ఇదే చివరి హెచ్చరిక

ABN , First Publish Date - 2021-05-17T05:00:47+05:30 IST

పలు ప్రైవేటు ఆసుపత్రు లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, కరోనా బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు అన్నారు.

ఇదే చివరి హెచ్చరిక
విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, చిత్రంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌

ప్రైవేటు ఆసుపత్రులు తీరు మార్చుకోవాలి

ధనార్జనలో పడి వైద్యవృత్తికి మచ్చతేవద్దు

104 కాల్‌సెంటర్‌ ద్వారానే బెడ్ల కేటాయింపు

కొవిడ్‌ రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలి

కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు


నెల్లూరు, మే 16 (ఆంధ్రజ్యోతి) : పలు ప్రైవేటు ఆసుపత్రు లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, కరోనా బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు అన్నారు. అటువంటి ఆసుపత్రులను ఇక ఉపేక్షించేంది లేదని, పద్ధతి మార్చుకోవా లని, ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అని ఆయన హెచ్చరించారు. పలు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే మూడు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని, ఒక ఆసుపత్రిని మూసివేశామని కలెక్టర్‌ చెప్పారు. ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల పనితీరుపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. స్వయంగా తానే పరిశీలిస్తానని ఆయన ప్రకటించారు. కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరితే సరైన వైద్యం అందదని పలువురు వైద్యులే కరోనా రోగులకు చెబుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారు ధనాపేక్షకు పోయి వైద్య వృత్తికే కళంకం తేవద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నియంత్రణకు జిల్లాలో చేపడుతున్న చర్యలను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో కలిసి చక్రధర్‌బాబు ఆదివారం నెల్లూరులోని తిక్కన భవనలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

 జిల్లాలోని ఆసుపత్రుల్లో 2848 బెడ్లు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 3500 బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అన్ని ఆసుపత్రులకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ప్రతీ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద బాధితులకు కేటాయించాలన్నారు. ఈహెచఎస్‌ కింద ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే వైద్యం అందించాలన్నారు. చికిత్స తీసుకున్న ప్రతీ ఒక్కరికి ఆసుపత్రి పేరుపై బిల్లు ఇవ్వాలని, తెల్లకాగితంపై ఇస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఆసుపత్రిలోనూ బెడ్ల లభ్యతతో పాటు వైద్య చార్జీలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతీ ఆసుపత్రిలో బెడ్ల కేటాయింపు 104 కాల్‌సెంటర్‌ ద్వారా మాత్రమే జరగాలని, ఎప్పటికప్పుడు ఆసుపత్రులు తమ వద్ద బెడ్ల లభ్యతను అధికారులకు తెలియజేయాలన్నారు. కరోనా బాధితులు ముందుగా 104కు ఫోన చేసి పేరు నమోదు చేసుకుంటే తాము లభ్యతను బట్టి బెడ్డు కేటాయిస్తామని చెప్పారు. 


నిర్దేశించిన రేట్లే వసూలు చేయాలి..


అంబులెన్సలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను మాత్రమే వసూలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఇతర ప్రాంతాలకు కరోనా బాధితులను తీసుకెళ్లే సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంబులెన్సల యజమానులు పద్ధతి మార్చుకోవాలని  హెచ్చరించారు. కొవిడ్‌ రహిత జిల్లాగా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత లేని వారు వైద్యం అందిస్తున్నట్లు తెలిస్తే 1077 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, అటువంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.


సమగ్ర ఫీవర్‌ సర్వే


 జిల్లాలో సమగ్రమైన ఫీవర్‌ సర్వే జరుగుతోందని కలెక్టర్‌ తెలిపారు. ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషనపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ అన్నారు. కేంద్ర  మార్గదర్శకాల ప్రకారం కోవీషీల్డ్‌ మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత 12-16 వారాల మధ్యలో రెండో డోస్‌ వేయాల్సి ఉంటుందని చెప్పారు. 45 ఏళ్ల పైబడిన పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వచ్చే నెల 1వ తేదీ నుంచి మొదటి డోస్‌ వ్యాక్సిన వేస్తామన్నారు. 


ఆక్సిజన కొరత లేకుండా చర్యలు


జిల్లాలో ఆక్సిజన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విశాఖపట్నం, చెన్నై నుంచి నిరంతరం ఆక్సిజన సరఫరా జరుగుతోందని చెప్పారు. దుర్గాపూర్‌ నుంచి ప్రత్యేక రైలు ద్వారా జిల్లాకు 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన అందిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోని బెడ్ల సామర్థ్యాన్ని బట్టి ఆక్సిజన సరఫరా చేస్తున్నామన్నారు. విజిలెన్స ఎస్పీ కే రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని  అన్ని కొవిడ్‌ ఆసుపత్రులపై నిఘా ఉంచామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ బిల్లులు వసూలు చేసిన రెండు ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. మరో మూడు ఆసుపత్రులపై చర్యలకు వైద్య, ఆరోగ్య శాఖకు సిఫార్సు చేశామని చెప్పారు. బ్లాక్‌లో రెమిడిసివర్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. 


Updated Date - 2021-05-17T05:00:47+05:30 IST