గుట్టలెక్కిన పట్టా

ABN , First Publish Date - 2020-07-01T07:47:33+05:30 IST

దూరపు కొండలు నునుపు! ఈ సామెతను అధికారులు తు.చ. తప్పక పాటిస్తున్నట్టే ఉంది! ఊరికి దూరం, పట్టణానికి ఎడంగా ఉండే భూములపైకి ఎవరికీ సాధారణంగా కన్ను పోదు!...

గుట్టలెక్కిన పట్టా

పెద్దలకు రేటు కోసం పేదలకు పాట్లు

విశాఖలో పొలాల మధ్య స్థలాలు.. వెళ్లాలంటే శ్మశానం దాటాల్సిందే

సిక్కోలులో ఏకంగా సమాధుల్లోనే.. ఇల్లేసుకొంటే కాపురం వాటిలోనే..

విశాఖ పాయకరావుపేటలో ప్లాట్లు.. వానపడితే ఈ స్థలాలన్నీ మునక

చెక్‌డ్యామ్‌ దిగి, ఎక్కి 2 కిలోమీటర్లు పోతేనే ‘పేదింటి స్థలాల’కు దారి

డీపట్టాలకూ అదిరిపోయే రేటు.. విజయనగరంలో అధికారుల సిత్రం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): దూరపు కొండలు నునుపు! ఈ సామెతను అధికారులు తు.చ. తప్పక పాటిస్తున్నట్టే ఉంది! ఊరికి దూరం, పట్టణానికి ఎడంగా ఉండే భూములపైకి ఎవరికీ సాధారణంగా కన్ను పోదు! కానీ, అధికారులు మాత్రం ‘పేదింటి ఇంటి స్థలాల’ కోసం ఈ భూములనే ఏరికోరి.. అదీ మార్కెట్‌ రేటుకు మించి చెల్లించి సేకరించేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో నివేశనాలు లేవనేది కొంత నిజమే! దానికితోడు, అన్ని యోగ్యతలు గల భూమిని కొనడానికి సర్కారు దగ్గర డబ్బు లేదనీ అధికారులు ఒకనాడు చెప్పేవారు. దానికోసమనే ఊళ్లూ, వాగులూ దాటి భూమి సేకరిస్తున్నామనేవారు. కానీ, పేదల కోసం సేకరించే ఆ ఊరి అంచు భూములకు, వాగు ఒడ్డు స్థలాలకు, కొండ మీది, కొండ దిగువ భూములకు మాత్రం కళ్లు చెదిరే రేటు కడుతున్నారు. ఆ భూములు అధికార పెద్దలవి అయితే చాలు, పేదలను ఎంత దూరమైనా నడిపిస్తున్నారు! ఎన్ని కొండలయినా ఎక్కిస్తున్నారు! ఎన్ని గెడ్డలయినా దాటిస్తున్నారు! వానపడితే బురదమయమయ్యే కొండ సమీప భూములను శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో మూడు గ్రామాల్లోని పేదల కోసం అధికారులు సేకరించారు. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడిలో సేకరించిన బంజరు భూమి.. పొలాల మధ్యలో ఉంది. ఈ గ్రామం నుంచి లేఅవుట్‌కు వెళ్లాలంటే మధ్యలో శ్మశానం దాటాలి! పాయకరావుపేట మేజర్‌ పంచాయతీ పరిధిలో పీఎల్‌ పురంలోని కొండ సమీపంలో వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌కు వెళ్లాంటే పోలవరం ప్రధాన కాల్వ దాటాలి. వర్షమొస్తే కొండవాలు మీదుగా పారే నీళ్లతో ఈ స్థలాలు మునిగిపోతాయి. ఉత్తరాంధ్రలో ‘పేదింటి ఇళ్ల స్థలాల’ తీరుపై ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష కథనం!




శ్మశానం చదును..

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురంలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన 1.02 ఎకరాల్లో కొంత శ్మశాన భూమి కలిసింది. సమాధులుండే చోట చోటు తీసుకొని ఇల్లేసుకొని ఎలా ఉంటామని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒకసారి రోడ్డెక్కి తమ ఆగ్రహం ప్రదర్శించారు కూడా! అయినా, అధికారులు ఈ భూములనే పంపిణీకి సిద్ధం చేయిస్తున్నారు. 


