తొలిదశకే భూములు ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-09-21T08:46:39+05:30 IST

తొలిదశకే భూములు ఇవ్వలేదు

తొలిదశకే భూములు ఇవ్వలేదు

ఏకమొత్తంలో అప్పగించడంలో ప్రభుత్వం విఫలం 

ఫస్ట్‌ ఫేజ్‌కు ఇంకా 225 ఎకరాలు సేకరించాల్సి ఉంది

బందరు పోర్టు  వేరేవారికి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వండి

ఎన్‌ఎంపీఎల్‌ తరఫు లాయర్‌ వినతి 

కాంట్రాక్టును రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది

ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వకండి: ఏజీ


అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన మొదటి విడత భూములు కూడా అప్పగించలేని నవయుగ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌(ఎన్‌ఎంపీఎల్‌) హైకోర్టుకు నివేదించింది. ఈ విషయం 2021 ఆగస్టులో ప్రభుత్వం జారీచేసిన జీవో.9ని పరిశీలిస్తే అర్థమవుతుందని పేర్కొంది. ఫస్ట్‌ ఫేజ్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇంకా 225 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపింది. ఒప్పందం మేరకు బందరు పోర్టు నిర్మాణాన్ని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడంలో ఎన్‌ఎంపీఎల్‌ విఫలమైందని పేర్కొంటూ ఆ కంపెనీతో చేసుకున్న కన్‌సెషన్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 8న ప్రభుత్వం జీవో.66 జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్‌ఎంపీఎల్‌ డైరెక్టర్‌ వై.రమేశ్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి... ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ఎన్‌ఎంపీఎల్‌ పిటిషన్‌ను ఈ ఏడాది ఆగస్టు 25న కొట్టివేశారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు ఎన్‌ఎంపీఎల్‌ అప్పీల్‌ వేసింది. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదిస్తూ... ఎన్‌ఎంపీఎల్‌ కాంట్రాక్టు నిబంధనలకు లోబడి వ్యవహరించలేదన్నారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ప్రాజెక్టుకు అవసరమైన భూములను ఏ వివాదం లేకుండా ఏకమొత్తంలో అప్పగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్‌ఎంసీఎల్‌ తిరస్కరించిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కాంట్రాక్టును రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రస్తుతం పోర్టు భూములు ఎన్‌ఎంపీఎల్‌ ఆధీనంలో లేవన్నారు. పోర్టు నిర్మాణాన్ని ల్యాండ్‌లార్డ్‌ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బిడ్లు తెరవలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడో పార్టీకి అప్పగించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో.9ని ఎన్‌ఎంపీఎల్‌ సవాల్‌ చేయలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రజాహితం, భారీ వ్యయంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్ధించారు. ఎన్‌ఎంపీఎల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ రిప్లై వాదనలు వినిపిస్తూ... కాంట్రాక్టు నిబంధనలకు అనుగుణంగా ఏకమొత్తంలో భూములు అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభు త్వం ఇస్తామన్న స్థలం కూడా ఆక్రమణలో ఉందన్నారు. అవసరమైన భూములు అప్పగించకుండా పోర్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసిందని, రాయితీలకు వీలుకల్పిస్తున్న స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌(ఎన్‌ఎ్‌సఏ) అమలు చేయాలని ఎన్‌ఎంపీఎల్‌ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు. ఎన్‌ఎ్‌సఏ చేసుకొనేందుకు ఎన్‌ఎంపీఎల్‌ ముందుకు రాలేదన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదన్నారు. రిట్‌ పిటిషన్‌ విచారణలో ఉండగానే ల్యాండ్‌లార్డ్‌ మోడల్‌లో ప్రాజెక్టును వేరేవారికి అప్పగించేందుకు జీవో.9 తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోను సవాల్‌ చేయలేదనే కారణంతో మధ్యంత ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని వాదించడం సరికాదన్నారు. ప్రాజెక్టు పను ల కోసం ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. నిర్మాణ పనులు వేరే సంస్థకు అప్పగించకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-09-21T08:46:39+05:30 IST