Abn logo
Apr 22 2021 @ 23:53PM

భూసార పరీక్షలకు మంగళం

భూసార పరీక్షలకు మట్టిని సేకరిస్తున్న వ్యవసాయ సిబ్బంది(ఫైల్‌)

నిధుల లేమితో రెండేళ్ల నుంచి నిలిపివేత

పంటల దిగుబడిపై ప్రభావం

ఆందోళన చెందుతున్న రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సాగుపై ప్రత్యక్షంగా... పరోక్షంగా 75 శాతం మంది ఆధారపడుతున్నారు. ఇంతటి కీలకమైన వ్యవసాయంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భూసార పరీక్షలను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. సాధారణంగా జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు. రాగులు, వేరుశనగ, అపరాలు, చిరుధాన్యాలు తర్వాతి స్థానాల్లో ఉంటాయి. మరోవైపు ఉద్యాన పంటలకు జిల్లా పేరొందింది. వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో సారం తక్కువగా ఉంది. కొన్నిచోట్ల చౌడు నేలలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేస్తేనే అన్నదాతకు ఆదాయం సమకూరుతుంది. లేదంటే నష్టపోవాల్సిందే. గత ఏడాది నుంచి నిధుల లేమితో భూసార పరీక్షలు నిలిపేశారు. ఫలితంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 


నష్టపోవాల్సిందేనా..?

రైతు ప్రయోజనాలు, సాగు భూముల మనుగడ కాపాడేందుకు ప్రభుత్వమే ఉచితంగా భూసార పరీక్షలు చేయించేది. జిల్లాలో 2.86 లక్షల హెక్టార్లలో వివిధ ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.  ఏటా మార్చి చివరికి పంటలన్నీ చేతికొచ్చేస్తాయి. ఏప్రిల్‌, మే నెలల్లోనే భూములు ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో భూసార పరీక్షలు చేసేవారు. రైతుల పొలాల నుంచి వ్యవసాయాధికారులు మట్టి నమూనాలు సేకరించి... ఆమదాలవలస పరిశోధన కేంద్రానికి పంపించేవారు. వాటిని పరీక్షించి భూమిలో సారం ఏ మేరకు ఉంది? సారం పెంచేందుకు ఎలాంటి ఎరువులు వాడాలి. ఏయే పంటలు సాగు చేయవచ్చనే వివరాలతో రైతులకు ప్రత్యేక కార్డులు ఇచ్చేవారు. కానీ, జిల్లాలో రెండేళ్ల నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. నిధుల లేమి కారణంగా ప్రభుత్వం దీని ఊసెత్తడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ మరో నెలరోజుల్లో ప్రారంభం కానుంది. సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. భూసారం గురించి తెలియకపోవడంతో ఎలాంటి పంటలు వేయాలి. ఏఏ ఎరువులు వాడాలోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  భూముల మనుగడ కోసం రైతులే సొంతంగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.   భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడితే దిగుబడులు బాగా వస్తాయని  చెబుతున్నారు. కానీ చాలా మంది రైతులు ఎరువుల వ్యాపారుల సలహాలతోనే సాగు చేస్తున్నారు.  దీంతో దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే స్పందించి భూసార పరీక్షలు చేయాలని రైతులు కోరుతున్నారు. 


నిధుల కొరత 

కేంద్ర ప్రభుత్వ నిధులతో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఆమదాలవలస వద్ద భూసార పరీక్ష కేంద్రం ఉంది. వాటి ద్వారా ఏటా కనీసం 40 వేల నమూనాలు సేకరించి పరీక్షించే వీలుంది. కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో నమూనాల పరీక్షలు అటకెక్కాయి. కనీసం సంచార ప్రయోగశాల వాహన నిర్వహణకు నిధులు లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఒక్క నమూనా కూడా అధికారులు సేకరించలేదు. ప్రస్తుతం ఈ సిబ్బంది రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. 


దిగుబడి తగ్గుతోంది

నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా నీరు, మట్టి నమూనాలు అధికారులు తీసుకుని పరీక్షించి వాటి పత్రాలు చేతికిచ్చేవారు. నేలలో సారం ఎంత ఉంది? ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది? ఎరువులు ఎంత మేర వేయాలనే అంశాల్ని వివరించేవారు. గత ఏడాది నుంచి నమూనాల సేకరణే నిలిచిపోయింది. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. 

- పులకల తులసయ్య, రైతు, పెద్దలక్ష్మీపురం


ఖర్చులు పెరుగుతున్నాయి...

గతంలో పొలంలో మట్టి తీసి పరీక్షలు చేసి పత్రాలు ఇచ్చారు. వాటి ఆధారంగా ఎరువు వాడేవాళ్లం. గత సంవత్సరం భూసార పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఎక్కువ మోతాదులో ఎరువులు వాడి అధికంగా ఖర్చులు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాదైనా భూ సార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.  

- దున్న పురుషోత్తం, రైతు, డొంకూరు


అనుమతి రాలేదు

కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ తాత్కాలికంగా నిలిపివేశాం. ప్రస్తుతం మండలానికి ఒక రైతుభరోసా కేంద్రాన్ని ఎంపిక చేసి.. అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. రోజూ కొందరు రైతులు స్వతహాగా నమూనాలు తీసుకువస్తున్నారు. వాటికి పరీక్షలు నిర్వహించి సలహాలు ఇస్తున్నాం.  

- జి.సత్యవతి, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం, ఆమదాలవలస

Advertisement