జగన్ పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోయే: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-10-18T17:42:23+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోయిందని, జగోనామిక్స్‌లా తయారయిందని..

జగన్ పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోయే: లంకా దినకర్

అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోయిందని, జగోనామిక్స్‌లా తయారయిందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 నెలల్లో అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి పోలిస్తే రాష్ట్రంలో ఆదాయం, అప్పులు రెండు పెరిగినా మూలధన వ్యయంలో పెరుగుదల మాత్రం ప్రతికూలమన్నారు. రూ. 15 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం ఆర్జించినా జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితని... జగన్ పాలన తీరులో డొల్లతనం కనబడుతోందన్నారు. ఈ ఏడాది మొదటి 5 నెలల కాలంలో రూ. 15,686 కోట్ల అదనపు ఆదాయం వస్తే, అదే కాలానికి ఏడాది మొత్తం చేయాల్సిన అప్పులో 98 శాతం చేశారని ఆరోపించారు.


ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 5 వేల కోట్ల రెవెన్యూ లోటు అంచనా కాస్త మొదటి 5 నెలల కాలానికి 31,188 కోట్లు అయిందని లంకా దినకర్ అన్నారు. ఆదాయం పెరిగినా రెవెన్యూలోటు కొండంత అయ్యిందన్నారు. మూలధనవ్యయం మొదటి 5 నెలల కాలానికి గత సంవత్సరం రూ. 8,604 కోట్లు అయితే, ఈ ఏడాది అది కేవలం 5,482 కోట్లు మాత్రమేనన్నారు. ఆదాయం, అప్పులు పెరిగినప్పుడు భవిష్యత్తు ఆదాయం సముపార్జించే మూలధన వ్యయం పెరగాలి.. కానీ దూరదృష్టవశాత్తు పప్పు బెల్లల మయం అయ్యిందని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-18T17:42:23+05:30 IST