లంక కష్టాలు

ABN , First Publish Date - 2022-04-19T06:58:01+05:30 IST

శ్రీలంకలో సోమవారం నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలను ఓ వారం పాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కష్టాల్లో ఉన్న లంక ఇప్పట్లో ఒడ్డునపడేట్టు లేదు...

లంక కష్టాలు

శ్రీలంకలో సోమవారం నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలను ఓ వారం పాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కష్టాల్లో ఉన్న లంక ఇప్పట్లో ఒడ్డునపడేట్టు లేదు. ఈ వారం లంక ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరపబోతున్నందున అది ఏ  మేరకు సాయం చేయబోతున్నదో, చెయ్యివ్వబోతున్నదో చూడాలి. లంక ఆర్థిక మునక వెనుక ఐఎంఎఫ్ ఉన్నదన్న విమర్శలను అటుంచితే, ఈ భయానక కష్టాలనుంచి ఐఎంఎఫ్ ఒక్కటే కాస్త గట్టిగా ఒడ్డెక్కించగలదు కనుక రాజపక్సలకు అదే ఇప్పుడు పెద్ద దిక్కు. 


దేశానికి ఇంత అన్యాయం చేసి కూడా ఇంకా అధికారాన్ని పట్టుకొని వేలాడుతున్నారని రాజపక్సలమీద ప్రజలు మండిపడుతున్నారు. దేశాధ్యక్షుడినుంచి సాధారణమంత్రి వరకూ అన్నీ తామై వారే ఏలుతున్నందున కుటుంబపాలనను విమర్శించదల్చుకున్నవారికి లంక కుటుంబపాలన ఇప్పుడు నిలువెత్తు నిదర్శనమైంది. కుటుంబ పాలనంటే అసమర్థపాలనే అని తీర్మానించడానికి లంకసంక్షోభాన్ని ఉదహరిస్తున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా అధ్యక్ష, ప్రధానులు కుర్చీదిగనందుకు విపక్షాలు వారిపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నాయి. విపక్షాలకంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహం పాలకులకు మరింత ప్రమాదకరం. ఎప్పటికప్పుడు నిరసనలను, ఉద్యమాలను అణచివేస్తూ కాలాన్ని నెట్టుకురావడం ఎంతో కష్టం. ఆహారం, చమురు, మందులు, విద్యుత్తు ఇలా ప్రతీ విషయంలోనూ రోజూ వెతుక్కోవాల్సిన దుస్థితిలో పడినప్పుడు ప్రజలను మాయచేయడం మరీ కష్టం. కొద్దినెలలపాటు కనీసావసరాలకు ఏ లోటూ రాకూడదంటే వెంటనే ఓ మూడుబిలియన్ డాలర్లు అవసరమని లంక లెక్కలు వేసుకుంది. మరోపక్క మనదేశంతో పాటు మరికొన్ని దేశాలకు కూడా ఆర్థికసాయం చేయమని విజ్ఞప్తులు చేసింది. మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాతో చేయీచేయీ కలిపి దేశాన్ని దాదాపుగా తాకట్టుపెట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కష్టకాలంలో చైనా ఎక్కువగా ఆదుకోకపోవడం విశేషం. తమకష్టాలకు చైనా కారణమని ఎక్కువమంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున సాయం విషయంలో చైనా చేతులు దులిపేసుకుందని అంటారు. ఇటీవల భారతదేశం ఆర్థికంతోపాటు ఆహారాన్ని కూడా భారీగా అందించి లంకను ఆదుకుంది. ఆ తరువాత కూడా భారతదేశం నుంచి ఏదో రూపంలో సహాయం అందుతూనే ఉన్నది. కొద్దిరోజుల క్రితం లంక సెంట్రల్ బ్యాంకు గత్యంతరం లేని స్థితిలో సుమారు యాభైబిలియన్ డాలర్ల విదేశీరుణాల చెల్లింపుల విషయంలో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య అంతర్జాతీయంగా దేశం పరువు తీసినప్పటికీ, ఇంటిని చక్కబెట్టడానికి కాస్తంత ఉపకరించింది. 


ప్రస్తుత దుస్థితి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినదేమీ కాదు. కానీ, ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండటం, అందుకోసం అందినమేరకు అప్పులు చేయడం, ఉత్పత్తి విషయంలో శ్రద్ధపెట్టకపోవడం, ఎగుమతికీ, వాణిజ్యానికీ ఉపకరించే మరిన్ని వస్తుసేవలపట్ల ఒక నిర్దిష్టమైన ఆలోచనావిధానం లేకపోవడం వంటి కారణాలు అనేకం కాలక్రమేణా ఈ ఆర్థిక విపత్తును సృష్టించాయి. 2019లో జరిగిన ఈస్టర్ పేలుళ్ళు ఆ దేశంలో భద్రతతో పాటు, మతసామరస్యంపట్ల ప్రపంచానికి అనుమానాలు కలిగించాయి. దానినుంచి కాస్తంత తేరుకొనే అవకాశం కూడా లేకుండానే కరోనా ముంచుకొచ్చింది. పర్యాటకంమీద ఆధారపడిన దేశం కావడంతో ఈ మహమ్మారి దానిని బాగా దెబ్బకొట్టింది. తేయాకు, బట్టలు ఇత్యాది ఎగుమతులు దెబ్బతినడమే కాక, విదేశాల్లో ఉన్నవారు పంపే సొమ్ముకూడా పడిపోయింది. అసలే మూలుగుతున్న లంకను ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత బలహీనపరిచింది. రెండేళ్ళక్రితమే ఆర్థికనిపుణులు లంకపాలకులను రాబోయే విపత్తు విషయంలో తీవ్రహెచ్చరికలు చేశారని అంటారు. వాటిని బేఖాతరుచేయడంతోపాటు, ఆర్గానిక్ వ్యవసాయానికి మళ్ళడం వంటి లక్ష్యాలను దశలవారీగా అమలుచేయాల్సింది పోయి రసాయనిక ఎరువుల వాడకంపై నిషేధం విధించడం ద్వారా బలవంతంగా ఆ  ఆలోచనను పెద్ద ఎత్తున అమలుచేయడం పరిస్థితి తీవ్రతకు ఓ కారణం. ఈ సంక్షోభం నుంచి బయటపడేవరకూ అక్కడి నాయకులు రాజకీయాలను పక్కనబెట్టి సమష్టిగా సమస్య పరిష్కారానికి కృషిచేయడం అవసరం.

Updated Date - 2022-04-19T06:58:01+05:30 IST