విశాఖలో భూముల విలువను పెంచిన ప్రభుత్వం.. గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే..

ABN , First Publish Date - 2020-08-01T15:43:24+05:30 IST

భూముల రిజిస్ట్రేషన్‌ విలువను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచుతున్నది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ పెరుగుదల, తగ్గుదలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ విలువను పెంచాలని ఆదేశించింది.

విశాఖలో భూముల విలువను పెంచిన ప్రభుత్వం.. గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే..

భూముల విలువల మళ్లీ పెంపు

5 నుంచి 50 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదనలు

భీమిలిలో వ్యవసాయ భూములపై 50 శాతం పెంపు

ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం...

వెబ్‌సైట్‌లో వివరాలు.. నేటి నుంచి అభ్యంతరాల స్వీకారం

ఆగస్టు 10 నుంచి కొత్త రేట్లు అమలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): భూముల రిజిస్ట్రేషన్‌ విలువను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచుతున్నది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ పెరుగుదల, తగ్గుదలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ విలువను పెంచాలని ఆదేశించింది. విశాఖ జిల్లాలో కనిష్ఠంగా ఐదు శాతం, గరిష్ఠంగా 50 శాతం మేర భూముల విలువ పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. భీమిలిలో వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచనున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం మేర పెరుగుతుంది. ఈ మేరకు వివరాలను వెబ్‌సైట్‌లో వుంచారు. శనివారం నుంచి అభ్యంతరాలను స్వీకరించి, పదో తేదీ నుంచి కొత్త ధరలు అమలుచేస్తారు.


ప్రతి ఏటా ఆగస్టులో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ సవరణ ఉంటుంది. పేరుకు సవరణే అయినా.... ధరలు పెంచడం షరా మామూలే! గత ఏడాది పది శాతం వరకు పెంచారు. కాగా విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగాయి.   వీటికి అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నిన్న మొన్నటి వరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేయకపోయినప్పటికీ.... సబ్‌ రిజిస్ట్రార్లు భూముల ధరల పెంపునకు నెల రోజుల క్రితమే కసరత్తు చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కనిష్ఠంగా 5 శాతం, గరిష్ఠంగా 50 శాతం మేర భూముల విలువ పెంచినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్‌ సారథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్లు అంతా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి శుక్రవారం సమర్పించారు. వాటిని ఆయన సమీక్షించి ప్రజలకు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఈ వివరాలన్నీ శనివారం నుంచి అందుబాటులో ఉంటాయి.   


ఎక్కడెక్కడ.... ఎంతెంత పెరుగుతుంది 

ముడసర్లోవ ప్రాంతంలో గజం ధర రూ.11 వేలు ఉంది. ఇక్కడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు ఉండడం, హెల్త్‌సిటీ రావడంతో ధరలు బాగా పెరిగాయి.  ఇక్కడ 27 శాతం పెంపునకు ప్రతిపాదించారు.


మధురవాడ కేజీహెచ్‌ కాలనీలో గజం ధర రూ.18,100 ఉండగా 5 శాతం పెంచి రూ.19 వేలకు ప్రతిపాదించారు.


పీఎంపాలెం ఎస్సీ కాలనీలో 8 శాతం, రామాలయం వీధిలో 20 శాతం పెంచారు. ఇక్కడ గజం రూ.28,600 ఉండగా.... రూ.34 వేలకు ప్రతిపాదించారు. 


కొమ్మాదిలో గజం రూ.15 వేలు ఉండగా రూ.18 వేలు చేశారు.


ఎండాడలో రూ.18 వేలు ఉన్న దగ్గర రూ.20 వేలు, రూ.23,700 ఉన్నచోట రూ.28 వేలకు పెంచుతూ ప్రతిపాదించారు.


పరదేశిపాలెంలో 22 శాతం పెంచుతూ, రూ.13 వేల ధరని రూ.18 వేలు చేశారు.


రుషికొండ బీచ్‌ రోడ్డులో రూ.23,300 ఉన్న భూములను రూ.25 వేలు చేశారు. 


మధురవాడలో రోడ్డు పక్కన గజం రూ.38 వేల నుంచి రూ.45 వేలు చేశారు. 


ఆనందపురంలో పెందుర్తి నుంచి వచ్చేమార్గంలో నీళ్లకుండీలు, శొంఠ్యాం తదితర ప్రాంతాల్లో  5 శాతం నుంచి 13 శాతం వరకు పెంపుదల ఉంది.


భీమిలిలో వ్యవసాయ భూములు ఎకరా ధర రూ.2 కోట్లు కాగా మార్కెట్‌లో రూ.5 కోట్లకు అమ్ముతున్నారు. దీంతో 50 శాతం పెంచుతూ రూ.3 కోట్లు చేసింది. ఇక్కడ మరికొన్ని ప్రాంతాల్లో 20 శాతం వరకు పెంచారు.


నగరంలోని డాబాగార్డెన్స్‌, సీతమ్మధార, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కువ ధరలు ఉండడంతో 5 నుంచి 10 శాతం వరకే పెంపును ప్రతిపాదించారు.


పెందుర్తి, గోపాలపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 5 నుంచి 13 శాతం, గాజువాక పరిధిలో 5 నుంచి 10 శాతం పెంపునకు సిఫారసు చేశారు.


అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు: కె.మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్‌

స్థానికంగా ఉన్న వ్యత్యాసాలకు అనుగుణంగా భూముల ధరలను సవరిస్తూ ప్రతిపాదనలు చేశాం. జాయింట్‌ కలెక్టర్‌ సమీక్షించారు. ఈ వివరాలన్నీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వారం రోజుల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే... వాటిపై కూడా జేసీ సమక్షాన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఖరారు చేసిన ధరలను ఆగస్టు 10 నుంచి అమలు చేస్తారు.


Updated Date - 2020-08-01T15:43:24+05:30 IST