ఉద్యాన శిక్షణ కేంద్రాలపై శీతకన్ను

ABN , First Publish Date - 2020-08-11T10:12:06+05:30 IST

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ఆదివాసీ గిరిజనులకు ఆర్థికంగా దన్నునివ్వడం, అడవులు అంతరించి పోకుండా పోడు వ్యవసాయాన్ని నివారించాలనే లక్ష్యంతో

ఉద్యాన శిక్షణ కేంద్రాలపై శీతకన్ను

ఆదాయం ఉన్నా పట్టించుకోని ఐటీడీఏ

ఆదివాసీలకు శాపంగా మారిన వైనం

రక్షణ లేక కబ్జాకు గురవుతున్న భూములు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) 

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ఆదివాసీ గిరిజనులకు ఆర్థికంగా దన్నునివ్వడం, అడవులు అంతరించి పోకుండా పోడు వ్యవసాయాన్ని నివారించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉద్యానవన ఉత్పత్తి శిక్షణ కేంద్రాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో   మొత్తం ఆరు ఉద్యాన వనాలను ఏర్పాటు చేశారు. ఇందులో కుమరం భీం జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి, మంచిర్యాల జిల్లాలో మూడు ఉద్యావనాలను అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించి ఒక్కో ఉద్యావనానికి ఉద్యాన విస్తీర్ణ అధికారులను కూడా నియమించారు. ఒక్కో ఉద్యానవనంలో మామిడి, పనస, సపోట, జామ, హైబ్రిడ్‌ రేగు, నిమ్మ, ఉసిరి, చింత, మునగ వంటి ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలు నాటి గిరిజనులకు ఆధునిక వ్యవసాయంలో శిక్షణ ఇవ్వాలనేది ఈ కేంద్రాల ముఖ్య లక్ష్యంగా నిర్దేశించారు. అయితే రెండు, మూడు దశాబ్దాలుగా ఐటీడీఏ ఈ శిక్షణ కేంద్రాలపై శీతకన్ను వేయడంతో వాటిలో కార్యకలాపాలు నామ మాత్రంగా సాగుతున్నాయి. 


నామమాత్రంగా కార్యకలాపాలు

ఈఉద్యానవన కేంద్రాల్లో మొక్కలను అంటుకట్టడం, కొత్తగా ఉత్పత్తి చేయడం వంటి ప్రక్రియలపై గిరిజన రైతులకు శిక్షణ ఇస్తున్నారు. మొదట్లో దీని కార్యకలాపాలు అనుకున్న రీతిలో సాగినప్పటికీ ఈ ఉద్యాన వనాల చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో పశువులు, అటు పందులు, బయటి వ్యక్తుల చొరబాటు వంటి కారణాలతో సిబ్బంది ఉన్నా ఆయా కేంద్రాల్లో కార్యకలాపాలకు సరైన రక్షణ లేకుండా పోయింది. అదీకాకుండా కుమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్‌, జంబుగ ఉద్యానవన కేంద్రాల పరిధిలో మొత్తం 15 మండలాలకు సంబంధించి ఆదివాసీలకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యం గత రెండు, మూడు ఏళ్లుగా పూర్తిగా స్తంభించిపోయింది.


ఆసిఫాబాద్‌ ఉద్యావన శిక్షణ, ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి వాంకిడి, కెరమెరి, ఆసిఫాబాద్‌, తిర్యాణి, రెబ్బెన, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాలకు, కాగజ్‌నగర్‌ డివిజన్‌కు సంబంధించి జంబుగ క్షేత్రం ద్వారా కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం మండలాలకు పండ్ల మొక్కల పంపిణీ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ శిక్షణ కార్యక్రమాలు మాత్రం దాదాపుగా నిలిచి పోయాయి. ఫలితంగా ఈ కేంద్రాలను నామమాత్రం కానివ్వకుండా ఇక్కడ నియమితులైన అధికారి ప్రభుత్వానికి హరితహారం కింద పండ్ల మొక్కలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఐటీడీఏ ఖాతాలకు జమ చేస్తున్నప్పటికీ ఐటీడీఏ మాత్రం ఒక్క పైసా విదిలించడం లేదు. దాంతో ఆయా క్షేత్రాల్లో నిధులు లేక ఉన్న మొక్కలను కూడా సంరక్షించలేని పరిస్థితులు దాపురించాయి.


కంచె వేసి వదిలేశారు 

ఐటీడీఏ ఉద్యానవన శిక్షణ, ఉత్పత్తి కేంద్రాలకు ఇన్నాళ్లు ఎలాంటి రక్షణ లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలాయి. ఈ క్రమంలో ఉద్యానవనాల దుస్థితిపై ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించడంతో రెండేళ్ల క్రితం ఎట్టకేలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. పండ్ల చెట్లను సంరక్షించి వాటి నుంచి ఫల సాయాన్ని తీయడంలో ఆ శాఖ విఫలమైందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్ల చెట్లను హర్వేస్టింగ్‌ చేస్తే మెరుగైన ఫలసాయం అందుతుందని అందులో పనిచేసే సిబ్బంది చెబు తున్నారు. ముఖ్యంగా ఏళ్ల క్రితం నాటిన మొక్క లనే ఇంకా ఫలసాయానికి ఉపయోగిస్తుండటం వల్ల ఆశించిన రీతిలో దిగుబడులు రావడం లేదు. పాత చెట్లను తొలగించి కొత్తగా ప్లాంటేషన్‌ చేయిస్తే తిరిగి పూర్వవైభవం సంతరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఐటీడీఏ ఈ ఉద్యాన వనాలపై శీతకన్ను వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


నిన్న, మొన్నటి వరకు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న తోటకు ప్రత్యేకంగా గార్డెనర్‌ పోస్టు ఉండేది. దీని పరిధిలో జంబుగ ఉద్యానవనం కూడా ఉండడంతో ఈ రెండింటి పర్యవేక్షణ జరిగేది. అయితే గత ఏడాది సదరు ఉద్యోగిని ఇక్కడి నుంచి బెల్లంపల్లికి మార్చడంతో ఇక్కడ తోటమాలి లేని పరిస్థితి నెలకొంది. దాంతో ఇక్కడ రోజువారీ కూలీలే తోటమాలీల అవతారమెత్తి ఉద్యానవనాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకం కింద పంపిణీ చేస్తున్న పండ్ల మొక్కలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఉద్యాన వనాలకు ఉంది. కానీ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా మూడేళ్లుగా పండ్ల మొక్కల పెంపకం ఆగిపోయింది. 

Updated Date - 2020-08-11T10:12:06+05:30 IST