Jammu and Kashmirలో పట్టుబడిన లష్కర్ ఉగ్రవాది.. గతంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్

ABN , First Publish Date - 2022-07-04T01:42:14+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో ఈ ఉదయం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు గతంలో బీజేపీలో చురుగ్గా

Jammu and Kashmirలో పట్టుబడిన లష్కర్ ఉగ్రవాది.. గతంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో ఈ ఉదయం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు గతంలో బీజేపీలో చురుగ్గా పనిచేసిన కార్యకర్త కావడం గమనార్హం. అంతేకాదు, జమ్మూలో ఆ పార్టీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన తాలిబ్ హుస్సేన్ షాతో పాటు మరో ఉగ్రవాదిని గ్రామస్థులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు ఏకే తుపాకులు, గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.


లష్కరే ఉగ్రవాది గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన విషయంపై బీజేపీ స్పందించింది. ఆన్‌లైన్ సభ్యత్వమే ఇందుకు కారణమని, ఆన్‌లైన్ మెంబర్‌షిప్ వల్ల ఎవరి పడితే వారు పార్టీలో చేరుతున్నారని పేర్కొంది. వీరి అరెస్ట్‌తో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పఠానియా పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఇదో కొత్త మోడల్ అయిపోయిందని, బీజేపీలో చేరి యాక్సెస్ పొందడం, ఆపై రెక్కీ నిర్వహించి అగ్రనాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. సరిహద్దు వెంట ఉగ్రవాదాన్ని విస్తరించాలని భావిస్తున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా బీజేపీ సభ్యుడు అయ్యే అవకాశం చిక్కిందని, పార్టీకి ఇదో పెద్ద లోపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ఏడాది మే 9న తాలిబ్ హుస్సేన్ షాను జమ్మూ ప్రావిన్స్ ఐటీ, సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా బీజేపీ నియమించింది. జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా సహా పలువురు సీనియర్ నేతలతో షా ఫొటోలు దిగాడు. కాగా, ఉగ్రవాదులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రియాసి గ్రామస్థులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ. 5 లక్షలు, జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ రూ. 2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. 

Updated Date - 2022-07-04T01:42:14+05:30 IST