ఇంటిస్థలాలకు మరో 1213 కోట్లు

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): పేదలకు గృహవసతి పథకం కింద మరో రూ.1213.07 కోట్లను జిల్లాలకు విడుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పేదల ఇంటిస్థలాల కోసం ఇప్పటికే రూ.2426 కోట్లపైనే ప్రభుత్వం విడుదల చేసింది. అదనంగా మరో 1500 కోట్లపైనే నిధులు అవసరమని కలెక్టర్లు నివేదించడంతో మరో రూ.1,213.07 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఆర్థికశాఖ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆ వెంటనే నిధుల విడుదలకు కలెక్టర్లకు అనుమతి ఇస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను భూ సేకరణ బిల్లులకు వినియోగించనున్నారు.  పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల కోసం రెవెన్యూశాఖ రాష్ట్రవ్యాప్తంగా 14వే ల ఎకరాలపైనే ప్రైవే టు భూమిని సేకరిస్తోంది.  ఇప్పటికే 13వేల ఎకరాల్లో పొజిషన్‌ తీసుకుంది. భూ సేకరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్లు కేటాయించారు. 2020-21లో మరో రూ.3,500 కోట్లపైనే కేటాయించారు. భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో నిధులను విడుదల చేస్తున్నారు. 


పంటిచ్చే చెరువును పూడ్చారు

60 మంది రైతులకు చెందిన 80 ఎకరాలకు నీరందిస్తున్న చెరువులోని 75 సెంట్ల స్థలాన్ని చదును చేయించారు. ఆయకట్టుకు నీరు అందించే మదుంను(తూము) ఏకంగా మట్టితో కప్పేశారు. రైతుల ప్రతిఘటనను కూడా లక్ష్యపెట్టకుండా విశాఖ జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలోని చెరువులో కొంతభాగాన్ని ఇలా చదును చేసేశారు. ఈ గ్రామంలో గుర్తించిన 24 మంది లబ్ధిదారులలో 15మందికి ఇప్పటికే పక్కా ఇళ్లు, నివాస స్థలాలు ఉండటం మరో విచిత్రం!


వంతెన దాటి.. డ్యామ్‌లోకి దిగి..

కొంత చదును చేసిన.. మరింతగా చెట్లుచేమలతో నిండిన ఈ భూములను విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం అడ్డాం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంగా అధికారులు సేకరించారు. 1.18 ఎకరాలను 47 మంది కోసం సిద్ధం చేస్తున్న ఈ ప్రాంతానికి రావాలంటే ఏలేరు కాలువపై ఉన్న ఫుట్‌ వంతెన దాటాలి. చాకిరేవు గెడ్డపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లోకి దిగాలి. ఈ వర్షాకాలంలో కాలేస్తే జారిపోయే దారుల్లో ఇన్ని ఫీట్లు చేస్తేనే ‘స్థలం’ చేతికొస్తుంది! 


రేటు అదిరింది..

దళితులకు, ఆదివాసీలకు ఇచ్చిన డీ పట్టా భూములు చేతులు మారాయి. ఇప్పుడు ఇవే భూములకు బ్రహ్మాండమైన రేటు పలికింది. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో ఇళ్లు లేని పేదల కోసం ఆ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోని శివరాంపురం సమీపంలో ఈ భూములను అధికారులు సేకరించారు. మార్కెట్‌ రేటు ఎకరం రూ. 12లక్షలకు మించదు. కానీ, రూ. 22 లక్షల చొప్పున 21.87 ఎకరాలను అధికారులు కొన్నారు.  


కో.. అంటే..

ఊరికి దూరం.. కొండ అంచు ప్రాంతం.. నీళ్లు పడవు! ఇక్కడ కొంటే భూములకు రేటేమి పడుతుంది? అయితే, ఆ భూములు నాయకుడివైతే ఎంతయినా ధర పలుకుతుంది మరి! శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామానికి దూరంగా కొండ అంచున స్థానిక అధికార నేతకు ఉన్న 70 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు. 40 మందికి ఈ స్థలంలో ఇళ్ల పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-07-01T07:47:33+05:30 IST