భూమిని మింగిన అప్పు

ABN , First Publish Date - 2021-12-03T05:57:44+05:30 IST

‘రాజే కింకరుడగున్‌.. కింకరుడే రాజగున్‌ కాలానుకూలమ్ముగా..’ అని ఎంతో విషాదంగా అంటాడు హరిశ్చంద్రుడు.

భూమిని మింగిన అప్పు

  1. కూలీలుగా మారిన మోతుబరి రైతులు
  2. రెండు నెలల్లో 250 ఎకరాల అమ్మకం
  3. అయినా తీరని సేద్యపు అప్పులు
  4. సంక్షోభంలో ఆలమూరు రైతులు


రుద్రవరం, డిసెంబరు 2: ‘రాజే కింకరుడగున్‌.. కింకరుడే రాజగున్‌ కాలానుకూలమ్ముగా..’ అని ఎంతో విషాదంగా అంటాడు హరిశ్చంద్రుడు. రాజ్యంతోపాటు ఆలుబిడ్డలను, ఐశ్వర్యాన్ని కోల్పోయి, కాటికాపరిగా మారాడు. అది విధివశాత్తూ జరిగిన పరిణామం. కాలం మారింది. ‘రైతే రాజు’ అని ప్రభుత్వాలే అంటున్నాయి. కానీ ఈ ‘రైతు రాజు’ దినసరి కూలీగా మారిపోతున్నాడు. అయినా బతుకు బండి లాగాల్సిందే. ఆలుబిడ్డలను పోషించాల్సిందే. కూడు, గూడు, గుడ్డ, చదువులు, అనారోగ్యం.. ఎన్నింటినో ఎదుర్కోవాలి. వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు కుటుంబంతోపాటు భూమిని కూడా పోషించాల్సి వస్తోంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. విత్తనం, తెగుళ్లు, సేద్యం, అతివృష్ఠి, అనావృష్ఠి.. ఇలా ఎన్నింటినో జయించి.. మార్కెట్‌లోకి అడుగు పెడితే.. అక్కడ గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏటా ఏదో ఓ స్థాయిలో ఓటమి ఎదురవుతోంది. దీంతో అప్పు మినహా జీవనానికి మరో ఆధారం లేకుండా పోతోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్న భూమిని అమ్ముకుంటున్నారు. రైతులు.. కూలీలుగా మారిపోతున్నారు. దీనికి పాలకుల నిర్లక్ష్యం కారణం. అన్నం పెట్టే రైతుకు తగిన తోడ్పాటు ప్రభుత్వాల నుంచి అందడం లేదు. రాయలసీమ ప్రాంతంలో వేలాది మంది రైతులు కూలీలుగా మారిపోయారు. రుద్రవరం మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో కూలీలను పలకరిస్తే.. తాము ఒకప్పటి మోతుబరి రైతులమని గుర్తు చేసుకుంటున్నారు. తమ దుస్థితికి కంటతడి పెడుతున్నారు. 


రెండు నెలల్లో 250 ఎకరాల అమ్మకం


ఆలమూరు గ్రామంలో ఎక్కువగా నల్లరేగడి భూములు ఉన్నాయి. ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ అరటి, మిరప, పసుపు, బొప్పాయి, పత్తి, వరి, బూడిద గుమ్మడి, మొక్కజొన్న, ఆకు తోటలు సాగు చేస్తారు. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో అరటి, బొప్పాయి, పసుపు, మిరప సాగు అవుతాయి. ఆరుతడి పంటలతో పోలిస్తే వీటికి పెట్టుబడి చాలా రెట్లు అధికం. అందుకే నష్టం వచ్చినా అదే స్థాయిలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సేద్యపు అప్పులు తీర్చలేక గడిచిన రెండు నెలల్లో ఏకంగా 250 ఎకరాల భూములను రైతులు అమ్ముకున్నారు. మరో 250 ఎకరాల భూములు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకుంటున్నారు.


మూడేళ్లలో రూ.100 కోట్ల నష్టం 


ఆలమూరు గ్రామ రైతులు గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ.100 కోట్ల పంటను నష్టపోయారు. విత్తనం కొనుగోలు నుంచి పంట దిగుబడులు అమ్ముకునేవరకు అడుగడుగునా మోసపోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పంట సాగు చేసినా పెట్టుబడి ఎకరానికి రూ.లక్ష దాటుతుంది. అరటి, బొప్పాయి, పసుపు, మిరప పంటల దిగుబడులను కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా అమ్ముకోలేక భారీగా నష్టపోయారు. దీనికి తోడు తెగుళ్లు వెంటాడాయి. 


