Abn logo
Sep 28 2021 @ 00:53AM

విరిగిపడిన కొండచరియలు

సొరంగం ప్రాంతంలో జారిపడిన కొండచరియలు

చిట్టినగర్‌ సొరంగం ప్రాంతంలో ప్రమాదం

భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు


చిట్టినగర్‌, సెప్టెంబరు 27 : చిట్టినగర్‌ సొరంగం ప్రాంతంలోని నివాసాల మధ్య సోమవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో ఆ ఇళ్లలో నివసించే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు. 


పదేపదే విన్నవించుకున్నా..

కొండరాళ్లు దొర్లిపడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు పదేపదే విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. రాళ్లుపడినప్పుడు వచ్చి హడావిడి చేసి వెళ్లిపోవడం మినహా ఎవరూ ఏమి చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు పడి ఎవరైనా మరణిస్తే పరామర్శించి, ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప రాళ్లు దొర్లిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 


మేయర్‌ పరామర్శ

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి సందర్శించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ ప్రాంత ప్రజలను సమీపంలోని కల్యాణ మండపంలోకి తరలించి,  భోజన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మేయర్‌తోపాటు సీఈ ప్రభాకరరావు, ఈఈ నారాయణమూర్తి ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు. 


ప్రజలు సురక్షితంగా బయటకు

కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో భయంతో ఇళ్లలోనే ఉన్న నివాసితులను కొత్తపేట సీఐ మోహనరెడ్డి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వర్షం ఆగకుండా కురుస్తున్నందున మళ్లీ రాళ్లు పడే అవకాశం ఉన్నదని, ప్రజలు సురక్షిత ప్రాంతంలో ఉండాలని ఆయన సూచించారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను, తమ సిబ్బంది అందుబాటులో ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. 


ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం మహిళా నాయకురాలు పాలవల్లి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని, వెంటనే కొండప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.