కొత్తగా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారు.. ఇవి తెలుసుకోండి!

ABN , First Publish Date - 2020-07-13T13:56:54+05:30 IST

కరోనా సమయంలో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు, పెద్దలకు వర్క్‌ ఫ్రం హోం..

కొత్తగా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారు.. ఇవి తెలుసుకోండి!

కంప్యూటర్‌.. కాసులు!

ఆన్‌లైన్‌ క్లాసులతో పెరిగిన ఎలక్ట్రానిక్స్‌ వాడకం 

అదే స్థాయిలో వస్తున్న రిపేర్లు

నిపుణుల కొరతతో మరమ్మత్తులకు సమయం 

పెరిగిన విడిభాగాల ధరలు

అసలే కరోనా కాలం.. తల్లిదండ్రులపై మరో భారం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు, పెద్దలకు వర్క్‌ ఫ్రం హోం.. కారణంగా ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు, మొబైల్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకం గతంలో కంటే విపరీతంగా పెరిగింది. ఆన్‌లైన్‌ క్లాసులు అధికంగా ఉండటం, గతంలో పిల్లలకు వీటిని వాడిన అనుభవం లేకపోవడం, ఎక్కువమంది సెకండ్‌ హ్యాండ్‌వి కొనడం వంటి కారణాలతో ఇవి మరమ్మత్తులకు గురవుతున్నాయి అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. గతంలో సాధారణంగా ఇంటి అవసరాలకు ఒక గంట నుంచి 3 గంటల వరకు ఉండే కంప్యూటర్‌ వినియోగం నేడు పెరగడం కూడా వీటి రిపేర్లుకు మరోకారణంగా వారు చెబుతున్నారు. 


అవగాహన లేకపోవడంతో..

కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు తొందరగా రిపేర్ల బారిన పడటానికి వాటి కొనుగోలు, వాడకం వంటి విషయాల్లో అవగాహన లేకపోవడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కొన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తొందరగా రిపేర్లుకు గురికావు.  చాలామంది తెలియక ఔట్‌డేటెడ్‌, సెకండ్‌ హ్యాండ్‌  ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువమంది తక్కువ ఖర్చులో  డూప్లికేట్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. నాణ్యమైన యాంటీవైరస్‌లను వాడరు. దీనికి తోడు అపరిచిత వ్యక్తులు పంపిన మెయిల్స్‌ను తెరవడం, నిషేధించిన సైట్‌లను చూడటం వంటివి కూడా జరుగుతుంటాయి. ఇటువంటి కారణాలతో ఇవి తొందరగా రిపేర్లు వస్తుంటాయి. ఒరిజనల్‌ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం, యాంటీ వైరస్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చెసుకుంటే ఉంటే కొంతవరకు మరమ్మతుల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

భారీగా పెరిగిన విడిభాగాల ధరలు 

ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలతో పాటు, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల ధరలు అమాతంగా పెరిగాయి. చైౖనా నుంచి దిగుమతి అంతంతమాత్రంగా ఉండటంతో వీటి ధరలు ఒక్కసారి  20- 30 శాతం పెరిగి సామన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి కూడా పూర్తిస్థాయి అందుబాటులో ఉండటం లేదు. ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన వెబ్‌కెమెరాల ధరలు అమాతం పెరిగాయి. రెండు నెలల కిందట  రూ.1200 ధర ఉన్న ఓ వెబ్‌కామ్‌ ఇప్పుడు రూ.2,500కు పెరిగింది. దీంతో ఆన్‌లైన్‌ తరగతులు తల్లిదండ్రులకు అదనపు భారంగా మారాయి అని చెప్పవచ్చు.


Updated Date - 2020-07-13T13:56:54+05:30 IST