దురుద్దేశంతోనే భూములు వెనక్కి..

ABN , First Publish Date - 2020-07-11T08:33:44+05:30 IST

చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) తమకు కేటాయించిన భూములకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న

దురుద్దేశంతోనే  భూములు వెనక్కి..

  • అక్కడ రూ.2700 కోట్ల అభివృద్ధి పనులు
  • చెప్పినదానికి మించే ఉద్యోగాలను ఇచ్చాం
  • ఏపీఐఐసీ నుంచి భూములను కొన్నాం
  • అలాంటప్పుడు సర్కారెలా ఆదేశిస్తుంది?
  • ఏపీ హైకోర్టులో ‘అమర రాజా’ వాదనలు
  • ఒప్పందం మేరకు సెజ్‌ ఏర్పాటు కాలేదు
  • దానివల్లే ఇచ్చిన భూములు వెనక్కి : ఏజే
  • ‘మధ్యంతర’ ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) తమకు కేటాయించిన భూములకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, నిబంధనలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని ‘అమర రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’  హైకోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దురుద్దేశంతోనే ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ‘ఏపీఐఐసీ’ని ఆదేశించిందని పేర్కొంది. దరిమిలా ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర పరిశ్రమల శాఖ జారీ చేసిన జీవో 33ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, ఆ జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వుల జారీపై తీర్పును రిజర్వ్‌ చేసింది. 2009లో చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కొత్తపల్లిలో సర్వే నంబరు 1/1బీ, బంగారుపాళ్యం మండలం నూనెగుండ్లపల్లిలోని సర్వే నంబరు 65/1లో అమర రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 483.27 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్నాయంటూ, 253.61 ఎకరాలను వెనక్కి తీసుకొంటూ రాష్ట్ర పరిశ్రమలశాఖ గత జూన్‌ 30వ తేదీన జీవో 33 జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్‌ చేస్తూ అమరరాజా ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధి అంజనీ కిశోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఎదుట విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. అమర రాజా సంస్థ సదరు భూముల్లో రూ.2700 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ‘‘ఏపీఐఐసీతో జరిగిన ఒప్పందంలో కంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపట్టింది. అమరరాజా ప్రాజెక్టును రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుగా భావిస్తూ పొరపాటు పడుతున్నారు. అవసరమైతే అడ్వకేట్‌ జనరల్‌ను తీసుకెళ్లి, అక్కడ సంస్థ చేపట్టిన అభివృద్ధిని చూపిస్తాం. అదేవిధంగా ఒప్పందం కంటే ఎక్కువమందికే ఉద్యోగాలు కల్పించారు. వాస్తవం ఇలా ఉండగా, అక్కడ తక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. దేని ఆధారంగా ప్రభుత్వం చెబుతుందో అర్థం కావడం లేదు. ఆ భూములను గతంలో ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించగా, ఆ సంస్థ వద్ద అమరరాజా సంస్థ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి జరిగిన లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులున్నాయి. ఎక్కడా ఒప్పంద నిబంధనల్ని ఉల్లంఘించలేదు. సదరు భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అయినా, దురుద్దేశంతో ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఏపీఐఐసీని ఆదేశించింది. అందువల్ల ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలుపుదల చేయాలి’’ అని సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు అభ్యర్థించారు.


కాగా, ఏపీఐఐసీతో జరిగిన ఒప్పందం మేరకు అమరరాజా సంస్థ సెజ్‌ను (ప్రత్యేక ఆర్థికమండలి) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇంతవరకూ అది కార్యరూపం దాల్చలేదని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం పేర్కొన్నారు. ఇది నిబంధనల ఉల్లంఘన అయినందనే ప్రభుత్వం తగిన చర్యలకు దిగిందని తెలిపారు. ‘‘ప్రభుత్వం చొరవ వల్లే ఏపీఐఐసీ...అమరరాజాకు భూములు ఇచ్చింది. అలాంటప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకోమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.  అందువల్ల జీవోను సస్పెండ్‌ చేయొద్దు’’ అని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం కోరారు.

Updated Date - 2020-07-11T08:33:44+05:30 IST