భూబాదుడు

ABN , First Publish Date - 2020-08-07T11:25:18+05:30 IST

జిల్లాలో ఆయా ప్రాం తాల్లో జరుగుతున్న రిజిస్ర్టేషన్ల సంఖ్య, ఎంతశాతం ఆస్తులు చేతులు మారుతున్నాయన్న గణాంకాల ..

భూబాదుడు

సర్కారు రూటుమార్చింది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చేపట్టిన భూ బాదుడును కొన్నిచోట్లకే పరిమితం చేసింది. తొలుత మొత్తం భూముల విలువ పెంచాలని భావించినప్పటికీ ఈ ఏడాదికి నగరాలు, పట్టణాలకు పరిమితమై గ్రామీణ ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయానికొచ్చారు. జనంలో వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో భూముల విలువను భారీగా పెంచేందుకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ సిద్ధమైంది.


వార్డులు, ప్రాంతాల వారీగా ప్రస్తుతం అమలులో ఉన్న ధరలు పెంచేందుకు ప్రతిపాదించిన ధరలతో పట్టికలను సిద్ధం చేసిన ఉన్నతాధికారులు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్‌లకు పంపించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఈనెల 10నుంచి పెరిగిన ధరలను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ధేశించినందున ఈలోగా అవసరమైతే సవరణలను పూర్తిచేయాల్సి ఉంది. ధరలను అన్ని ప్రాంతాల్లో ఒకేరకంగా కాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకుని పెంపునకు ప్రతిపాదించినట్లు సమాచారం. 


మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోనే భూముల విలువ పెంపు 

ఈనెల 10 నుంచిఅమలుకు రంగం సిద్ధం 

భారీగా పెరగనున్న భూముల విలువలు 

సరాసరిన 15శాతం పెంపు 

కొన్ని ప్రాంతాల్లో 50 శాతంకు పైనే ప్రతిపాదన  

ఇక గ్రామ సచివాలయాల్లోనూ రిజిస్ర్టేషన్లు 

ప్రయోగాత్మకంగా వచ్చేనెల 1 నుంచి రెండు చోట్ల అమలు


కందుకూరు, ఆగస్టు 6: జిల్లాలో ఆయా ప్రాం తాల్లో జరుగుతున్న రిజిస్ర్టేషన్ల సంఖ్య, ఎంతశాతం ఆస్తులు చేతులు మారుతున్నాయన్న గణాంకాల ఆధారంగా భూముల విలువ పెంచేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధిక లావాదేవీలు ఉన్న ప్రాంతాల్లో పెంపు కూడా ఎక్కువగా ఉండేలా లావాదేవీలు తక్కువ ఉన్న చోట్ల భూముల విలువ పెంపు తక్కువ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రతిపాదించిన ధరల ప్రకారం అత్యల్పంగా ప్రస్తుతం ఉన్న ధరపై 3.5శాతం పెరుగుతుండగా అత్యధికంగా 40శాతం వరకు కూడా పెంపునకు ప్రతిపాదించారు. అయితే సరాసరిన చూస్తే అధికశాతం ప్రాంతాల్లో 12 నుంచి 15శాతం వరకు పెంపునకు అధికారులు ప్రతిపాదించారు.


 తహసీల్దార్లు, కమిషనర్లు తెలిపే అభ్యంతరాలను బట్టి వీటిలో కొంత తగ్గే అవకాశం ఉండగా మరికొన్నిచోట్ల పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈనెల 10 నుంచి జరిగే రిజిస్ర్టేషన్లకు పెంచిన ధరలు అమల్లోకి రానుండటంతో ప్రజలు ఈలోగా రిజిస్ర్టేషన్లు పూర్తి చేసుకునేందుకు హడావుడి పడుతున్నారు. దీంతో అనేక పట్టణాల్లో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ఆ నిబంధనలు తుంగలో తొక్కి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు మాత్రం కిటకిటలాడుతున్నాయి.


గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు 

పరిపాలన వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం  భూములు రిజిస్ర్టేషన్లు కూడా ఇకముందు గ్రామ సచివాలయాల నుంచే చేసుకునే వెసలుబాటు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఒక్కో రిజిస్ర్టార్‌ పరిధిలో కనీసం రెండు గ్రామ సచివాలయాలను ఎంపిక చేసి సెప్టెంబరు 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా గ్రామ సచివాయాల పరిధిలో గడచిన ఏడాదికాలంలో జరిగిన రిజిస్ర్టేషన్ల సంఖ్య, వాటి విలువను పరిగణనలోకి తీసుకుని అత్యధిక రిజిస్ర్టేషన్లు జరిగి ఉన్న రెండు సచివాలయాలను ఎంపిక చేసి వాటిలో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్లు రిజిస్ర్టార్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


ఈ ప్రయోగాత్మక ప్రయత్నంలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలన్నీ అధిగమించాక అన్ని సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తారని ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం ఉందని, అయితే ఆ డాక్యుమెంటు సంబంధిత ఆస్తి ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌కి పంపించి వారు ఆమోదముద్ర వేశాక పూర్తవుతుందని, గ్రామ సచివాలయాల నుంచి జరిగే రిజిస్ర్టేషన్లకు కూడా ఇదే విధానం అవలంభిస్తామని ఆయన వివరించారు. 


భూముల విలువ పెంపులో కొరవడిన హేతుబద్ధత 

కరోనా విపత్కర పరిస్థితుల్లోను హడావుడిగా పట్టణ  ప్రాంతాల్లో భూముల విలువలను పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయటం, ఈనెల 10 నుండే అమలు చేయనుండటం కేవలం ప్రభుత్వానికి ఏదో రూపంలో ఆదాయం పెరగాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలే కారణంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియను హడావుడిగా చేపట్టడంతో భూముల విలువల పెంపు ప్రతిపాదనల్లో హేతుబద్ధత లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్న ధరకన్నా కూడా అధికంగా పెంపు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా ఉన్న మార్కెట్‌ ధరలో పదోవంతు కూడా రిజిస్ర్టేషన్‌ శాఖ ప్రతిపాదిత ధర లేదని వివరిస్తున్నారు.


ఉదాహరణకు కందుకూరులోని బెస్తపాలెం, ఇస్లాంపాలెం, ఎర్రగుంట హరిజనపాలెం, శ్రీనగర్‌కాలనీ, దాసరిపాలెం, కొత్త హరిజనపాలెం, గోపాలనగర్‌, తూర్పు వడ్డెపాలెం తదితర ప్రాంతాల్లో చదరపు గజం రిజిస్ర్టేషన్‌ విలువ రూ.2,365 ఉండగా ప్రస్తుతం 18.4శాతం వరకు విలువలు పెంచారు. దీంతో చదరపు గజం విలువ రూ.2,650 నుంచి 2,800 వరకు చేరింది. అంటే గది విలువ రూ.25వేలకుపైనే. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో ఆ మేరకు వాస్తవ ధర కూడా లేదని చెబుతున్నారు. ఎస్సీకాలనీలలో అంత ధర పలకదని వాస్తవ ధరకన్నా రిజిస్ర్టేషన్‌ ధరే అధికంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


కమర్షియల్‌పై కనికరమా?

ఇదే సమయంలో కందుకూరులో కమర్షియల్‌ ఏరియాలైన పామూరు రోడ్డు, కనిగిరిరోడ్డుల్లో అంతర్గత వీధుల్లో చదరపు గజం రూ.5,020 ఉండగా అక్కడ మాత్రం కేవలం 9,56శాతం మాత్రమే పెంచి సవరించిన ధరను రూ.5,500 చేశారు. అంటే ఇక్కడ గది రూ.45 వేలన్నమాట. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో మార్కెట్‌ ధర అంతకు పదిరెట్లు ఉండటమే గాక ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేవారంతా సంపన్నులు. అలాంటిచోట మార్కెట్‌ విలువలు హేతుబద్ధంగా పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే అలాకాకుండా పేదలు నివసించే ప్రాంతాల్లో మాత్రం 19శాతం వరకు పెంచి గది ఆరేడు లక్షలు పలికే ప్రాంతాల్లో 9.5శాతం పెంచటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కందుకూరులోనే గాక జిల్లా మొత్తం ఇలాగే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-08-07T11:25:18+05:30 IST