశం కల్పించలేదు. 1942 సంవత్సరంలో తన పదమూడేళ్ల చిన్న వయస్సులోనే లత తన తండ్రిని కోల్పోయింది. దీంతో కుటుంబ బాధ్యత ఆమెపై పడింది. ఈ నేపధ్యంలోనే వారి కుటుంబం పూణె నుండి ముంబైకి మారింది. లతకు సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదు. అయితే కుటుంబ ఆర్థిక బాధ్యతను భుజాలమీదకు ఎత్తుకుని సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 1942లో లతకు తొలిసారిగా మంగళగౌర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 1942-1948 మధ్య కాలంటో లత దాదాపు ఎనిమిది హిందీ , మరాఠీ చిత్రాలలో నటించింది. లత 1942లో మరాఠీ చిత్రం 'కితీ హాసిల్' (1942)లో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసింది. అయితే ఆ పాట తర్వాత సినిమా నుండి తొలగించారు. 


ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆమె పాటలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. 1948లో గులాం హైదర్‌కి జోడీగా మజ్బూర్ (1948) చిత్రంలో ఆమె పాడిన పాటకు పెద్ద బ్రేక్ వచ్చింది. 1949లో ఆమె పాటలు పాడిన నాలుగు చిత్రాలు.. 'బర్సాత్', 'దులారి', 'మహల్', 'అందాజ్' విడుదలై అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె పాటలకు ఎనలేని ఆదరణ వచ్చింది. యాభైలలో మంగేష్కర్, శంకర్ జైకిషన్, ఎస్డీ బర్మన్, సీ. రామచంద్రన్ మోహన్, హేమంత్ కుమార్ సలీల్ చౌదరి తదితర ప్రముఖ సంగీత విద్వాంసులకు లత ఇష్టమైన గాయనిగా మారింది. ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో లత ఎన్నో హిట్ పాటలు పాడారు. అరవయ్యవ దశకంలో రామచంద్ర సంగీత దర్శకత్వంలో కవి ప్రదీప్ రాసిన 'ఏ మేరే వతన్ కే లోగో' పాటను లత తన ఆత్మీయ స్వరంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిపారు. ఈ పాట 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో మరణించిన సైనికులను గుర్తు చేస్తుంది. ఈ పాట వింటే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎంతగానో ముగ్ధుడయ్యారు. లతా మంగేష్కర్‌కు స్వర్ కోకిల అనే బిరుదు ఉంది. ఆమెకు భజనలు, గజల్స్, ఖవ్వాలీ శాస్త్రీయ సంగీతంతో పాటు సినిమా పాటలలో అపారమైన నైపుణ్యం ఉంది. మీనా కుమారి మొదలుకొని కత్రినా కైఫ్ వరకు లత తన కెరీర్‌లో.. ప్రతి తరానికి పాటలు పాడారు. లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ ప్రపంచంలోని 36 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు. 1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదైంది. లతా మంగేష్కర్‌కు 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, 2008లో భారతదేశ స్వాతంత్య్ర 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు‌తో లతను సన్మానించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1984లో ఆమె పేరిట ఒక అవార్డును ప్రారంభించింది, దానికి 'లతా మంగేష్కర్ అవార్డు' అని పేరు పెట్టారు. ఇది జాతీయ స్థాయి అవార్డు. ఇదే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లతా మంగేష్కర్ పేరు మీద అవార్డులను ఇస్తుంటుంది.   

Updated Date - 2022-02-06T16:06:25+05:30 IST