పరిష్కారానికి నోచుకోని పోడు భూములు

ABN , First Publish Date - 2021-01-23T05:25:03+05:30 IST

ఉమ్మడి జిల్లాలో వివాదాస్పద అటవీ భూములు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని భూముల్లో రైతులు సాగు చేస్తున్నా పట్టాలు లేవు.

పరిష్కారానికి నోచుకోని పోడు భూములు
గాంధారిలోని పోడు భూములు

- పూర్తయిన జాయింట్‌ సర్వే
- ప్రభుత్వ నిర్ణయం కోసం రైతుల ఎదురుచూపు
నిజామాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి జిల్లాలో వివాదాస్పద అటవీ భూములు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని భూముల్లో రైతులు సాగు చేస్తున్నా పట్టాలు లేవు. కొన్ని భూములు అటవీ అధికారులకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడంతో సాగు చేస్తున్నారు. రికార్డులు పక్కాగా చేసే సమయంలో ఆ భూములు రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉండడంతో పెండింగ్‌లో ఉన్నాయి.  కొన్ని భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకొని ట్రెంచ్‌లు కొట్టారు. హరితహారం కింద మొక్కలు నాటారు. మరికొన్ని భూములలో జాయింట్‌ సర్వేను పూర్తి చేశారు. ధరణి ద్వారా ఈ భూ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 12వేల ఎకరాల వరకు వివాదాస్పద అటవీ భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల రైతులు సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం వల్ల పంటలను వేస్తున్నారు. మరికొన్ని గ్రామాల పరిధిలో రైతులు పోడు వ్యవసాయం చేపట్టారు. అటవీ  ప్రాంత భూములు కావడం వల్ల రికార్డులు సరిచేసే సమయంలో వాటిని గుర్తించిన అధికారులు కొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 8,170 ఎకరాల వరకు ఈ భూములు ఉన్నాయి. జిల్లాలోని సిరికొండ, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, నవీపేట్‌, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, వర్ని, మోస్రా మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఈ భూములను ఆయా గ్రామాల పరిధిలో రైతులు సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో 4,071 ఎకరాల భూమి ఉంది. జిల్లా పరిధిలోని గాంధారి, లింగంపేట్‌, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, తాడ్వాయి, రామారెడ్డి, రాజంపేట్‌, భిక్కనూరు మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. వీటిని ఉమ్మడి జిల్లా పరిధిలో అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్‌ సర్వే చేసి భూములను నిర్ధారించారు. కొన్ని చోట్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములు కావడంతో స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కందకాలను తవ్వారు. వారు హరితహారం కింద మొక్కలను పెట్టారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో గడిచిన కొన్నేళ్లుగా ఈ భూములను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా కొన్ని భూముల్లో సాగు కొనసాగుతోంది.  ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ రైతులు తమకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వడం వల్ల తాము సాగు చేస్తున్నామని వివరిస్తున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అటవీ భూములు కావడంతో అధికారులు కూడా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ధరణిలో  కూడా అటవీ భూములుగా ఉండడం వల్ల పట్టాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున చర్యలు చేపట్టడం లేదు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో ఉన్న ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని మాత్రం రైతులు కోరుతుండడంతో ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ల సమావేశంలో కూడా ఈ భూములపైన సీఎం కేసీఆర్‌ చర్చించారు. గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నా అటవీ భూములు కావడంతో ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఏమి చేసే పరిస్థితి కనిపించడం లేదు. అధికారుల సమాచారాన్ని బట్టి మ్యూటేషన్‌, సాదా బైనామాలు పూర్తయిన తర్వాత ఈ భూములపైన దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. సాగు చేస్తున్న భూములను గుర్తించి గతంలో ఇచ్చిన పట్టాల ఆధారంగా ప్రభుత్వం ఫారెస్ట్‌ రైట్స్‌ కింద హక్కును కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూ సమస్యలన్నీ పరిష్కారమైన తర్వాత వీటిపైన నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది.  ఇప్పటికే మండలాల వారీగా ఈ భూముల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. రైతులు మాత్రం తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ భూముల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నట్లు తెలుస్తోంది. పట్టాలు ఇచ్చినవి మినహా మిగతా భూములపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అటవీ భూముల రక్షణకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో పోడు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఫారెస్ట్‌ రేంజ్‌ల పరిధిలో నిఘా పెట్టి అటవిని నరికివేయకుండా చూస్తున్నారు. జాయింట్‌ సర్వే ద్వారా ఈ భూములు అటవీశాఖవని తేలినందున ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని అటవీ, రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఊరట కలుగనుంది.

Updated Date - 2021-01-23T05:25:03+05:30 IST