భూమి అమ్మినా తీరని అప్పులు


వ్యవసాయం కోసం చేసిన అప్పులు, వడ్డీ తడిసి మోపెడవుతున్నాయి. దీంతో రైతులు తమ భూములు అమ్మినా అప్పులు తీరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం జూదం కంటే ఘోరంగా మారిందని వాపోతున్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పలువురు రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి కూలి పనులకు వెళుతున్నారు. జీవితాంతం కూలి పనులు చేసినా అప్పులు తీరే మార్గం కనిపించడం లేదని, ఏం చేయాలో అర్థం కావడం లేదని కంటతడి పెడుతున్నారు


760 మంది రైతులు.. 4,600 ఎకరాలు 


ఆలమూరులో 760 మంది రైతులు ఉన్నారు. 4,600 ఎకరాల భూమి ఉంది. ఇక్కడి రైతులకు ఉద్యాన పంటల సాగు వెన్నతో పెట్టిన విద్య. కానీ కాలం కలిసిరాలేదు. ఏ రైతును కదిపినా రూ.లక్షల్లో నష్టపోయానని చెబుతున్నారు. ఉద్యాన పంటల సాగు అంటేనే భయం వేస్తోందని, అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అరటితోటలో పని చేస్తున్న ఈ పెద్దాయన పేరు నీరుకట్టు పెద్దనరసింహుడు. వయసు 60 ఏళ్లకు పైనే ఉంటుంది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తనకు 15 ఎకరాల పొలం ఉండేది. 40 ఏళ్లపాటు వ్యవసాయం చేశాడు. ఆ భూమినే నమ్ముకున్నాడు. వివిధ రకాల పంటలను సాగు చేశాడు. రానురానూ పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఎన్నో రకాల విపత్తులను ఎదుర్కొన్నాడు. క్రమంగా వ్యవసాయంలో నష్టాలు పెరిగిపోయాయి. పెట్టుబడికి, కుటుంబ పోషణకు ఏటా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పు ఏకంగా రూ.కోటి దాటింది. ఏటా నష్టాలే తప్ప రూపాయి మిగులుబాటు కాలేదు. దీంతో అప్పు తీర్చేందుకు ఉన్న 15 ఎకరాలనూ అమ్మేశాడు. అయినా అప్పు తీరలేదు. ఒకప్పుడు పదిమందికి పని కల్పించిన ఈ రైతు.. ఇప్పుడు దినసరి కూలీగా మారిపోయాడు. ఈయనతో పాటు చిన్న కొడుకు రోజూ రూ.300 కూలి పనికి పోతున్నారు.


ఈ రైతు పేరు పత్తి ప్రసాద్‌. అలమూరు గ్రామం. వయసు 60 ఏళ్లు. ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. 22 ఎకరాల పొలం ఉండేది. 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. అరటి, మిరప, పసుపు, వరి పంటలు సాగు చేశాడు. అయితే పెట్టుబడులు సరిగా చేతికందలేదు. వరుసగా నష్టాలు వస్తున్నాయి. దీంతో నాలుగేళ్ల క్రితం అప్పు తీర్చేందుకు 6.5 ఎకరాలు అమ్మాడు. అయితే మూడేళ్లుగా మళ్లీ నష్టాలే. దీంతో ప్రసాద్‌ ఆరు నెలల క్రితం మరో 6.5 ఎకరాలు అమ్మి అప్పు తీర్చాడు. ఇక 10 ఎకరాలు మాత్రమే ఉంది. అప్పులు తీర్చేందుకు ఇప్పటికి రెండుసార్లు 13 ఎకరాలు అమ్మానని, భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 


రూ.60 లక్షల నష్టం..


అరటి, పసుపు, బొప్పాయి పంటలు సాగు చేశాను. పెట్టుబడులు కూడా చేతికందలేదు. రూ.60 లక్షలు నష్టపోయాను. మూడేళ్లు వరుసగా నష్టాలే మిగిలాయి. వ్యవసాయంపై విరక్తి వస్తోంది. 


- బాచేపల్లె వెంకటనారాయణ, ఆలమూరు 


రూ.50 లక్షలు నష్టపోయాను.. 


ఉద్యాన పంటల సాగంటేనే భయమేస్తోంది. మూడేళ్లలో రూ.50 లక్షలు నష్టపోయాను. అరటి, బొప్పాయి, పసుపు పంటలు సాగు చేశాను. పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. 


- గురుప్రసాద్‌, ఆలమూరు 


గిట్టుబాటు కాక దున్నేశా..


మూడేళ్ల నుంచి ఉద్యాన పంటల సాగు కలిసిరావడం లేదు. రూ.40 లక్షలు నష్టం వచ్చింది. అరటి, పసుపు, బొప్పాయి, మిరప సాగు చేశాను. అరటికి గిట్టుబాటు ధర లేక తోటను దున్నేశాను. మిరప పంటకు వైరస్‌ సోకింది. దీంతో దాన్ని కూడా దున్నేశాను. 


- పత్తి బ్రహ్మయ్య, ఆలమూరు 


వ్యవసాయం అంటే భయమేస్తోంది.. 


వ్యవసాయం అంటే భయమేస్తోంది. అందులో ఉద్యాన పంటలు సాగు మరింత ఇబ్బందికరంగా మారింది. ఏ పంట సాగు చేసినా పెట్టుబడి ఎకరానికి రూ.లక్ష దాటుతుంది. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. రూ.60 లక్షలు నష్టపోయాను. 


- బాలయ్య, ఆలమూరు 


ప్రభుత్వ తోడ్పాటు ఏదీ..?


ఉద్యాన పంటలు సాగు చేసినవారికి పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. నాకు భారీగా అప్పులు మిగిలాయి. వ్యవసాయం అంటేనే విరక్తి వస్తోంది. ప్రభుత్వం ఉద్యాన పంటలకు సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం.                     


  - శ్రీనివాసులు, రైతు, ఆలమూరు 

Updated Date - 2021-12-03T05:57:44+05:30 IST