చివరి గుడిసె

ABN , First Publish Date - 2020-09-14T10:28:10+05:30 IST

చివరి గుడిసె

చివరి గుడిసె

రాత్రి ఒడిలో 

ఎరుకలి గుడిసె చుక్కల్ని లెక్కిస్తోంది 

గాలిని కూర్చోబెట్టుకుని 

నులక మంచంపై మట్టి గొంతు

అగ్గి ముట్టించి పదమై రాలుతోంది 

మేత మేస్తూ పందులు 

పరిచయమైన పాటకు 

గుర్‌ గుర్మంటూ వంతం పలుకుతున్నాయి 

తత్వాన్ని తలకెక్కించుకున్న బొల్లి మచ్చల కుక్క 

కుశాలుగా తోకనాడిస్తోంది 

ఎన్నెట్లో చెరువు 

కొత్త బట్టలు తొడుక్కున్న పండుగలా ఉంది 

గుడిసెలోంచి అమ్మి 

తుమ్మెదలా ఎగురుతా వచ్చి 

చెరువెదుట నిల్చుని 

ఆడుకోవడానికి చేపల్ని పిలిచింది 

నీటి పాపలతో 

కలువ పాప ఆటను చూసి 

ముచ్చటతో సందమామ 

నేనూ రానా అంది 

పొట్టి గౌను మెత్తని నవ్వుతో 

రెండు చేతులు సాచింది 

ఎలా రానూ? అని సందమామ బిక్కముఖమేసింది 

చిట్టి చేతులు 

కాగితం పడవను చేసి 

నీళ్ళల్లోకి వదిలింది 

ఆ రాత్రి చివరి గుడిసె 

ఎన్నెట్లో ఎలిగింది. 


ుఽ తెలుగు వెంకటేష్‌

99853 25362

Updated Date - 2020-09-14T10:28:10+05:30 IST